ఆ ఐడియా అతడి జీవితాన్నే మార్చేసింది! అదే!..ఆర్ట్‌ ఆఫ్‌ జోషిగా..

24 Nov, 2023 09:41 IST|Sakshi

‘ఈ పనికి నేను తగను’ అనుకునే వాళ్లు కొందరు. ‘తగ్గేదే లే’ అని ముందుకు వెళ్లే వాళ్లు కొందరు. రెండో వర్గం వారికి తమ దారిలో అవరోధాలు ఎదురుకావచ్చు. అయితే వారిలోని ఉత్సాహ శక్తి ఆ అవరోధాలను అధిగమించేలా చేసి విజేతను చేస్తుంది. సౌరవ్‌ జోషి ఈ కోవకు చెందిన కుర్రాడు. 24 సంవత్సరాల జోషి ఫోర్బ్స్‌ ‘టాప్‌ డిజిటల్‌ స్టార్స్‌–2023’లో చోటు సంపాదించాడు...జోషి స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని ఆల్మోర. హరియాణాలోని హన్సిలో ఫైన్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ చేశాడు. తండ్రి కార్పెంటర్‌. తల్లి గృహిణి. ఇంటర్మీడియెట్‌లో ‘సౌరవ్‌ జోషి ఆర్ట్స్‌’ పేరుతో యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించాడు.

ఈ చానల్‌లో తన స్కెచ్‌–మేకింగ్‌ వీడియోలను పోస్ట్‌ చేసేవాడు. తొలి రోజుల్లో ‘హౌ ఐ డ్రా యంఎస్‌ ధోనీ’ టైటిల్‌తో ఒక వీడియోను అప్‌లోడ్‌ చేశాడు. మొదట్లో పెద్దగా స్పందన కనిపించలేదు. అయితే లాక్‌డౌన్‌ టైమ్‌లో ఈ వీడియో పాపులారిటీ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ ఉత్సాహంతో ‘365 వీడియోస్‌ ఇన్‌ 365 డేస్‌’ ఛాలెంజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జోషి. ఈ చాలెంజ్‌ అతడి జీవితానికి టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. సౌరవ్‌ జోషిని డిజిటల్‌ స్టార్‌ను చేసింది. ఏ వీడియో చేసినా లక్షల సంఖ్యలో వ్యూస్‌ రావడం మొదలైంది. పన్నెండు మిలియన్‌ల సబ్‌స్క్రైబర్‌లతో జోషి చానల్‌ ‘ఫాస్టెస్ట్‌–గ్రోయింగ్‌ యూట్యూబ్‌ చానల్‌’జాబితాలో చేరింది.

ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు జోషి. జోషి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ‘సౌరవ్‌ జోషి ఆర్ట్స్‌’తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవడమే  కాదు కుటుంబ ఆర్థిక పరిస్థితినీ మెరుగుపరిచాడు జోషి. ‘ఇప్పటికీ ఇది నిజమా? కలా? అని అనుకుంటాను. మొదట్లో వీడియోలు అప్‌లోడ్‌ చేసినప్పుడు ఎవరూ పట్టించుకునేవారు కాదు. చాలా నిరాశగా అనిపించేది. 365 డేస్‌ ఐడియా నా జీవితాన్నే మార్చేసింది’ అంటాడు జోషి. షేడింగ్‌ టిప్స్‌ ఫర్‌ బిగినర్స్, హౌ టూ డ్రా ఏ పర్‌ఫెక్ట్‌ ఐ, హూ టూ యూజ్‌ చార్‌కోల్‌ పెన్సిల్, డ్రాయింగ్‌ టూల్స్‌ ఫర్‌ బిగినర్స్‌... ఒకటా రెండా జోషి చానల్‌కు సంబంధించి ఎన్నో వీడియోలు పాపులర్‌ అయ్యాయి.

ఎంతోమందిని ఆర్టిస్ట్‌లను చేశాయి. ‘మీరు వయసులో నా కంటే చాలా చిన్నవాళ్లు. నేను అప్పుడెప్పుడో బొమ్మలు వేసేవాడిని. ఆ తరువాత ఉద్యోగ జీవితంలో పడి డ్రాయింగ్‌ పెన్సిల్‌కు దూరమయ్యాను. మీ వీడియోలు చూసిన తరువాత మళ్లీ పెన్సిల్, పేపర్‌ పట్టాను. నేను మళ్లీ ఆర్టిస్ట్‌గా మారడానికి మీరే కారణం’ .....ఇలాంటి కామెంట్స్‌తో పాటు ‘ఇది ఎందుకూ పనికి రాని వీడియో’లాంటి ఘాటైన కామెంట్స్‌ కూడా ప్రేక్షకుల నుంచి వస్తుంటాయి. అయితే ప్రశంసలకు అతిగా పొంగిపోవడం, విమర్శలకు కృంగిపోవడం అంటూ జోషి విషయంలో జరగదు. రెండిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆర్ట్‌లోనే కాదు ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌స్టైల్లోనూ దూసుకుపోతున్నాడు సౌరవ్‌ జోషి.

ఒక్క ఐడియా చాలు
మనం వెళ్లగానే ‘సక్సెస్‌’ వచ్చి షేక్‌హ్యాండ్‌ ఇవ్వాలనుకుంటాం. అది జరగకపోయేసరికి నిరాశ పడతాం. ‘ఇది మనకు వర్కవుట్‌ అయ్యేట్లు లేదు’ అని వెనక్కి వెళ్తాం. సక్సెస్‌ కావడానికి, కాకపోవడానికి అదృష్టం ప్రమేయం ఎంత మాత్రం ఉండదు. మన టాలెంట్‌ మీద మనకు ఎంత నమ్మకం ఉంది, విజయం కోసం ఎదురుచూడడంలో ఎంత ఓపిక ఉంది అనే దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. అందరిలాగే నేను కూడా మొదట్లో బాగా నిరాశపడిపోయాను. అయితే వెనక్కి మాత్రం పోలేదు. మరో సారి ట్రై చేసి చూద్దాం...అని ఒకటికి రెండు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఒక ఐడియాతో నా జీవితమే మారిపోయింది.
– సౌరవ్‌ జోషి 

(చదవండి: సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్‌ అవుతాయట! పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు)

మరిన్ని వార్తలు