సమాచార యుగంలో రేపటి మాట..!

13 Aug, 2014 23:39 IST|Sakshi
సమాచార యుగంలో రేపటి మాట..!

 ‘డిజిటల్ కమ్యూనికేషన్’ ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది. రోజుకు ఎన్నిగంటల సేపు ఫేస్‌బుక్‌ను ఆపరేట్ చేస్తున్నాం, రోజుకు ఎన్ని టెక్ట్స్ మెసేజ్‌లు పంపుతున్నాం, ఎన్ని రిసీవ్ చేసుకొంటున్నాం... వాటి ద్వారా మనం ప్రపంచంతో, మన వాళ్లతో ఎంత మేరకు కమ్యూనికేట్ అవుతున్నాం... అనేవి కేవలం మన వ్యక్తిగత మనస్తత్వానికి దర్పణం మాత్రమే కాదు, అభివృద్ధి చెందిన డిజిటల్ కమ్యూనికేషన్ ఫలితంగా జీవితాల్లోకి చొచ్చుకొస్తున్న మార్పులు ఇవి. వీటిని మనం కూడా  జీవితాలను ప్రభావితం చేసేంత స్థాయిలో స్వాగతిస్తున్నాం, స్వీకరిస్తున్నాం... మరి ఇలా స్వాగతించాల్సిన అంశాలు ఇంకా ఎన్నో అందుబాటులోకి వ స్తాయని అంటున్నారు శాస్త్రజ్ఞులు.  ఇవి ప్రతి వ్యక్తి జీవితాన్నీ ప్రభావితం చేస్తాయని వారు అంటున్నారు. రానున్న రోజుల్లో అందుబాటులోకి రానున్న అలాంటి డిజిటల్ మాయల్లో కొన్ని...

నెట్‌వర్క్ బేస్డ్ టెలిపతి...

ఫిక్షనల్ సాహిత్యంలోనూ, సై ఫై సినిమాల్లోనూ ‘టెలిపతి’తో ఒక ఆట ఆడేసుకొన్నారు. దశాబ్దాలుగా టెలిపతి ప్రధానంశంగా, అది ఒక అతీత శక్తిగా చాలా సినిమాలు వచ్చాయి. ఎంతో సాహిత్యం వెలువడింది. అయితే రానున్న రోజుల్లో నెట్‌వర్క్ ఆధారంగా టెలిపతి సాధ్యమేనని పరిశోధకులు అంటున్నారు. అలా అంటున్నది ఎవరో దారితప్పిన మేధావులు కాదు. ‘సిస్కో’ చీఫ్ ఫ్యూచరిస్ట్ డేవ్ ఇవన్స్- మనిషి మెదడు చేత కంప్యూటర్‌ను నియంత్రించడం, మనసులోని ఆలోచనలు మన ప్రమేయం లేకుండానే టెక్ట్స్ మెసేజ్‌లుగా  టైప్ కావడం సాధ్యమేనని అంటున్నారు. అంటే మేసేజ్ పంపడానికి చేతులు, కీబోర్డ్ అవసరం లేకుండా ఆలోచిస్తుంటే చాలు.. డివైజ్ ఆ ఆలోచనలను అందుకొంటూ కంపోజ్ చేస్తూ ఉంటుందనమాట!  ఇక యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో పరిశోధకులు డా.రాజేశ్ రావు ఆధ్వర్యంలో టెలిపతిక్ సిస్టమ్ మీద ప్రత్యేక పరిశోధనలే జరుగుతున్నాయి.  
 
 హాలోగ్రఫీ...

ఇప్పటికే ఎన్నికల ప్రచార సభలను నరేంద్రమోడీ టెక్నాలజీ సహాయంతో హోరెత్తించారు. త్రీడీ హాలోగ్రఫీ టెక్నాలజీ ద్వారా ఒకచోట ప్రసంగిస్తూ ఆ ఫీల్‌ను పలు చోట్లకు తీసుకెళ్లారు. రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీ విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అంచనా. ప్రత్యేకించి ఆఫీస్ అట్మాస్ఫియర్‌లోకి త్రీడీ హాలోగ్రఫీ టెక్నాలజీ ప్రవేశిస్తుందంటున్నారు. టీమ్ వర్క్ విషయంలో ఇది ఆహ్వానించదగ్గర పరిణామం అని అంటున్నారు. ప్రపంచంలోని విభిన్నమైన మూలల్లో ఉన్న వాళ్లు కూడా ఒకే ఆఫీసులో కలిసి పనిచేస్తున్న భావనను తీసుకురావడానికి, ఒకరితోఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయుక్తంగా ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. హాలోగ్రఫీ టెక్నాలజీ రానున్న 20 సంవత్సరాల్లో గణనీయమైన మార్పులను తీసుకు వస్తుందని అంచనా.
 
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...


విభిన్నరంగాలను ప్రభావితం చేయగలగుతుందన్న అంచనాలున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... కమ్యూనికేషన్ రంగంపై కూడా తన ప్రభావాన్ని చూపి, సమాచార వ్యవస్థలో గొప్ప మార్పును తీసుకువస్తుందంటున్నారు.  మీరు జీమెయిల్‌లో ఫిల్టర్‌ను వాడుతున్నారా? స్పామ్ మెయిల్‌లను నిషేధిత జాబితాలోకి పంపుతున్నారా? అయితే ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వ్యక్తిగతంగా మీరు కూడా వాడుతున్నట్టే! వందలాదిగా వచ్చి పడే మెయిల్స్‌ను ఫిల్టర్ చేసి అవసరమైనవి ఏవో నిర్ణయించి వాటిని మాత్రమే మీ దరికి చేర్చే టెక్నాలజీ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. మరి రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవితాలను ఇంకా ఎన్ని రకాలుగా ప్రభావితం చేస్తుందనేది చాలా విస్తృతమైన అంశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా  ప్రపంచాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి ఆ రంగ పరిశోధకులు నిర్ణయించిన గడువు ఐదు సంవత్సరాలు.
 
ఇన్‌స్టన్‌టేనియస్ ట్రాన్స్‌లేషన్..

గూగుల్ వాళ్లు ట్రాన్స్‌లేషన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. చాలా భాషల నుంచి చాలా భాషల్లోకి అనువాదం చేసుకోవడానికి అనుగుణంగా ఈ సేవను అందుబాటులో ఉంచారు. అయితే కొంత ఉపయోగం ఉన్నప్పటికీ.. ఇది అంత సక్సెస్‌ఫుల్ ఫీచర్‌కాదు. పేరాల్లో టెక్ట్స్‌ను ఇచ్చి అనువదించమని కోరితే గూగుల్ ట్రాన్స్‌లేషన్ చేతులెత్తేస్తుంది. తప్పుల తడకగా అనువదిస్తుంది. అయితే గూగుల్ ఇప్పటికి విజయవంతం కాలేకపోయినా ఈ అనువాదం విషయంలో అతి త్వరలోనే పెనుమార్పులు వస్తాయంటున్నారు. ‘భాష అడ్డంకి’అనేది కొన్ని రోజుల పాటు మాత్రమే వినిపించే మాటేనని, ఆ తర్వాత ఇన్‌స్టన్‌టేనియస్ ట్రాన్స్‌లేటర్‌లు అందుబాటులోకి వచ్చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అక్షరాల రూపంలోని సమాచారాన్ని అయినా, మాటను అయినా తక్షణం అనువదించగల సాధానాలను ఆవిష్కరించడానికి ప్రయోగాలు జరుగుతున్నాయని వారు నమ్మకంగా చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు