సత్యమే సుందరం

19 Nov, 2017 00:04 IST|Sakshi

23న సత్యసాయి జయంతి

ఆయన అమృతహస్తాలు ఆపన్నులను ఆదుకున్నాయి. కష్టాలలో ఉన్నవారిని సేదతీర్చాయి. ఆయన వితరణ దాహార్తితో పరితపిస్తున్న లక్షలాది ప్రజల దాహార్తి తీర్చింది. ఆయన చేసిన విద్యాదానం ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందించింది. ప్రేమపూరితమైన ఆయన పలుకు, వెచ్చని ఆయన స్పర్శ వేలాదిమందికి ఉపశమనం కలిగించింది. ఆయన నీతిబోధ, సత్యవాక్పాలన, సేవానిరతి ప్రపంచదేశాలన్నింటికీ పాకి, కోటానుకోట్ల మందిని శిష్యులుగా చేసుకుంది. ప్రేమ, శాంతి, సహనం, సత్యం, సేవాతత్పరత వంటి అనేక ఉత్తమ గుణాలు కలగలసిన భగవాన్‌ శ్రీసత్యసాయిబాబా బోధామృతం నుంచి జాలువారిన కొన్ని బిందువులు... భారతదేశం అపూర్వ ఆధ్యాత్మిక సంపదకు పుట్టినిల్లని, మన పూర్వీకులు, ఋషులు చేసిన కృషి ఫలితమే మన సంస్కృతీ సంప్రదాయాలని, ఇటువంటి పవిత్ర భారతదేశంలో మనం పుట్టడం జన్మజన్మల అదృష్టమని బాబా ఎప్పుడూ చెప్పేవారు.

నేను దేవుడనే– మీరూ దేవుడే
నేనూ దేవుడినే, మీరూ దేవుడే, కాని, ఆ విషయం నాకు తెలుసు కాని మీకు తెలియదని పలుమార్లు చెప్పేవారు బాబా. మానవ నిజస్వరూపం, మన కంటికి కనిపించే స్వరూపం కాదని, ప్రేమ మన నిజమైన స్వరూపమని, దానిని మనమంతా పెంపొందించుకోవాలని చెబుతూ, అందుకు నిదర్శనంగా అందరినీ ‘ప్రేమస్వరూపులారా’ అనే పిలిచేవారు.భారతదేశంలో పుట్టిన ప్రతివారూ పేదయినా, ధనికుడైనా, ఈ ఆధ్యాత్మిక సంపదకు అందరూ వారసులేనని, దాని విలువ గుర్తించలేక మన సంఘం మనకు చూపించే ధన సంపద, ఆర్జన, సుఖాలు, వైజ్ఞానికత వంటి వాటితో కాలం గడుపుతూ మన జీవితాలను నిష్ప్రయోజనం కావించుకుంటామని అనేక ప్రసంగాలలో ఆవేదన వ్యక్తం చేసేవారు బాబా.మన చుట్టూ ఉన్న సంఘాన్ని చూసి, ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని, తాను చనిపోయినప్పుడు తనతో రాదని తెలిసినా, తనకు కావలసిన దానికన్నా అధిక సంపాదన కోసం, భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన కాలాన్ని వ్యర్థం చేసుకుంటారని చెబుతారు.

భగవంతుడు సృష్టించిన 84 లక్షల జీవరాశులలో, మానవ సృష్టి అత్యద్భుతమని, మానవ జాతికి అదనంగా ఇచ్చిన ‘విచక్షణ’ అనే జ్ఞానం ఒక పెద్ద వరమని, దాని ఉపయోగంలో అంటే ఏది చెడు, ఏది మంచి అని తెలుసుకొని, ఆదర్శంగా, ఆధ్యాత్మికంగా, సుఖమయ జీవితాన్ని అనుభవించవచ్చని బోధిస్తారు. ధనసంపాదనే ధ్యేయంగా ఉన్న ఈ సంఘంలో, మనకు తెలియకుండానే మనలో స్వార్థం పెరుగుతుందని, ఆ స్వార్థమే జాతి, దేశ సంస్కృతి వినాశాలకు దారి తీస్తుందని, ప్రపంచ చరిత్ర కూడా అదే నిజమని నిరూపించిందని చెబుతుంటారు. స్వార్థంతో... సర్వప్రాణులందరూ ప్రేమతత్వాన్ని పెంచుకోవడమే మనకు అంటుకున్న స్వార్థానికి విరుగుడు అని అంటారు. ఈ విషయంలో ‘నీ స్నేహితులెవరో చెబితే, నీవు ఎటువంటి వాడివో నేను చెబుతాను’ అని అంటారు. అంటే మన చుట్టూ ఉన్న సంఘం మనమీద ఎంత ప్రభావం చూపుతుందని చెప్పడం, చాలా సాధారణంగా ‘అందరినీ ప్రేమించు– అందరినీ సేవించు’ ‘అందరికీ సాయం చెయ్యి ఎవరినీ బాధపెట్టకు’ అనే విచక్షణతో, ప్రేమను పెంచుకోవచ్చని, ఎంతటి కరడుగట్టిన స్వార్థాన్ని కూడా కరిగించే అవకాశమని, జీవిత పరమార్థమని బోధిస్తాడు.

శక్తి కొలది తనకు భగవంతుడు ఇచ్చిన దానిలో (సంపద కాని, విజ్ఞానం కాని, శక్తి కాని అధికారం కాని, ఏదైనా కాని తోటి అభాగ్యులకు సేవ చేయగలిగితే, ప్రేమతత్వాన్ని పెంపొందించుకోవచ్చని, తన జీవితమే దానికి నిదర్శనమని అంటారు. పదవుల కోసం, అధికారం కోసం, గుర్తింపు కోసం, ప్రచార నిమిత్తం చేసే సేవలు స్వార్థాన్ని పెంచుతాయేగాని, తగ్గించవంటారు. ప్రతి మానవుడు తన జీవితం కోసం బాధ్యతల కోసం, కావలసిన ధనాన్ని సంపాదించుకుంటూ, తోటి మానవునికి, జీవులకు తన శక్తి కొలది నిస్వార్థమైన సేవ చేస్తే, ప్రేమతత్వాన్ని పెంచుకుంటూ తన నిజస్వరూపాన్ని తెలుసుకుంటూ భగవంతుణ్ణి సులభంగా చేరుకోవచ్చని చెప్పేవారు.

మన జీవన ప్రయాణం
మానవత్వం నుంచి దైవత్వానికే మన జీవన ప్రయాణం అనేవారు... సర్వులందు ప్రేమయే వారు జగతికి ఇచ్చిన సందేశం. స్వామి జన్మదిన సందర్భంగా మనం వారు చెప్పిన విధానంలో మనలోని ప్రేమను పెంచుకుంటూ, తోటివారికి శక్తి కొలది సహాయ పడుతూ, ప్రేమతత్వాన్ని పెంపొందించుకుంటూ, సనాతన ధర్మాచరణతో ఈ మిగులు జీవితాన్ని సార్థకత చేసుకునే ప్రయత్నం చేద్దాం.  
– శంకర నారాయణ ప్లాంజెరి
(హ్యూస్టన్, అమెరికా నుంచి)

క్రమశిక్షణ ఉంటే ఇంకొకరి రక్షణ అవసరం లేదు.
ఈ రోజును ప్రేమతో మొదలు పెట్టు ఇతరుల కోసం ప్రేమతో సమయం వెచ్చించు.
 రోజంతా నీలో ప్రేమను నింపుకో. ప్రేమతోనే ఈ రోజు ముగించు. దేవుణ్ణి గుర్తించడానికి అదే సరైన దారి.
కోరికలు ప్రయాణాలలో తీసుకు వెళ్లే వస్తువులలాంటివి. ఎక్కువయిన కొద్దీ జీవిత ప్రయాణం కష్టం అవుతుంది.
 దైవమే ప్రేమ; ప్రేమలో జీవించు.
ప్రతి అనుభవం ఒక పాఠం.
 ప్రతి వైఫల్యం ఒక లాభం.
ఎక్కడ దేవుని మీద విశ్వాసం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది.
ఎక్కడ ప్రేమ వుంటుందో అక్కడ శాంతి ఉంటుంది.
ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు.
 ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ ఆనందం ఉంటుంది.
దేవుడు ఆకాశం నుంచి దిగి మరల పైకి ఆకాశానికి వెళ్లేవాడు కాదు. సర్వత్రా వ్యాపించి ఉంటాడు.
అన్ని ప్రాణులను ప్రేమించు అది చాలు.
నేటి విద్యార్థులే రేపటి గురువులు.
ఇంటిలో ఆదర్శం ఉంటే, దేశంలో నిబద్ధత ఉంటుంది.
 సత్యానికి భయం లేదు. అసత్యం నీడను చూసి కూడా వణుకుతుంది.

మరిన్ని వార్తలు