హ్యాపీ జర్నీ

22 Jan, 2018 01:20 IST|Sakshi

అత్యవసర పనుల రీత్యా ఆడవారు దూర ప్రదేశాలకు ప్రయాణం చేయవలసి వస్తుంది. గబగబా సామాన్లు సర్దుకుని రైలు ఎక్కడానికి స్టేషన్‌కి వచ్చేస్తారు. తీరా అక్కడికి వచ్చాక అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆడవారికి నెలసరి సమస్య సహజం. ఆ సమయంలో అవసరమయ్యే న్యాప్‌కిన్లు మరచిపోతే ... ఆ ఇబ్బంది రెట్టింపవుతుంది. వారి అవసరాలకు అనుగుణంగా భోపాల్‌ రైల్వే స్టేషన్‌ శానిటరీ న్యాప్‌కిన్‌ వెండింగ్‌ మెషీన్‌ను ప్రారంభించింది.

సాధారణంగా అన్ని రైల్వే స్టేషన్లలోనూ టికెట్‌ కౌంటర్, ప్యాసెంజర్‌ హెల్ప్‌ డెస్క్, తిండి పదార్థాల స్టాల్స్, వెయిటింగ్‌ రూమ్స్‌... కనిపిస్తాయి. భోపాల్‌ రైల్వే స్టేషన్‌ ఒక అడుగు ముందుకు వేసింది. అతి తక్కువ ధరకే శానిటరీ న్యాప్‌కిన్స్‌ అందించే మెషీన్‌ను రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసింది. ఒక శానిటరీ న్యాప్‌కిన్‌ ఐదు రూపాయలే. ఒక్కొక్కరు రెండు న్యాప్‌కిన్స్‌ తీసుకోవచ్చు. భోపాల్‌ రైల్వే మహిళా సంక్షేమ శాఖ ఈ మెషీన్‌కి ‘హ్యాపీ నారీ’ అని పేరుపెట్టింది. జనవరి 1, 2018 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. రాజకీయ నాయకులు, అధికారులు కాకుండా, రైల్వే స్టేషన్‌లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగి అంజలి థాంకూ ఈ మెషీన్ ను ప్రారంభించారు.

ఈ సదుపాయం నచ్చడంతో ఎంతోమంది ముందుకు వచ్చి న్యాప్‌కిన్‌లను ఉచితంగా అందించారు. స్థానికంగా ఉన్న ఆరుషి అనే ఎన్‌జీవో ప్రతినిధులు 500 న్యాప్‌కిన్‌లను ఉచితంగా అందించారు. మెషీన్‌ ప్రారంభించిన పది గంటలలోపే 600 న్యాప్‌కిన్‌లను మహిళలు ఈ మెషీన్‌ నుంచి తీసుకున్నారు. ఈ మెషీన్‌ను తయారీకీ, సిబ్బందికీ అయిన ఖర్చు కేవలం రూ. 20 వేలు మాత్రమే. భోపాల్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ శోభన్‌ చౌదరి ఆలోచన  నుంచి ఏర్పడినదే హ్యాపీ నారీ. ‘ఇది ఒక మంచి ఆలోచన.

రైళ్లలో ప్రయాణం చేసే మహిళలు పీరియడ్స్‌ సమస్య వల్ల ఇబ్బంది పడకుండా ఈ మెషీన్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ ప్రయాణికులకు సైతం అందుబాటలో ఉండేలా అతి తక్కువ ధరకు అందచేస్తున్నారు’ అంటున్నారు చౌదరి. కేవలం రైలు ప్రయాణికులు మాత్రమే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తున్న సామాన్యులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ మెషీన్‌ను ఎలా ఉపయోగించాలి, న్యాప్‌కిన్స్‌ లోడ్‌ చేయడం, డబ్బులు వేయగానే బయటకు తీయడం... వంటి అంశాలలో రైల్వే ఉద్యోగులకు ఎన్‌జీవోలు శిక్షణ ఇస్తున్నారు. వారు ఇక్కడితో ఆగిపోవట్లేదు. మరొక కొత్త ఆలోచన చేస్తున్నారు.

ఉపయోగించిన న్యాప్‌కిన్‌లను పారేయడానికి అనుగుణంగా మహిళలు వేచిచూసే గదుల దగ్గర, వీటిని కాల్చి బూడిద చేసే యంత్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ వెండింగ్‌ మెషీన్‌ విధానం విజయవంతమైతే కనుక, మరిన్ని న్యాప్‌కిన్‌ మెషీన్లను మధ్య ప్రదేశ్‌ అంతటా ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఎన్‌జీవోలతో పాటు, కొన్ని కంపెనీల దగ్గరకు కూడా వెళ్లి, తక్కువ ధరలకు న్యాప్‌కిన్స్‌ను సరఫరా చేయమని అడగాలనే ఉద్దేశంతో ఉన్నారు. మహిళలకు అత్యవసరమైన న్యాప్‌కిన్‌లను ఈ విధంగా సరఫరా చేస్తున్న భోపాల్‌ రైల్వే అధికారులను ప్రశంసించడమే కాకుండా, వారిని స్ఫూర్తిగా తీసుకుని అన్ని రైల్వే స్టేషన్‌లలోనూ వీటిని ఏర్పాటుచేస్తే బావుంటుందని మహిళలు భావిస్తున్నారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు