పిల్లలు బాణాసంచా కాల్చేటప్పడూ జరభద్రం..ఈ జాగ్రత్తలు తప్పనసరి..

12 Nov, 2023 13:25 IST|Sakshi

మనకు ఎన్నో పండుగలు ఉన్నాయి. ఎన్ని పండుగలు ఉన్నా, పిల్లలకు అమితానందం కలిగించేది దీపావళి పండుగే! మిగిలిన పండుగల్లో పిల్లలకు మిఠాయిలు, పిండివంటలు మాత్రమే ఉంటాయి. దీపావళి నాడైతే మిఠాయిలు, పిండివంటలకు అదనంగా టపాకాయలు కూడా ఉంటాయి. సరదాగా టపాకాయలు కాల్చడానికే పిల్లలు దీపావళి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. టపాకాయలు కాల్చుకోవడం సరదానే అయినా, వాటితో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల జాగ్రత్తలు తీసుకుని మరీ వాటిని కాల్చాలి. ఏమాత్రం అజాగ్రత్తపడినా ఇళ్లూ ఒళ్లూ కాలే ప్రమాదాలు ఉంటాయి. ఈసారి బాలల దినోత్సవానికి రెండురోజుల ముందు దీపావళి పండుగ వస్తోంది. పిల్లలకు ఈసారి రెట్టింపు ఉత్సాహం ఉంటుంది. పిల్లల్లారా! దీపావళి గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం.

హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఒకసారి భూమండలాన్ని తీసుకుపోయి సముద్రంలో దాచేశాడు. దేవతలందరూ మొరపెట్టుకోవడంతో మహావిష్ణువు వరాహావతారం దాల్చాడు. హిరణ్యాక్షుడితో యుద్ధంచేశాడు. వాణ్ణి తన పదునైన కోరలతో పొడిచి చంపేశాడు. సముద్రంలో మునిగిన భూమిని తన కోరలతో పైకెత్తి బయటకు తీసుకువచ్చాడు. ఆ సమయంలో వారికి నరకాసురుడు పుట్టాడు. వాడికి అసురలక్షణాలు ఉన్నాయని, ఎప్పటికైనా తల్లి చేతుల్లోనే మరణిస్తాడని మహావిష్ణువు భూదేవికి చెప్పాడు. ఆ తర్వాత వైకుంఠానికి వెళ్లిపోయాడు. 

పెరిగి పెద్దవాడైన తర్వాత నరకాసురుడు కామరూప దేశానికి రాజయ్యాడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించసాగాడు. ద్వాపరయుగంలో నరకాసురుడికి శోణితపురం రాజైన బాణాసురుడితో స్నేహం ఏర్పడింది. దుర్మార్గుడైన బాణాసురుడి సావాసంలో నరకాసురుడికి అన్ని చెడ్డ గుణాలూ అలవాటయ్యాయి. బాణుడు రెచ్చగొట్టడంతో ఇతర రాజ్యాల మీద దండయాత్రలు చేసేవాడు. దొరికిన స్త్రీలనందరినీ తీసుకొచ్చి, బంధించేవాడు. ఇలా పదహారువేల మంది స్త్రీలను చెరపట్టాడు. స్వర్గం మీద దండెత్తి, దేవేంద్రుడిని తరిమికొట్టి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. 

ఆ కాలంలోనే శ్రీకృష్ణుడు నరకాసురుడి మిత్రుడైన మురాసరుడిని, అతడి కొడుకులను యుద్ధంలో హతమార్చాడు. తన మిత్రుడైన మురాసురుడిని చంపడంతో నరకాసురుడికి శ్రీకృష్ణుడి మీద కోపం వచ్చింది. వెంటనే శ్రీకృష్ణుడి మీద యుద్ధానికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు యుద్ధానికి బయలుదేరుతుంటే, తాను కూడా వస్తానని పట్టుబట్టింది సత్యభామ. సరేనంటూ, ఆమెను తనతో పాటే గరుడ వాహనం మీద యుద్ధరంగానికి తీసుకుపోయాడు శ్రీకృష్ణుడు. నరకాసురుడికి, శ్రీకృష్ణుడికి హోరాహోరీ యుద్ధం జరిగింది. యుద్ధంలో నరకాసురుడు విడిచిన బాణం తాకడంతో శ్రీకృష్ణుడు మూర్ఛపోయాడు.

ఇది చూసి సత్యభామకు పట్టరాని కోపం వచ్చింది. వెంటనే విల్లూ బాణాలూ అందుకుంది. నరకాసురుడి మీద, అతడి సైనికుల మీద వరుసగా బాణాలు కురిపించింది. కాసేపటికి శ్రీకృష్ణుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. యుద్ధంలో సత్యభామ అలసిపోతుండటం చూశాడు. తాను కూడా యుద్ధంలో విజృంభించాడు. అదను చూసి, చక్రాయుధం విసిరి నరకాసురుడి తల తెగనరికాడు. ఆ రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. అందుకే ఆ రోజును మనం నరక చతుర్దశి అంటున్నాం. మర్నాడు అమావాస్య రోజున జనాలందరూ నరకాసురుడి పీడ విరగడైనందుకు సంతోషంగా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, పండుగ చేసుకున్నారు. ఇప్పుడు మనం జరుపుకుంటున్న దీపావళి పండుగ అలా పుట్టిందన్నమాట.

బాణసంచా చరిత్ర
చాలాకాలం పాటు జనాలు దీపావళి రోజున సాయంత్రం ఇళ్ల ముందు దీపాలు వెలిగించుకోవడం, లక్ష్మీపూజలు జరుపుకోవడం మాత్రమే చేసేవారు. అప్పట్లో టపాకాయలు కాల్చేవారు కాదు. తర్వాతి కాలంలో సురేకారంగా పిలుచుకునే పొటాషియం నైట్రేట్‌ కనుగొన్న తర్వాత దానికి గంధకం, బొగ్గుపొడి కలిపి పేలుడు పదార్థాలను, ఆ తర్వాత రకరకాల రంగు రంగుల కాంతులు వెదజల్లే బాణసంచా సామగ్రి తయారు చేయడం మొదలైంది.

బాణసంచాను మొదటగా తయారు చేసినది చైనావాళ్లు. వాళ్ల నుంచి ఇది దేశ దేశాలకు పాకింది. అలాగే క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్దం నాటికి మన దేశానికి కూడా చేరుకుంది. అప్పటి నుంచి దీపావళి పండుగ రోజు టపాకాయలు కాల్చడం అలవాటుగా మారింది. కాకరపూవొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, తాటాకు టపాకాయలు, తారాజువ్వలు వంటి బాణసంచా కాల్చడం, వాటి నుంచి వచ్చే రంగురంగుల వెలుగులను చూడటం ఎంతో సరదాగా ఉంటుంది కదూ! అయితే బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం.

జాగ్రత్తగా టపాకాయలు కాల్చండి
టపాకాయలు కాల్చడం ఎంత సరదా అయినా, టపాకాయలు కాల్చడమంటే ఒకరకంగా నిప్పుతో చెలగాటమే! అందువల్ల టపాకాయలు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి:

  • టపాకాయలు కాల్చేటప్పుడు వదులుగా ఉండే కాటన్‌ దుస్తులను ధరించండి.
  • టపాకాయలను చేత్తో పట్టుకుని నేరుగా కాల్చవద్దు. 
  • రేకు డబ్బాలు, సీసాలు, కుండలు బోర్లించి, వాటిలో టపాకాయలు అసలే కాల్చవద్దు. ఇలా చేయడం వల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి.
  • బాణసంచా కాల్చేటప్పుడు చిన్నారులను ఒంటరిగా వదిలేయవద్దు. తల్లిదండ్రులు దగ్గరుండి, జాగ్రత్తగా కాల్పించండి.
  • టపాకాయలు కాల్చేచోట బాగా నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అనుకోకుండా కాలిన గాయాలైతే, గాయమైన చోట బాగా నీరుపోసి, గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలి.
  • ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దీపావళి పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవచ్చు.

(చదవండి: అతిపెద్ద బాలల మ్యూజియం!)

మరిన్ని వార్తలు