మంట్రగాళ్లు

19 Apr, 2016 00:33 IST|Sakshi
మంట్రగాళ్లు

చేతనబడి

 

ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు  చూడ చూడ మంటల గుట్టు వేరు! అనగనగా ఒక ఊరు... సొరుగుల్లో డబ్బులు... కప్పుకి తాటాకులు తాటాకుల్ని ముట్టకుండా... తలుపుల్ని బద్దలు కొట్టకుండా సొరుగుల్లోంచి డబ్బు తీయడం ఎలా?  అది తెలుసుకుంటే ఉప్పుకీ కర్పూరానికీ తేడా తెలియదా?  ఎందుకు మంచిదో తెలియదు ఏం మంచో తెలియదు ఆ మంచితో ఏం ఒరుగుతుందో తెలియదు! కానీ ఓ పూజ చేయించుకుంటే చాలనుకుంటారు ఆనక అంత మంచే జరుగుతుందనుకుంటారు ఇదొక మానసిక బలహీనత!! అయితే ఇక్కడ జరిగింది ఇంకొకటి పూజ చేయించుకోకపోతే అరిష్టం అని భయం ఊరు తగలబడి పోతుందని వణుకు ఇది ఇద్దరు స్వార్థపరుల కుట్ర డబ్బు గుంజడం కోసం పుట్టించిన భయం

 

అది నెల్లూరు జిల్లా, బోగోలు మండలంలో జువ్వలదిన్నె గ్రామం. సముద్రతీర గ్రామం. మొక్కలు త్వరగా ఎదగడానికి అనువైన ఇసుకనేల, నీటి వసతి ఉన్న ఊరు. పాడిపంటలతో సస్యశ్యామలమైన నేల. నీలివిప్లవంతో ఆధునిక పోకడలు సంతరించుకుంటున్న సమయం. ఇళ్లకు అప్పటి వరకు ఉన్న పాతతాటాకుల కప్పు తీసేసి కొత్త తాటాకు వేయడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడడం లేదు. ‘ఈ ఎండాకాలం మాసూలు (పంట చేతికొచ్చేకాలం) అయిన వెంటనే ఇంటికి శంకుస్థాపన చేద్దాం’ అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందరి ఇళ్లలోనూ అంతో ఇంతో డబ్బు ఉంది. పేదరికపు ఆనవాళ్లను తుడిచిపెట్టి అంతా రంగురంగుల మిద్దెలు కట్టుకోవడానికి సమాయత్తమవుతున్నారు. రోగమొస్తే ఎవరూ నాటువైద్యుణ్ని చూడడం లేదు. ఊరిలోనే మంగలి పని చేస్తూ పార్ట్‌టైమ్ ఆర్‌ఎంపి సేవలందించే వాళ్లనూ పెద్దగా పట్టించుకోవడం లేదు. బస్సెక్కి పట్టణంలో ప్రభుత్వాసుపత్రికి పోతున్నారు. ఇంకాస్త డబ్బుంటే ప్రైవేటు ఆసుపత్రికి పోతున్నారు. ‘పిల్లాడికి గాలి సోకింది, అంత్రం కట్టండి’ అని మంత్రగాడి దగ్గరకు వచ్చే వాళ్లూ కరువయ్యారు. అంతలోనే ఓ ఉపద్రవం.

 

ఈ ఊరికి ఏమైంది!

‘ఏమైంది... ఎందుకిలా జరుగుతోంది... ఎవరి చూపు పడిందో ఇంటి మీద’ ఇలాంటి ప్రశ్నలు ఎవరికి వారే వేసుకోసాగారు. అది జువ్వలదిన్నె గ్రామంలో శ్రామికులు నివసించే వాడ. ఓ రోజు రాత్రి... రోజంతా కాయకష్టం చేసిన జనం కడుపు నిండా తిని ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో ఉన్నట్లుండి హాహాకారాలు వినిపించాయి. ఒక ఇంటి చూరుకు నిప్పంటుకుంది. చూసిన వాళ్లు పెడబొబ్బలు పెట్టారు. వీపున చరిచినట్లు ఊరంతా ఒక్కసారిగా నిద్రమేల్కొంది. నీళ్లు పోసి మంటలార్పారు. ఎందుకిలా జరిగిందోననే ఊహాజనిత సందేహాలు మొదలవుతున్నాయని గ్రహించి ‘ఎండలు మండిపోతున్నాయి, తాటాకు కొంప తగలబడకుండా ఉంటుందా’ అని గదమాయించి అంతటితో తెర దించేశాడు ఆ ఇంటి యజమాని. ఇల్లు తగలబడిన కలకలం సద్దుమణిగిపోయింది. జరిగిందొక పీడకల అని అందరూ మరిచిపోవడానికే ప్రయత్నించారు. అంతలోనే మరో ఇంటికి నిప్పంటుకుంది. ఈసారి మంటలు ఏ అర్ధరాత్రో కాదు. ఉదయం పదిగంటల సమయంలోనే. ఇలాంటివి జరిగినప్పుడు సమీకరణలు వెదకడానికి ఎవరో ఒకరు తయారవుతారు. గ్రామాల్లో ఇది సర్వసాధారణం. ఆ రెండిళ్లలో మంటలు రావడానికి సారూప్యతను అన్వయించేలోపే మరో ఇల్లు మంటలకు లోనయింది. ఇక తార్కిక సమీకరణాలు గాలికి కొట్టుకుపోయాయి. గుండెల్లో మంటలు మొదలయ్యాయి. ఎప్పుడు ఎవరిల్లు తగలబడుతుందోననే భయంతో నిద్రపోవడానికే భయపడుతున్నారు. ఇంట్లో ఉన్న నలుగురూ ఒక్కసారి భోజనానికి కూర్చోవడానికి జంకుతున్నారు. ‘మీరు తినండి, నేను తర్వాత తింటా’ అంటూ ఇంటిపెద్ద ఆరుబయట మంచం వాల్చుకుని ఏ మూల చూరు నుంచి పొగ వస్తుందోనని చూడడంతోనే సరిపోతోంది. ఆడపిల్ల పెళ్లి కోసం ఇంట్లో దాచి ఉంచిన మంచి బట్టలన్నీ మూటగట్టి ఏ తెలిసిన వారింట్లోనో దాచుకుంటున్నారు ఆడవాళ్లు. మొత్తానికి నెల రోజుల్లోనే పదికి పైగా ఇళ్లకు నిప్పంటుకుంది.

 

ఊరికి ఏదో అరిష్టం దాపురించకపోతే ఇలా ఇళ్లు ఎందుకు తగలబడుతాయి- అంటూ తార్కిక వాదన ముసుగులో మూఢవిశ్వాసాన్ని జొప్పించే ప్రయత్నం జరిగిపోయింది. ఊరి పెద్దమనుషులకూ ఇది నిజమేనేమో అనిపించింది. నలుగురైదుగురు కలిసి మంటలంటుకున్న ఇళ్లకు వెళ్లి శాంతి పూజలు చేయించమని సలహా ఇచ్చారు. ‘ఎందుకైనా మంచిది మంటలు అంటని వాళ్లు కూడా ఇళ్లలో పూజలు జరిపిస్తే మంచిది’ అంటూ హితవచనాల రూపంలో మూఢవిశ్వాసం చాపకింద నీరులా ఊరంతా ప్రవహించేసింది.

 
పత్రికల్లో వార్తలొచ్చాయి!

గాల్లో నుంచి మంటలు రావడాన్ని, ఊరి జనం భయపడడాన్ని వార్తా పత్రికలు జిల్లా ఎడిషన్‌లో విస్తృతంగా రాస్తున్నాయి. జనవిజ్ఞానవేదిక నెల్లూరు విభాగం అప్రమత్తం అయింది. ఊరంతా తిరిగి విచారించిన తర్వాత అనేక విషయాలు తెలిశాయి. మంటలకు ప్రత్యక్ష కారణంతోపాటు పరోక్ష కారణాలు కూడా బయటకు వచ్చాయి. ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని నిర్ధారణ అయిన తర్వాత పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సంఘటన తర్వాత జువ్వలదిన్నెతోపాటు పరిసర గ్రామాల్లో కూడా మంటలు రావడం తగ్గిపోయాయి. ఈ మంటల వెనుక మిస్టరీ ఓ సినిమా కథను తలపిస్తుంది.

 
పథకం ఏమిటంటే!

ఊళ్లో జనసామాన్యానికి ఉపాధి మార్గాలు పెరిగాయి. చేతుల కష్టాన్ని నమ్ముకున్న అందరూ లక్షణంగా బతికేస్తున్నారు. డబ్బుతోపాటు విజ్ఞానానికి కూడా దగ్గరవుతున్నారు ఊరి జనం. అంత్రం కట్టించుకోవడం మీద నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. ఇదిలా కొనసాగితే మంత్రగాళ్ల బతుకులు బలుసాకు తినాల్సిన స్థితికి చేరుకుంటాయనే వాస్తవాన్ని చాలా త్వరగానే గ్రహించాడు ఆ ఊరి మంత్రగాడు. ఏదో చేయాలి, ఏదో ఒకటి చేసి ఊరి దృష్టిని మరల్చాలి. ఆ మరల్చేదేదో అతీంద్రియ శక్తుల మీదకు మరల్చాలి. అంటే... విపరీతమైన భయాన్ని కలిగించాలి. గుండెలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసేలా చేయాలి. ఇంట్లో పడుకోవడానికే భయపడాలి. ఆదమరిచి కంటినిండా నిద్రపోవడానికి బెదిరిపోవాలి, అంతా కట్టకట్టుకుని మంత్రగాడి ముందు చేతులు జోడించి ఊరిని కాపాడమని ప్రాధేయపడేలా చేయాలి... అదీ పథకం. మంత్రగాడికి తోడు ఆ ఊరిలోని రామారావు అనే వ్యక్తి. రంగునీళ్లిచ్చి టానిక్కు అని చెబితే జనం నమ్మే రోజులు పోవడంతో అతడికి ఆర్థిక కష్టాలు వచ్చేశాయి. గడ్డం గీసి, క్షవరం చేసుకుంటూ ఎన్నాళ్లు బతకాలి. ఈ వృత్తిని నమ్మకంగా నమ్ముకుంటే తన బతుకు క్షవరం అవుతుందనుకున్నాడు. మూడు రంగు చొక్కాలు, ఆరు జేబు రుమాళ్లతో జల్సాగా జీవించాలంటే ఊరి వాళ్లని సమూలంగా మోసం చేయాల్సిందే అనుకున్నాడు. ఆ ఊరి మంత్రగాడితో చేయి కలిపాడు. ఆ ఇద్దరూ పన్నిన పన్నాగంలో ఊరు చిత్తుగా మునిగిపోయింది.

 
గాల్లోంచి మంటలెలా వచ్చాయంటే..?
కొబ్బరి కాయ మీద ఫాస్ఫరస్ పెట్టి చూరులో పెట్టేవారు. భాస్వరం గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి మండేది. ఇదేమీ తెలియని ఊరి వాళ్లు గాల్లోంచి మంటలొచ్చాయని, ఊరిని కొరివి దెయ్యం పూనిందని భయపడిపోయారు. గ్రామాల్లో గడ్డివాములు తగలబడడంలోనూ ఇదే ఫార్ములా. పచ్చభాస్వరాన్ని నీటిలో నుంచి పేడలో పెట్టి వదిలేస్తే చాలు. పేడలో తడి పూర్తిగా ఎండిపోయిన తర్వాత అంటే రెండు-మూడు రోజులకు భాస్వరం... గాల్లోని ఆక్సిజెన్‌తో కలిసి మండుతుంది. మంట రావడానికి ముందు అక్కడ మనిషి ఆనవాలు కూడా ఉండదు. కానీ మంట వస్తుంది. - వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

 

ఇలా ఛేదించాం!
ఆ ఊరికి వెళ్లి మంటలంటుకున్న ఇళ్లంటినీ చూశాం. అన్ని ఇళ్లకీ ఒకే ఎత్తులో మంటలు రేగినట్లు ఉంది. అది కూడా ఐదారడుగులకు మించకుండా మనిషి చేతికందే ఎత్తులోనే. ప్రమాదవశాత్తూ సంభవించిన మంట ఒక్కటీ లేదు. ఎవరో మనిషే పెట్టాడని నిర్ధారించుకున్నాం. ఊరి వాళ్ల ముందు  మేము కొబ్బరికాయ మీద భాస్వరాన్ని పెట్టి మండించి చూపించాం. ఇల్లు కాలినప్పుడు కూడా ఇలాంటి వాసనే వచ్చిందని చెప్పారు. ఎక్కువ ఇళ్లు ఉదయం పది గంటల పైన... అంటే అంతా పనులకు పొలానికి వెళ్లిన తర్వాత మాత్రమే తగలబడ్డాయి. మా బృందం దర్యాప్తులో మంత్రగాడు, మంగలి వ్యక్తి కలిసి చేసినట్లు నిర్ధారణ అయింది. పోలీసు విచారణలో వాళ్లు తప్పును అంగీకరించారు.  - జి. మాల్యాద్రి, కన్వీనర్, జేవీవీ ప్రచురణల విభాగం, నెల్లూరు

 

మరిన్ని వార్తలు