వారు చివరి మెట్టును చేరగలిగారు

4 Jan, 2019 01:04 IST|Sakshi
బిందు, కనకదుర్గ

దేవుడి సన్నిధే ఒక అలౌకిక అనుభూతి. దాన్ని ఆస్వాదించడానికే ఆలయానికి వెళ్తాం! రుతుచక్ర వయసులో ఉన్న మహిళల శారీరక శుభ్రత ఆధారంగానే అయ్యప్ప దర్శనం ఆడవాళ్లకు ఇవ్వలేదు. రుతుస్రావం ప్రకృతి ఇచ్చిన ప్రత్యుత్పత్తి ప్రక్రియ. అదే లేకపోతే సృష్టే లేదు అనే తర్కంతో దేవుడి దర్శనం కోసం స్త్రీలు ఉద్యమించారు. సాధించారు. నలభై రెండేళ్ల బిందు అమ్మిని, నలభై ఒక్క ఏళ్ల కనకదుర్గ... చట్టం కల్పించిన హక్కును వినియోగించుకున్నారు. ప్యూబర్టీ రాని, మెనోపాజ్‌ వచ్చిన ఆడవాళ్లే శబరిమల అయ్యప్పను దర్శించుకోవాలనే నియమాన్ని సవరించారు. శబరిమల అయ్యప్పను దర్శించుకున్న మొదటి మహిళలు (రుతుక్రమ వయసులో ఉన్న)గా చరిత్ర సృష్టించారు. మొన్న మంగళవారం రాత్రి (ఒకటవ తారీఖు) ఎర్నాకులం నుంచి బయలుదేరి బుధవారం తెల్లవారు జామున శబరిమల ప్రారంభ ప్రాంతమైన పంపానది దగ్గరకు చేరుకున్నారు. అక్కడ పోలీసుల రక్షణతో శబరిమలకు వెళ్లారు. బుధవారం (రెండో తారీఖు) ఉదయం 3 గంటల 45 నిమిషాలకల్లా ఆలయంలోకి అడుగుపెట్టారు. 

ఆ ఇద్దరి  నేపథ్యం బిందు... ఒక యాక్టివిస్ట్‌. దళిత్‌ యాక్టివిస్ట్‌.
కన్నూర్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లీగల్‌ స్టడీస్‌లో ప్రొఫెసర్‌. చిన్నప్పటి నుంచీ బిందు రెబల్‌. కాలేజీరోజుల్లో కేరళ విద్యార్థి సంఘటన (వామపక్ష విద్యార్థి సంఘం)నాయకురాలిగా పనిచేశారు. కేరళ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ చేశారు. కమిట్‌మెంట్‌కు మరోపేరు ఆమె. జెండర్‌ ఈక్వాలిటీ, సాంఘిక న్యాయ పోరాటాల్లో ముందున్నారు. ఆ విషయాల మీద ఆమె ఇచ్చే ఉపన్యాసాలు వినడం కోసం కేరళలో స్టూడెంట్స్‌ చెవి కోసుకుంటారు. బిందు వ్యక్తిగత విషయానికి వస్తే ప్రముఖ పొలిటికల్‌ యాక్టివిస్ట్‌ హరిరన్‌ ఆమె భర్త. వాళ్లకు పదకొండేళ్ల కూతురు ఓల్గా. కోజీకోడ్‌ జిల్లాలోని పోక్కాడ్‌ ఆమె నివాసం. 

కనకదుర్గ.. ఓ భక్తురాలు ... కనకదుర్గ నాయర్‌ కేరళ రాష్ట్ర సివిల్‌ సప్లయ్స్‌ కార్పొరేషన్‌ ఉద్యోగి. భర్త ఉన్ని కృష్ణన్‌. ఇంజనీర్‌. వాళ్లకు ఇద్దరు పిల్లలు. మలప్పరంలో ఉంటారు. ఓ భక్తురాలిగా శబరిమల దర్శనానికి వెళ్లాలనుకున్నారు. 

బిందు, కనకదుర్గ ఎలా కలిశారు? 
సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ స్త్రీల ఆలయ ప్రవేశానికి ఇతరత్రా తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే సరికి రహస్యంగా ప్రణాళికలు వేసుకోవాల్సి వచ్చింది. ఆసక్తి ఉన్న మహిళలు కొంత మంది  ‘నవోథన కేరళం శబరిమలయిలెక్కు’ అనే ఒక ఫేస్‌బుక్‌ పేజ్‌ స్టార్ట్‌ చేశారు. అలా బిందు, కనకదుర్గ ఒకరికొకరు పరిచయం అయ్యారు. డిసెంబర్‌ 24న మొదటి ప్రయత్నం చేశారు. ఆలయంలో ఆడవాళ్లకు  ప్రవేశం లేదు అని గట్టిగా నమ్మే వారి నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆ దాడి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులు సహా  పోలీసులు, మీడియా కంట కూడా పడకుండా ఓ వారం రోజుల పాటు రహస్యంగా ఉండి ఈ నెల ఒకటవ తారీఖున మళ్లీ ప్రయత్నించారు. అలా దైవ దర్శనం సాధించారు. ‘‘దర్శనం అయ్యేదాకా కదిలేది లేదని చాలా మొండిగా ఉన్నాం. దాంతో పోలీసులకు సెక్యూరిటీ కల్పించక తప్పలేదు’’ అని చెప్పారు బిందు. 

ప్రవేశం కోసం ఇప్పటివరకు  ప్రయత్నించిన మహిళలు
గుడి తలుపులు తెరిచినప్పటి నుంచి కనీసం పదమూడు మంది మహిళలు దర్శనం కోసం శబరిమల బాట పట్టారు. నీలక్కల్‌ బేస్‌క్యాంప్‌ దాకా రాగలిగారు. తర్వాత హేళనకు, హెచ్చరికలకు, దాడులకు గురయ్యి బలవంతంగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.  అలా విఫలయత్నం చేసిన మహిళల్లో మొదటి వ్యక్తి సీఎస్‌ లిబి. అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నాను అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసి మరీ బయలుదేరిన లిబిని గుడికి 65 కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకున్నారు వ్యతిరేకులు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలభై ఏళ్ల మాధవిని పంబ నుంచి వెనక్కి పంపించేశారు భక్తులు. ఢిల్లీకి చెందిన సుహాసినీ రాజ్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. హైదరాబాద్‌ రిపోర్టర్‌ కవితా జక్కల్‌ ‘వాలియ నడప్పాంధాల్‌’ క్యూకాంప్లెక్స్‌ వరకూ వెళ్లగలిగింది.

కవితాతో కలిసి వెళ్లిన మరో యాక్టివిస్ట్‌ రెహానా ఫాతిమా. ఇతర భక్తులు, ఆడవాళ్ల ఎంట్రీని వ్యతిరేకిస్తున్న వాళ్లు గనుక అడ్డుకోకపోయి ఉంటే రెహాన ఫాతిమా చరిత్ర సృష్టించి ఉండేది. రెహానా మీద ఆగ్రహం ఆమెను వెనక్కి పంపించేంత వరకే ఆగలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిని ధ్వంసం చేసేదాకా సాగింది. అంతేకాదు మతసంబంధమైన నమ్మకాలను కించపరిచిందని రెహానా మీద కేసూ నమోదు చేశారు. ఆ తర్వాత మేరీ స్వీటీ అనే తిరువనంతపురం వాసి యత్నమూ ఫలించలేదు. అనంతరం వచ్చిన ఆరుగురు మహిళలనూ అడ్డగించారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన 47 ఏళ్ల బాలమ్మ అనే మహిళ వెళ్లింది. నడప్పాంధాల్‌లో ఆమెనూ అడ్డుకున్నారు భక్తులు.  

మరిన్ని వార్తలు