హిట్లర్ అలా బతికిపోయాడు

19 Sep, 2015 23:45 IST|Sakshi
హిట్లర్ అలా బతికిపోయాడు

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అడాల్ఫ్ హిట్లర్ ఉత్త అనామక సైనికుడు మాత్రమే. మొదటి ప్రపంచ యుద్ధం 1918లో ముగిసే దశకు చేరుకున్న సమయంలో ఒక ఇంగ్లిష్ సైనికుడు జాలి తలచడంతో హిట్లర్ ప్రాణగండాన్ని తప్పించుకున్నాడు. అలా బతికి బయటపడ్డ తర్వాత హిట్లర్ ఏ స్థాయికి చేరుకున్నాడో, రెండో ప్రపంచ యుద్ధకాలంలో జనాన్ని గడగడలాడించే నియంతగా ఎలా ఎదిగాడో అందరికీ తెలిసిందే. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో మొదలై దాదాపు నాలుగేళ్లు సాగింది.

భారీ ప్రాణనష్టం తర్వాత 1918 ప్రారంభంలోనే యుద్ధం ముగింపు దశకు వచ్చిన విషయం ఉభయ వర్గాల సైనికులకూ దాదాపు అర్థమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రియా తరఫున యుద్ధంలో సైనికుడుగా పాల్గొన్న హిట్లర్ తీవ్రంగా గాయపడి, ఇంగ్లిష్ సైనికుడు హెన్రీ టాండేకు చిక్కాడు. హెన్రీ అతడికి తుపాకి గురిపెట్టాడు కూడా. అయితే, క్షతగాత్రుడిని చంపడానికి మనస్కరించక విడిచిపెట్టేశాడు. ఎక్కువ మందికి తెలియని ఈ సంఘటనే చరిత్రను మలుపు తిప్పింది. తాను జాలితలచి విడిచిపెట్టిన క్షతగాత్రుడు నియంతగా మారి తలపెట్టిన హింసాకాండను తెలుసుకున్నాక హెన్రీ టాండే జీవితాంతం అపరాధ భావనతో బాధపడ్డాడు.

మరిన్ని వార్తలు