handsome weeping boys: కరువుతీరా ఏడ్చెయ్యండి! వీపింగ్‌ బాయ్‌ తుడిచేస్తాడు!

24 Nov, 2023 00:44 IST|Sakshi

కోపం, బాధ, సంతోషం వంటి భావోద్వేగాలను వ్యక్తం చేయడంలో ఇతర దేశాల వారికంటే జపాన్‌ వాసులు వెనుకబడి ఉన్నారు. దీంతో వారు చేసే ఉద్యోగ, వ్యాపారాల్లో సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీని వల్ల ఆయా కంపెనీల రెవెన్యూలపై ప్రభావం పడుతోంది. ఇది గమనించిన అక్కడి కంపెనీలు ‘హ్యాండ్‌సమ్‌ వీపింగ్‌ బాయిస్‌’ పేరిట పరిష్కార మార్గం వెతికాయి. ఉద్యోగులు పెట్టే కన్నీరు తుడిచి వారిని ఓదార్చడమే ఈ హ్యాండ్‌సమ్‌ వీపింగ్‌ బాయిస్‌ పని. ఉద్యోగి మనసులోని భారం మొత్తం దిగిపోతే మరింత చురుగ్గా పనిచేస్తారు. దీనికోసం అందంగా ఉండే అబ్బాయిలను వీపింగ్‌ బాయిస్‌గా నియమించుకుంటున్నాయి.

ఏడ్పించి...
కంపెనీలోని కొంతమంది ఉద్యోగులను ఒక రూమ్‌లో కూర్చోబెడతారు. వీరందరికి ఏడుపు వచ్చే సినిమాలు చూపిస్తారు. వీటిలో పెంపుడు కుక్కలను బాధించేవీ,తండ్రీ కూతుళ్ల మధ్య ప్రేమానుబంధాలు వంటి సన్నివేశాలు ఉంటాయి. అవి చూస్తూ బాధ కలిగిన వెంటనే ఉద్యోగులు గొంతు విప్పి మనసారా ఏడవచ్చు. ఇలా ఏడుస్తోన్న వ్యక్తి కన్నీళ్లను హ్యాండ్‌సమ్‌ వీపింగ్‌ బాయ్‌ కాటన్‌ కర్చీఫ్‌తో ప్రేమగా తుడుస్తాడు.

ఇలా అక్కడ ఉన్న వారందరి బాధను వీపింగ్‌ బాయ్‌ తన ప్రేమతో, ఓదార్పు మాటలతో పూర్తిగా ఓదార్చుతాడు. ఇలా కంపెనీ ఉద్యోగుల కన్నీరు తుడిచేసి మరీ చక్కగా పనిచేయించుకుంటున్నాయి జపాన్‌ కంపెనీలు. ఒకసారి నలుగురిలో కన్నీరు పెట్టడం అలవాటైతే వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలను చక్కగా పరిష్కరించుకోగలుగుతారు అని వారు చెబుతున్నారు.

టోక్యోకు చెందిన ‘క్రైయింగ్‌ వర్క్‌షాపు’ వ్యవస్థాపకుడు హిరోకి టెకాయ్‌కు వచ్చిన ఐడియానే వీపింగ్‌ బాయ్‌. ఆలోచన వచ్చిన తరవాత అనేక వర్క్‌ షాపులు నిర్వహించి ఈ వీపింగ్‌ బాయ్‌ను  అమలులోకి తెచ్చి పరీక్షించాడు. మంచి ఫలితాలు రావడంతో తన ఆఫీసులోనే వీపింగ్‌ బాయిస్‌ను నియమించడం మొదలు పెట్టాడు. వర్క్‌షాపులను అందమైన అబ్బాయిలు చక్కగా నిర్వహించడంతో హ్యాండ్‌సమ్‌ బాయిస్‌ను వీపింగ్‌ బాయిస్‌గా ఎంచుకున్నాడు.

అందమైన అబ్బాయిలు ఓదార్పునిస్తే కొత్త ఉత్సాహం కలుగుతుంది. అందుకే అందమైన అబ్బాయిలను ఈ పనికి ఎన్నుకున్నట్లు టెకాయ్‌ చెబుతున్నాడు. ఆ మధ్య నవ్వడం నేర్చుకోవడం మొదలు పెట్టి జపాన్‌ ఉద్యోగులు నేడు నలుగురిలో సిగ్గుపడకుండా ఏడవడం నేర్చుకోవడం కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ... గుంyð ల్లో ఉన్న భారం దిగిపోతే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. సిగ్గు, బిడియం, బాధ పోయినప్పుడు అందరితో కలిసి మెలిసి తిరగగలుగుతారు.
 
 

మరిన్ని వార్తలు