పేదలను ఆదుకునే బాధ్యత ప్రతి విశ్వాసిది!

12 Jun, 2016 00:37 IST|Sakshi
పేదలను ఆదుకునే బాధ్యత ప్రతి విశ్వాసిది!

సువార్త

 

కొందరు అన్నీ ఉన్నా అసలైనది సాధించలేరు. ఒక యువకుడు, ప్రముఖుడు ఒకసారి యేసుక్రీస్తు వద్దకు పరిగెత్తుకొచ్చి మోకరించి నిత్యజీవం పొందడానికి నన్నేం చేయమంటావని అడిగాడు. దైవాజ్ఞలన్నీ పాటించమని ప్రభువు చెబితే బాల్యం నుండి అవన్నీ తు.చ తప్పకుండా పాటిస్తున్నానన్నాడు. ‘అయితే నీకొకటి కొదవగా ఉంది, నీ ఆస్తంతా అమ్మి బీదలకు పంచి వచ్చి నన్ను వెంబడించు’ అన్నాడు యేసుప్రభువు. ఎంతో ధనవంతుడైన ఆ వ్యక్తి ప్రభువు మాటలకు చిన్నబుచ్చుకుని వెనుదిరిగి వెళ్లిపోయాడని బైబిలు చెబుతోంది (మార్కు 10:17-28).

 
అంతా నిరాశా నిస్పృహలతో ప్రభువు వద్దకొచ్చి ఒడినిండా ఆశీర్వాదాలు నింపుకొని ఆనందంగా తిరిగి వెళుతుంటే, ఆయన్ను ఆశ్రయించి వట్టి చేతులతో వెళ్లిపోయిన నిర్భాగ్యుడితను. ఆసక్తి, తె లివి, తెగింపు, యవ్వనం, ధనం, విద్య, సామాజిక స్థాయి, భక్తి, ప్రభువు ఎదుట మోకరించే అణకువ  ఇలా చేతినిండా జీవితముంది. లేనిదల్లా నిత్యజీవమే! నిత్యజీవానికి దూరంగా ఉన్నానన్న గ్రహింపు కూడా అతనికుంది కనుకనే ప్రభువు వద్దకు పరుగెత్తాడు. ప్రభువతన్ని ప్రేమించి నీకొకటి కొదవగా ఉందంటూ అతని సమస్యను విశ్లేషించాడు. అంటే నూటికి 99 ఉన్నాయి కానీ అసలైనదొకటే లేదన్నాడు ప్రభువు. నీ ఇంట్లో వైరింగ్, రంగురంగుల బల్బులు, స్విచ్చులు, ప్లగ్గులు, టీవీలు, ఏసీలు, ఫ్యాన్లు, కంప్యూటర్లు అన్నీ ఉన్నాయి సరే, అవి నడిచే కరెంటు ఒక్కటే లేదని చెప్పడం ప్రభువు మాటల తాత్పర్యం. నిత్యజీవ ప్రదాత అయిన యేసు నాశ్రయించి కూడా ఆయన చెప్పిన మాట వినక జీవితాన్ని నిరర్థకం చేసుకొని పరలోకభాగ్యాన్ని పోగొట్టుకున్న దురదృష్టకరమైన వ్యక్తి అతను. ధనాన్ని దేవునికన్నా, చుట్టూ ఉన్న ప్రజలకన్నా మిన్నగా ప్రేమించడం దేవుని దృష్టిలో ఎంత మహాపరాధమో ఇతని ఉదంతం వివరిస్తుంది. మనిషి తన స్వేచ్ఛను, ఆధిక్యతలను పొందేముందు ప్రధానంగా తన సృష్టికర్తయైన దేవుణ్ణి తన పట్ల ఆయన సంకల్పాల్ని తెలుసుకోవాలి. మనిషిని దేవుడు సంఘజీవిగా సృష్టించాడు. అంటే తన అభ్యున్నతి కోసం సమాజం నుండి ఎంత లబ్ధి పొందుతాడో, సమాజానికి కూడా ప్రతిఫలంగా అంతే లబ్ధినివ్వాలి. ఇది కేవలం సామాజిక స్పృహ మాత్రమే కాదు, దేవుని పిల్లలుగా విశ్వాసుల ఆత్మీయ బాధ్యత కూడా!ై దైవసంకల్పంతో నిమిత్తం లేకుండా సాగిన సామాజిక పరిణామాల పర్యవసానమే నేడు సమాజానికి మచ్చగా మారిన పేదరికం. దాన్ని రూపుమాపే బాధ్యత పూర్తిగా మనదే! నిష్ట కలిగిన యూదులు జీవితంలో 613 కఠిన నియమాలను తు.చ తప్పక పాటించడం ద్వారా దేవుని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాని నిరుపేదలకు అండగా నిలబడటం దేవుని ప్రసన్నం చేసుకోవడానికి దగ్గరి దారి అని యూదువాదం, సిద్ధాంతాలకు భిన్నంగా యేసుక్రీస్తు ఆచరించి బోధించాడు (మత్తయి 25:40)
 

తోటి మనుషుల మేలుకోరకుండా దేవుని మాత్రమే కోరుకోవడం మతం. నిరుపేదల్లో దేవుని చూడాలనుకోవడం నిజమైన ఆత్మీయమార్గం. మతం ఒక మంచుశిల. దానికి మానవత్వం అనే వెచ్చదనం సోకి కరిగి నీరై ప్రవహిస్తే అదే ఆత్మీయం. మంచుగా గడ్డకట్టినప్పుడు నీరు తన ప్రయోజకత్వాన్ని కోల్పోతుంది. అదే కరిగి పారినప్పుడు లోక కల్యాణ కారకమవుతుంది.

 - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్

 

మరిన్ని వార్తలు