ఒంటరి తల్లిదండ్రులను ప్రమాదాల నుంచి రక్షిస్తుంది.. నిమిషాల్లో అలర్ట్‌

4 Nov, 2023 10:37 IST|Sakshi

పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఇంట్లో ఒంటరిగా ఉంటారు. ఇలాంటి ఒంటరి తల్లిదండ్రులను ప్రమాదాల బారి నుంచి రక్షించడానికి కేరళ స్టార్టప్‌ ‘స్మార్ట్‌కేర్‌’ ఎమర్జెన్సీ అలర్ట్‌ టెక్నాలజీతో కొన్ని పరికరాలను రూపొందించింది....

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని రిటైర్డ్‌ ఉద్యోగి రాజేశ్వరరావు ఒంటరిగా ఉంటాడు. భార్య రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది. కొడుకు, కోడలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. విశాఖపట్టణంలో ఉండే అనసూయమ్మకు ఒక్కగానొక్క కూతురు పుణెలో ఉద్యోగం చేస్తుంది. అనసూయమ్మ భర్త చనిపోయి చాలాకాలం అయింది.రాజేశ్వరరావు ఒకరోజు ఇంట్లో కాలు జారిపడ్డాడు. ఆ సమయంలో వేరే ఊరి నుంచి వచ్చిన బంధువు ఒకరు ఉండడంతో ఆయనను త్వరగా హాస్పిటల్‌కు తీసుకువెళ్లాడు.అనసూయమ్మకు కూడా ఇలాగే జరిగింది. పడిన తర్వాత చాలాసేపటికి ఎవరో ఇంటికి రావడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

మరింత ఆలస్యం అయి ఉంటే అనసూయమ్మ ప్రమాదంలో పడేది. అయితే అన్ని సందర్భాల్లోనూ ఎవరో ఒకరు వచ్చి బాధితులను హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకువెళతారని గ్యారెంటీ లేదు. ఇక కేరళ విషయానికి వస్తే ఒంటరిగా జీవిస్తున్న వృద్ధుల సంఖ్య అక్కడ ఎక్కువగా ఉంది. వారు ప్రమాదాల బారిన పడిన సంఘటనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిందే... స్మార్ట్‌కేర్‌.కేరళకు చెందిన వేణునాథ్‌ స్వీడన్‌లో చదువుకునే రోజుల్లో ఒక వృద్ధురాలి ఇంట్లో అద్దెకు ఉండేవాడు. ఆమె వయసు ఎనభై సంవత్సరాలు. ఆ వృద్ధురాలి ఒంటరి జీవితం చూసి వేణుకు జాలిగా అనిపించేది.

ఒక రాత్రి ఆమె అనారోగ్యానికి గురైంది. సీరియస్‌ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆమె తన చేతికి ఉన్న కంకణంలాంటి దానిపై ఉన్న బటన్‌ను నొక్కింది. వెంటనే టేబుల్‌ మీద ఉన్న పరికరం తనతో మాట్లాడడం మొదలుపెట్టింది. తనకు ఇబ్బందిగా ఉన్న విషయం గురించి చెప్పింది ఆమె. ఇరవై నిమిషాల లోపే వైద్యుడు, సహాయక బృందం ఆమె ఇంటికి వచ్చారు. ప్రాథమిక చికిత్స చేసి హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఆ పరికరం గురించి వేణుకు విపరీతమైన ఆసక్తి ఏర్పడి దాని గురించి వివరాలు తెలుసుకున్నాడు. మన దేశంలో కూడా ఇలాంటి టెక్నాలజీ ఉంటే బాగుండేది అనుకున్నాడు. 

స్వీడన్‌లో డాటా సైంటిస్ట్‌గా కొంతకాలం ఉద్యోగం చేసిన వేణు ఆ తరువాత ఇండియాకు వచ్చి స్నేహితుడు అరుణ్‌ నాయర్‌తో కలిసి ‘అన్స్‌ఫ్రిడ్‌ స్మార్ట్‌కేర్‌ ప్రొడక్స్‌’ కంపెనీ మొదలు పెట్టాడు.అంతకుముందు ఉద్యోగం చేస్తూనే జీతంలో సగం మొత్తాన్ని వృద్ధులకు ఉపకరించే ఉపకరణాల గురించి రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌పై ఖర్చు చేసేవాడు. ఎంతోమంది నిపుణులతో మాట్లాడేవాడు. స్మార్ట్‌కేర్‌ ఉత్పత్తుల్లో ఒకటి... వైర్‌లెస్‌ ఫాల్‌ సెన్సర్‌. దీన్ని బాత్‌రూమ్‌ గోడలకు బిగిస్తారు. వృద్ధులు పడిపోతే కంపెనీకి అలర్ట్‌ పంపుతుంది. కంపెనీ వెంటనే వైద్యులను ప్రమాద బాధితుల ఇంటికి పంపుతుంది. చేతికి ధరించే ‘విబ్బీ డిటెక్టర్‌’ కూడా వృద్ధులు ప్రమాదంలో ఉన్నప్పుడు అలర్ట్‌ పంపుతుంది. 

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవారికి ఇది బాగా ఉపకరిస్తుంది. ‘హీట్‌ అలారమ్‌’ అనేది వైర్‌లెస్‌ ఇండోర్‌ సెన్సర్‌. లాకెట్‌లా మెడలో ధరించవచ్చు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు హెచ్చరిస్తుంది. తక్కువ బరువుతో ఉండే ‘మైఎమీ’ లాకెట్‌ వృద్ధులు ఇల్లు దాటి బయటికి వెళ్లినప్పుడు ఉపయోగపడుతుంది. ఆపద సమయంలో సహాయం కోసం దీనిపై ఉన్న బటన్‌ను నొక్కాలి...‘స్మార్ట్‌కేర్‌’ ఉత్పత్తుల్లో ఇవి కొన్ని మాత్రమే.‘స్మార్ట్‌కేర్‌’ నలభై హాస్పిటల్స్‌తో కలిసి పనిచేస్తోంది. కోల్‌కత్తా, ముంబై, చెన్నై, దిల్లీ, బెంగళూరు నగరాలకు కూడా కంపెనీ విస్తరించే ప్రయత్నాల్లో ఉంది.
 

మరిన్ని వార్తలు