నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను!

16 Jul, 2014 00:03 IST|Sakshi
నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను!

వేదిక
 

మా అమ్మ పల్లెటూరిలో పుట్టి పెరిగింది. వాళ్ల ఊళ్లో ఉన్న బడిలో పదో తరగతి వరకూ చదివింది. కానీ పీజీ చదివినవాళ్లకి ఉన్నంత జ్ఞానం ఉంటుంది తనకి. పత్రికలు, నవలలు చదివి జీవితాన్ని, ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది. అందుకే పెళ్లయిన నాలుగేళ్లకే నాన్న చనిపోయినా... ఒంటరిగా బతికేందుకు సిద్ధపడింది. రెండేళ్ల పిల్లనైన నన్ను పెంచి పెద్ద చేయడం కోసం రెక్కలు ముక్కలు చేసుకుంది.అమ్మ కష్టాలను చూసిన నేను బాగా సంపాదించాలని, అమ్మని సుఖపెట్టాలని అప్పటినుంచే కలలు కనేదాన్ని. పట్టుదలతో చదివాను. ర్యాంకులు సాధించాను. ముప్ఫైవేల జీతంతో మొదలుపెట్టి, రెండేళ్లలో యాభై వేలకు చేరువయ్యాను. కానీ లక్ష్యాలకు చేరువయ్యే క్రమంలో... నన్ను పెంచడమే లక్ష్యంగా బతికిన మా అమ్మకి దూరమయిపోయాను.
 
పనిలో చేరాక అమ్మతో గడపడానికి సమయమే ఉండేది కాదు. పని చేసుకునేటప్పుడు కనీసం పక్కవాళ్లతో టైమ్ పాసయ్యేది తనకి. కానీ నేను సంపాదిస్తున్నాను కదా అని పని మాన్పించేసి ఇంట్లో కూచోబెట్టాను. నా కోసం తను ఎదురు చూస్తుంటే ఏ అర్ధరాత్రికో వెళ్లి పక్కమీద వాలిపోయేదాన్ని. ఏవేవో వంటకాలు చేసి నాకు తినిపించాలని తను అనుకుంటే, క్యాంటీన్లో తినేసి వెళ్లి కడుపు నిండుగా ఉందనేదాన్ని. ఆదివారమైనా తనతో గడపమంటే కాన్ఫరెన్సులు అనేదాన్ని. పండగ పూటయినా తనకోసం కాస్త సమయం కేటాయించమంటే... కార్పొరేట్ ప్రపంచంలో పండుగల కోసం టైమెక్కడివ్వగలం అనేదాన్ని.
 
ఓరోజు ఆఫీసులో ఉండగా పక్కింటావిడ ఫోన్... అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని, ఆసుపత్రిలో చేర్పించారని. పరుగు పరుగున వెళ్లాను. అప్పటికే ఆలస్యమైంది. నా ప్రపంచం చీకటైపోయింది. అమ్మ వెళ్లిపోయింది. నాకున్న ఒకే ఒక్క తోడు నన్ను వీడిపోయింది. అమ్మ సామాన్లు సర్దుతున్నప్పుడు అమ్మ డైరీ దొరికింది. అందులో ఒకచోట అమ్మ రాసుకుంది... ‘‘నువ్వు అందనంత ఎత్తు ఎదగాలనుకున్నానురా... కానీ నాకే అందకుండా ఉండిపోవాలని కోరుకోలేదు. నాతో కాస్తంత సమయం గడిపే తీరిక కూడా నీకు లేదు. మీ నాన్న పోయినప్పుడు నువ్వున్నావని ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వున్నా ఒంటరిగా ఫీలవుతున్నాను.’’
 
అప్పుడు నాకు అర్థమైంది... జ్వరం కూడా రాని అమ్మకి హార్ట్ అటాక్ ఎందుకొచ్చిందో, మొదటి స్ట్రోక్‌కే ప్రాణాలు ఎందుకు కోల్పోయిందో. ఇంత చేసినా తను నన్ను క్షమిస్తుందని నాకు తెలుసు. కానీ నన్ను మాత్రం నేను క్షమించుకోలేను. ఎప్పటికీ క్షమించుకోలేను.
 - సుచిత్ర, చెన్నై

మరిన్ని వార్తలు