వారపు సేవల్లో ఉత్సవాల వేల్పు | Sakshi
Sakshi News home page

వారపు సేవల్లో ఉత్సవాల వేల్పు

Published Sat, Sep 19 2015 11:42 PM

వారపు సేవల్లో ఉత్సవాల వేల్పు - Sakshi

బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవాల వైభవం నయనానందకరం. ప్రతి ఏటా స్వామికి 450 ఉత్సవాలు నిర్వహిస్తారు. వేకువ సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు నిత్య సేవల్లో స్వామి భక్తకోటికి దర్శనమిస్తూ పరవశింపచేస్తాడు. ఇక సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకో ప్రత్యేక సేవలో స్వామి వైభవ ప్రాశస్త్యాన్ని వర్ణించటానికి మాటలు చాలవు.
 
శ్రీదేవి, భూదేవి సమేతుడైన
* శ్రీ మలయప్పకు ప్రతి సోమవారం ఉదయం జరిగే ప్రధానసేవ విశేషపూజ. ఆలయంలోని నిత్య కల్యాణోత్సవ మండపంలో దీనిని ఆర్జిత సేవగా నిర్వహిస్తున్నారు.
* ఉభయ దేవేరులతో స్వామి శ్రీపీఠం (తిరుచ్చి)పై ఆశీనులై ఛత్రచామర బాజాభజంత్రీలు, వేద పారాయణలతో ఆనంద నిలయాన్ని వీడి కల్యాణోత్సవ మండపానికి చేరుకుంటారు.
* ఉత్సవమూర్తులకు అలంకారాలు, పట్టువస్త్రాలు సడలిస్తారు. స్నానవస్త్రాలు ధరింపచేసి స్నానపీఠంపై తూర్పు ముఖంగా వేంచేపు చేస్తారు.
* దీక్షాధారులైన వైఖానస అర్చకులు వేదికపై నవకలశాలను, హోమగుండంలో అగ్నిని ప్రతిష్ఠిస్తారు. పుణ్యాఃవచనంతో స్థల శుద్ధి, పరిసర శుద్ధి చేస్తారు. కంకణ ప్రతిష్ఠ చే సి ఉత్సవమూర్తులకు అర్ఘ్యపాద్యాచమనాది ఉపచారాలతో కంకణాలు సమర్పిస్తారు.
* ఆర్జితం చెల్లించిన గృహస్తులతో సంకల్పం చేయిస్తారు. నవకలశ పూజ నివేదన, పూర్ణాహుతి సమర్పిస్తారు. ఆ హోమ తిలకాన్ని ఉత్సవమూర్తులకు ధరింప చేస్తారు. అనంతరం భక్తులకూ పంచిపెడతారు.
* తర్వాత స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి, మలయప్పను వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
* మంగళవాయిద్యాలు, వేదఘోష నడుమ శుద్ధజలంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత  ఆవుపాలతో, ఆ తర్వాత శుద్ధజలంతో అభిషేకించి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ సమయంలో వేదపండితులు పురుష సూక్తం, శ్రీసూక్తం, భూ నీలా సూక్తాలు, పంచ సూక్తాలు పఠిస్తారు.
* చివరగా నవకలశాలలోని జలంతో  సహస్రధారాభిషేకం చేస్తారు. ఆ జలాన్ని అర్చకులు తాము ప్రోక్షణ చేసుకుని, భక్తులకూ ప్రోక్షణ చేస్తారు.
* అనంతరం తెరల మాటున ఉత్సవమూర్తులను నూత్నవస్త్రంతో తుడిచి పట్టువస్త్రం, పూలమాలతో అలంకరిస్తారు. పెద్దవడలు, లడ్డూలు, అన్నప్రసాదాలు నివేదిస్తారు. తెరలు తీసి కర్పూర నీరాజనం సమర్పిస్తారు. హారతి అయిన తర్వాత సేవలో పాల్గొన్న భక్తులకు ఉత్తరీయం లేదా రవిక గుడ్డ,పెద్దలడ్డూ, వడ అందజేస్తారు. చివరగా భక్తులందరికీ మూలవిరాట్టు దర్శనభాగ్యాన్ని కల్పిస్తారు. టికెట్టు ధర రూ.600.
 
అష్టదళ పాదపద్మారాధన-
* తిరుమల తిరుపతి దేవస్థానం (1933- 1984) ఆవిర్భవించి యాభైఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 1984లో స్వర్ణోత్సవాలు నిర్వహించారు. అందుకు గుర్తుగా ఈ అష్టదళ పాద పద్మారాధన సేవను ప్రారంభించారు. ఇందుకు అవసరమైన 108 బంగారు కమలాలను హైదరాబాద్‌కు చెందిన ఓ మహ్మదీయ భక్తుడు స్వామికి కానుకగా సమర్పించారు.
* సేవకు ముందుగా ఆర్జితసేవ గృహస్తులను ‘కులశేఖరపడి’ గడప నుండి బంగారువాకిలి వరకు కూర్చోబెడతారు.
* అర్చకులు గర్భాలయ మూలమూర్తికి అర్ఘ్యపాద్యాచమనాది ఉపచారాలు సమర్పిస్తారు. స్వామి పాద పద్మాల చెంత కూర్చుని అర్చనకు సిద్ధమవుతారు. ఆలయ పెద జీయంగార్ అందించిన బంగారు పద్మాలను స్వీకరించి అష్టోత్తర శతనామాలతో స్వామి పాద పద్మాలకు అర్చన చేస్తారు.
* స్వామి పాదపద్మాలపై ఉన్న తులసిదళాలను స్వీకరించి వక్షస్థలంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని చతుర్వింశతి నామావళితో అర్చన పూర్తి చేసి గంధధూపం సమర్పిస్తారు. ఆవునేతి తో తడిపిన 27 వత్తులు గల వెండి దీపపుసెమ్మెతో స్వామికి నక్షత్ర హారతి, నైవేద్యాలు సమర్పిస్తారు. కర్పూర నీరాజనంతో స్వామి పాదపద్మాలు, వైకుంఠ హస్తం, చక్రం, స్వామి ముఖారవిందం, తిరునామాలు, శంఖం, కటిహస్తం, పాదపద్మాలు, నందక ఖడ్గం, వక్షస్థల మహాలక్ష్మికి సమర్పిస్తారు.
* ఆర్జిత గృహస్తులకు ఉత్తరీయం లేదా రవిక గుడ్డ, రెండు పెద్ద లడ్డూలు, రెండు వడలు అందజేస్తారు. టికెట్టు రూ.1250.
 
ప్రాచీనం... సహస్ర కలశాభిషేకం
* తిరుమల ఆలయంలో నిర్వహించే సేవల్లో సహస్ర కలశాభిషేకం అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన సేవగా చెప్పవచ్చు. ప్రతి బుధవారం బంగారు వాకిలిలో ప్రధాన సేవగా నిర్వహిస్తారు.
* ఆలయంలో మూలమూర్తి (ధ్రువమూర్తి), మనవాళప్పెరుమాళ్ (భోగశ్రీనివాసమూర్తి), కొలువు శ్రీనివాసమూర్తి, ఉగ్రశ్రీనివాసమూర్తి,  మలయప్ప... ఐదు రకాల మూర్తులను పంచబేరాలుగా పిలుస్తారు.
* సహస్ర కలశాభిషేకంలో భోగ శ్రీనివాసమూర్తితోపాటు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప, స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు పాల్గొంటారు.
* క్రీ.శ.614 నాటిదిగా భావించే శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని వైఖానస ఆగమం ప్రకారం కౌతుకమూర్తి అనీ, పురుషబేరం అనీ పిలుస్తుంటారు.
* గర్భాలయంలో మూలమూర్తికి ఈశాన్యదిశలో ఉండే భోగ శ్రీనివాస మూర్తికి నిత్యం ఆకాశగంగ తీర్థంతో అభిషేకిస్తారు. ఎప్పుడూ బంగారు వాకిలి దాటి బయటకు తీసుకురారు. సహస్ర కలశాభిషేకం కోసం ఒక్క బుధవారం మాత్రమే గంటామండపానికి తీసుకొస్తారు.
* దక్షిణదిశలో స్నానపీఠంపై ఉత్తరాభిముఖంగా ఉభయదేవేరులతో మలయప్ప, ఉత్తరదిశలో స్నానపీఠంపై దక్షిణాభిముఖంగా విష్వక్సేనులవారిని వేంచేపు చేస్తారు. వీరికి మధ్యలో తూర్పున అభిముఖంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని ఆసీనుల్ని చేస్తారు. ఆయనకు గర్భాలయ మూలవిరాట్టును అనుసంధానిస్తూ బంగారు తీగ లేదా పట్టుదారంతో కడతారు. దీనినే ‘సంబంధ కూర్చం’ అంటారు.
* నేలపై ధాన్యం (వడ్లు)పోసి, 1008 వెండికలశాలను సుగంధద్రవ్యాలు కలిపిన జలంతో నింపి ప్రతిష్ఠిస్తారు. విష్వక్సేనుడి పక్కన ‘నవకలశాలు’ ఏర్పాటు చేస్తారు. ఆగ్నేయదిశలో ‘యజ్ఞవేదిక’ ఏర్పాటు చేస్తారు. ఆర్జితసేవాగృహ స్థులను ఆసీనుల్ని చేస్తారు.
* మంగళ ధ్వనుల నడుమ దీక్షాధారులైన వైఖానస అర్చకులు ఘంటానాదంతో హోమగుండంలో అగ్నిప్రతిష్టాపన చేస్తారు. కలశాన్ని ప్రతిష్టించి పుణ్యతీర్థ జలాలు ఆవాహనం చేసి ధూపదీప కర్పూర నీరాజనాలిచ్చి అక్షతారోపణం చేస్తారు. కలశంలోని పవిత్ర జలాన్ని అన్ని వైపులా చల్లుతూ పుణ్యాహవచనం పూర్తి చేస్తారు.
* శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి అర్ఘ్యపాద్యాచమనాది అనుష్టాన క్రియలు, తులసి సమర్పించి కంకణధారణ చేస్తారు. తర్వాత శ్రీదేవి, భూదేవి, మలయప్ప, విష్వక్సేనులవారికి కంకణధారణ చేస్తారు.
* సంకల్పసహితంగా ముక్కోటి దేవతలను ఉద్దేశించి హోమం చేస్త్తారు. ధాన్యంపై ప్రతిష్టించిన సహస్ర కలశాలు, పీఠంపై ప్రతిష్టించిన నవకలశాలకు ఆవాహనాది క్రియలు చేసి ధూపదీప హారతులు సమర్పిస్తారు.
* హోమగుండం వద్ద అప్పాలు, శుద్ధాన్నం నివేదన చేసి హోమాన్ని నిర్వహిస్తూ పూర్ణాహుతి చేస్తారు. హోమ తిలకాన్ని శ్రీభోగ శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి, మలయప్ప, విష్వక్సేనులవారికి సమర్పిస్తారు. భక్తులకూ అందజేస్తారు.
* మంగళవాయిద్యాలు, వేద పండితుల పంచసూక్తాల నడుమ సహస్ర కలశాలలోని శుద్ధజలం, పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనద్రవ్యాలతో భోగ శ్రీనివాసమూర్తికి, విష్వక్సేనులవారికి అభిషేకిస్తారు. చివరగా అన్ని మూర్తులకు తులసిమాలలు అలంకరించి నవ కలశాలలోని జలంతో బంగారుపళ్లెంతో సహస్రధారాభిషేకం చేస్తారు.
* తర్వాత ఆ పవిత్రజలాన్ని ముందుగా అర్చకులు చల్లుకుని, జీయంగార్, ఏకాంగి, భక్తుల మీద  చల్లుతారు. తర్వాత తెరలమాటున పట్టువస్త్రాలు, పూలమాలలతో అలంకరించి,  క్షీరాన్నం, అప్పాలతో నివేదన సమర్పిస్తారు. అనంతరం తెరలు తొలగించి అక్షతారోపణతో కర్పూర నీరాజనం సమర్పించి మూర్తులను ఆనంద నిలయంలోకి వేంచేపు చేస్తారు. చివరగా భక్తులకు మూలవిరాట్టు దర్శన భాగ్యాన్ని కల్పించి, ఉత్తరీయం లేదా రవికగుడ్డ, పెద్దలడ్డూ, వడ, రెండు అప్పాలు, రెండు దోశలు, అన్నప్రసాదాలు అందజేస్తారు. టికెట్టు ధర రూ.850.
 
నేత్ర దర్శనం
* తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం ఓ విశిష్టత ఉంది. మూలమూర్తి దర్శనం, నివేదనలు, అలంకారాలు ఈ రోజు విభిన్నంగా ఉంటాయి. ప్రతి గురువారం వేకువ జామున రెండవ అర్చన తర్వాత మూలమూర్తి ఎలాంటి ఆభరణాలు, అలంకారాలు లేకుండా నిరాడంబర రూపంతో దర్శనమిస్తారు.
* ఆభరణాలే కాకుండా నొసటన పెద్దగా ఉండే పచ్చ కర్పూరపు తిరునామం (ఊర్ధ్వపుండ్రాలు) బాగా తగ్గిస్తారు. భక్తులకు స్వామి నేత్రాలు దర్శించుకునే మహద్భాగ్యం ఆ రోజు మాత్రమే కలుగుతుంది. గురువారం నాటి ఈ దర్శనాన్నే నేత్రదర్శనం అంటారు.
* ఆ రోజు ఆభరణాల బదులు పట్టుధోవతిని, పట్టు ఉత్తరీయాన్ని ధరింపజేస్తారు. స్వామివారి శిరస్సుపై కిరీటాన్ని తీసి పట్టువస్త్రాన్ని చుడతారు. బంగారు శంఖుచక్రాలు, కర్ణభూషణాలు, సాలిగ్రామహారాలను అలంకరిస్తారు. మెడలో హారం, కాళ్లకు కడి యాలు, పాదాలకు బంగారు తొడుగులు అలంకరిస్తారు.
 
అన్నరాశి నైవేద్యమే తిరుప్పావడసేవ
* శ్రీవేంకటేశ్వర స్వామివారికి ప్రతి గురువారం రెండో అర్చన తర్వాత నివేదనోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనినే ‘తిరుప్పావడసేవ’ అనీ, అన్నకూటోత్సవం అనీ అంటారు. స్వామికి బంగారువాకిలి వద్ద నుండి నేరుగా సమర్పించే అన్ననివేదన ఇది.
* బంగారు వాకిలి ముందు గరుడాళ్వారుకు ఎదురుగా నాలుగు స్తంభాల మధ్య వెదురు చాపలపై 6 బస్తాల బియ్యం (450 కిలోలు) తో తయారు చేసిన పులిహోరను ‘రాశి’గా పోస్తారు. స్తంభాలకు చుట్టూ తెరలు కట్టి ఈ అన్నరాశిని పెద్ద శిఖరం లాగా దానికి చుట్టూ ఎనిమిది దిక్కులా చిన్న శిఖరాలు గా తీర్చిదిద్దుతారు. ఈ రాశి ముందు ధూపదీప నైవేద్యాలు, నీరాజనం సమర్పిస్తారు.
* జిలేబి, తేనెతొళ (మురుకు), దోసె, అప్పలం, పాయసం, లడ్లు, వడలు వంటి ప్రసాదాలను మూలవిరాట్టు దృష్టి పడేలా కులశేఖరపడి వద్ద ఉంచి నైవేద్యం, మంగళహారతి సమర్పిస్తారు.
* వేద పండితులు శ్రావ్యంగా పఠించే శ్రీనివాస గద్యంతో సప్తగిరులు పులకిస్తాయి. శ్రీనివాసగద్యం పూర్తికాగానే బంగారువాకిలి నుండే మూలమూర్తికి, తర్వాత అన్నరాశికి హారతి సమర్పిస్తారు. . తర్వాత పులిహోర రాశిని భక్తులకు వితరణ చేస్తారు. గృహస్థులను మూలవిరాట్టు దర్శనానికి అనుమతిస్తారు.
* ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు ఉత్తరీయం, రవికగుడ్డ, ప్రసాదాలు అందజేస్తారు. టికెట్ ధర రూ.850.
 
పూలంగి సేవలో పెరుమాళ్లు...
* ప్రతి గురువారం సాయంత్రం మూలవిరాట్టుకు నిర్వహించే తోమాల సేవనే పూలంగి సేవ అంటారు.
* సాయం సమయంలో వైఖానస అర్చకులు శుచిస్నాతులై సన్నిధిగొల్ల వెంటరాగా ఆలయానికి చేరుకుంటారు.
* జీయంగార్లు, ఏకాంగి ‘యమునోత్తరై’ అను ‘పూల అర’లో సిద్ధంగా ఉంచిన పూలు, పూలమాలల్ని పెద్ద వెదురుబుట్టలను బాజా భజంత్రీల తో, ఛత్రచామర మర్యాదలతో సన్నిధికి ఊరేగింపుగా తీసుకొస్తారు.
* అర్చకులు స్వామికి అలంకరించిన  ఆభరణాలు తీసివేసి, బంగారు తీగెలతో కూడిన ముఖమల్ వస్త్రాన్ని ధరింప చేస్తారు. అర్ఘ్యపాద్యాచమనాది ఉపచారాలు సమర్పించి పూలంగి, తోమాల సేవలు నిర్వహిస్తారు. జీయంగార్లు, వైష్ణవాచార్యులు, దివ్యప్రబంధాన్ని గానం చేస్తారు.
* పూలమాలల్ని శిరస్సు నుంచి పాదాల వరకు అలంకరిస్తారు. ఈ అలంకరణలో స్వామివారు పూల అంగీని ధరించినట్టు కనువిందుగా దర్శనమిస్తారు. స్వామివారు గురువారం రౌద్రంగా ఉంటారని, ఆ రౌద్రాన్ని తగ్గించి శాంతింప చేయడానికే పూలంగిసేవ నిర్వహిస్తారని పండితులు చెబుతున్నారు.
 
దివ్యమంగళ స్వరూప దర్శన భాగ్యం!
* ప్రతి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బ్రహ్మముహూర్తంలో  స్వామివారికి జరిగే విశేషసేవ ‘అభిషేకం’.
* అర్చకులు మూలవిరాట్టుకు నమస్కారం చేసి, అభిషేకానికి అనుమతి ఇవ్వమని ప్రార్థించి సంకల్పం, అష్టోత్తర శతనామార్చన చేస్తారు. స్వామికి నొసటన ఉండే పచ్చకర్పూరపు నామాన్ని తగ్గించి సూక్ష్మంగా ఉంచుతారు. ఆభరణాలు, పట్టువస్త్రాలను తీసివేసి, స్నానవస్త్రంగా తెల్లని కౌపీనాన్ని ధరింప చేసి, దంతధావన అర్ఘ్యపాద్యాచమనాది ఉపచారాలు సమర్పించి శిరసాదిగా పునుగు తైలాన్ని అలది వెండి గంగాళాల్లో బంగారు బావి జలాన్ని సిద్ధం చేస్తారు.
* జీయంగార్లు, అర్చకులు గర్భాలయంలోకి చేరుకోగా, అధికారులు, భక్తులు కులశేఖర పడి నుంచి బంగారు వాకిలి వరకు కూర్చుంటారు.
* జీయంగార్, అర్చకులు స్వామికి, వక్షస్థల మహాలక్ష్మికి నమస్కరించి అభిషేక సమర్పణకు అనువుగా వరద హస్తం దగ్గర నిలుస్తారు.
* తొలుత జీయంగార్లు బంగారు శంఖంతో ఆకాశగంగ తీర్థాన్ని అర్చకులకు అందిస్తారు. వారు పురుష సూక్తాన్ని పఠిస్తూ స్వామి శిరస్సుపై అభిషేకిస్తారు. వేద పండితులు పంచసూక్తులు, పంచోపనిషత్తులు పారాయణం చేస్తారు.
* తర్వాత ఆవుపాలతో శిరసాది పాదాల వరకు అభిషేకిస్తారు. తర్వాత బంగారు బావి శుద్ధజలంతో అభిషేకించి, పసుపు ముద్దలను వక్షస్థల మహాలక్ష్మికి సమర్పిస్తారు.
* అనంతరం స్వామికి కర్పూరం, చందనం, కుంకుమపువ్వు శిరసాదిగా అద్దుతారు. ఈ నలుగు విధానాన్ని ‘ఉద్వర్తనం’ అంటారు. ఆ తర్వాత ఇచ్చే హారతిలో ముఖారవిందం, శంఖుచక్రాలు, వరద కటి హస్తాలు, పాదాలు, నందక ఖడ్గం, వక్షస్థల మహాలక్ష్మి.. ఇలా అంగాంగాలతో స్వామి దివ్యమంగళ రూపాన్ని భక్తులు దర్శించి ఆనంద పరవశులవుతారు. జలాభిషేకంతో జాలువారుతున్న తీర్థాన్ని ‘శ్రీపాద తీర్థం’ అంటారు. అనంతరం స్వామి వక్షస్థలంలో కొలువైన శ్రీ మహాలక్ష్మికి అభిషేకం చేస్తారు. తరువాత బంగారు బావి జలంతోనూ, ఆకాశగంగ తీర్థంతోనూ స్వామిని అభిషేకించి ఆ తీర్థాన్ని పాత్రలో సేకరిస్తారు.
* ఈలోగా పండితులు వేద పారాయణం పూర్తి చేస్తారు. తెరవేసి వస్త్రంతో స్వామికి తడిలేకుండా తుడుస్తూ ఉండగా జీయంగార్ ద్రవిడ వేదంలోని ‘నీరాట్టం’ పది పాశురాలు గానం చేస్తారు.
* ఆ సమయంలో అర్చకులు తెరలమాటున స్వామికి సరిగంచు పెద్ద పట్టువస్త్రాన్ని అంతరీయంగాను, పండ్రెండు మూరల పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగానూ ధరింప చేస్తారు. తర్వాత  ఆభరణాలు అలంకరించి పట్టువస్త్రంతో శిరస్సుకు కిరీటంగా చుడతారు. నుదుట పచ్చకర్పూరంతో తిరునామం తీర్చిదిద్దుతారు.
* తర్వాత వెన్న, పంచదారతో నివేదన చేసి తాంబూలం సమర్పిస్తారు. ఆ తర్వాత ‘పచ్చ కర్పూరపు హారతి’ సమర్పిస్తూ తెరను తొలగించి, భక్తులకు అభిషేక తీర్థాన్ని, ‘శ్రీపాదరేణువు’అనే మహాప్రసాదాన్ని వితరణ చేస్తారు. టికెట్టు ధర రూ.750.
 
వస్త్రాలు సమర్పించే వస్త్రాలంకార సేవ
* అభిషేకసేవలో మూలవిరాట్టుకు ధరింప చేసే వస్త్రాలను భక్తులే సమర్పించేందుకు ప్రత్యేకంగా వస్త్రాలంకార సేవ టికెట్టు టీటీడీ ప్రారంభించింది. టికెట్టు ధర రూ.12.250.

నిజపాదాల దర్శనం.. భక్తకోటి జన్మధన్యం
* ప్రతి శుక్రవారం శ్రీ స్వామి నిజపాదాల దర్శనభాగ్యం భక్తులకు కలుగుతుంది. అభిషేకసేవలో పాల్గొనే భక్తులతోపాటు నిజపాద సేవాటికెట్లు కలిగిన వారికీ ఈ మహద్భాగ్యం దక్కుతుంది.         
దేవతల కోసం ‘బ్రహ్మస్థలం’
* తిరుమల ఆలయంలో పంచ భూతాలు, దేవగణాలు, అష్టదిక్పాలకులు నిత్యం స్వామిని సేవించేందుకు వీలుగా గర్భాలయం నుంచి ముఖమండపం తప్పిస్తే మిగిలిన మూడు ప్రాకారాల్లోనూ ఎక్కువభాగం ‘బ్రహ్మస్థలం’గానే ఆలయ నిర్మాణం సాగిందని పండితులు, అర్చకులు చెబుతున్నారు.
* ఆలయాల గోపురాలు, విమాన ప్రాకారాలు ప్రకృతిసిద్ధంగావచ్చే భూకంపాల వంటి వైపరీత్యాలను  తట్టుకునే శక్తికోసమే అలాంటి నిర్మాణాలు చేపడుతుంటారని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
* సాధారణంగా వైష్ణవం, శైవం వంటి శాఖలు తమ ఆలయాలు నిర్మించే  సందర్భంలో ఆయా ధర్మాలను అనుసరించి వాస్తును కూడా పరిగణనలోకి తీసుకునే నిర్మాణం పనులు చేస్తారు.
* పురాతన గృహాల్లోని మధ్య భాగంలోఎక్కువ ఖాళీస్థలం వదిలేవారు. దాన్ని బ్రహ్మ స్థలంగా పరిగణిస్తారు.  అక్కడ దేవ తలు కొలువై ఉంటారట. అందుకే ఆ బ్రహ్మస్థలంలో తులసి మొక్క నాటి పూజలు చేస్తారు. అక్కడికే నేరుగా పంచభూతాలు ఆవాహన అవుతుంటాయి. భగవంతుడు ముఖద్వారం నుంచి కాకుండా నేరుగా ఆకాశమార్గం నుంచి నేరుగా బ్రహ్మస్థలానికి చేరుకుని పూజలందుకుంటారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.
 
 
ధ్వజారోహణంలో దర్భతాడు...
హిందూ ధర్మంలో దర్భను పవిత్రంగా భావిస్తారు. అంతటి పవిత్రమైన దర్భతోనే ధ్వజారోహణంలో  ధర్మతాడు (కొడితాడు) సిద్ధం చేస్తారు. 1.5 అంగుళాల మందం, 300 అడుగుల పొడవుతో దర్భలను తాడుగా పేనుతారు. దర్భలతోనే రెండు మీటర్ల వెడల్పు, ఆరుమీటర్ల పొడవుతో 12 చదరపు మీటర్ల చాపను సిద్ధంచేస్తారు. చాపను ధ్వజస్తంభం (కొడిస్తంభం)కు అమర్చి, దారంతో చుడతారు. దర్భను ఇంతకుముందు వరకు టీటీడీ అటవీశాఖ వెంకటగిరి ప్రాంతంలో సేకరించేవారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా అవసరమైన దర్భ లభించేది కాదు. పవిత్రకార్యానికి వాడే దర్భను పెంచటంలోనూ శుభ్రత పాటించే పరిస్థితులు సన్నగిల్లాయి. దీంతో బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన ధ్వజారోహణం కోసం పవిత్రమైన దర్భను పెంచే విషయంలో టీటీడీ అటవీశాఖా డీఎఫ్‌వో ఎన్‌వీ శివరామ్‌ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈమేరకు ఆలయానికి కిలోమీటరు దూరంలోని ఉద్యానవనంలో   మంచినీరు, సేంద్రియ ఎరువులు వాడి దర్భను పెంచారు.  దానిని పవిత్ర కార్యాలకు వినియోగిస్తున్నారు.
 
పుష్కరిణి నిత్య హారతి
ఆలయానికి ఉత్తర  ఈశాన్యదిశలో పుష్కరిణి ఉంది. 1.5 ఎకరాల వైశాల్యమున్న ఈ కోనేరు మధ్యలో క్రీ.శ 1468లో సాళ్వ నరసింగరాయలు నివాళీ మండపాన్ని నిర్మించారు. క్రీ.శ.15వ శతాబ్దంలో పుష్కరిణికి తాళ్ళపాక వారు మెట్లను నిర్మించి నివాళీ మండపాన్ని బాగు చేయించారు. ప్రతి యేటా బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం కార్యక్రమాన్ని పుష్కరిణిలో నిర్వహిస్తారు.

ఫాల్గుణ మాసంలో తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. స్వామి పుష్కరిణికి హారతి ఇచ్చే సంప్రదాయానికి 2008లో అప్పటి ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, ఈఓ కేవీ రమణాచారి శ్రీకారం చుట్టారు. నాటినుంచి ప్రతిరోజూ సాయంసంధ్యాసమయంలో మలయప్ప సాక్షిగా పుష్కరిణి నిత్య హారతి అందుకుంటోంది.

Advertisement
Advertisement