ఈ జీవితానికి ఈ కష్టాలు చాలు

10 Nov, 2019 01:14 IST|Sakshi

స్త్రీ వైశిష్ట్యం – 17

కుంతీదేవి పడిన కష్టాలు అటువంటి ఇటువంటివి కావు. ఇన్ని ఉత్థాన పతనాలు చూసినా ఎన్నడూ ధర్మం వదిలి పెట్టలేదు. అయినా పరిస్థితులు ఆమెకు ఎప్పుడూ అగ్నిపరీక్ష పెడుతూనే వచ్చాయి. ఒక ఆసనంలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు. ఒక ఆసనంలో ధర్మరాజు కూర్చున్నాడు. చనిపోయిన వీరుల పేర్లు చదువుతూ నువ్వులు, నీళ్ళు వదులుతున్నారు. ఫలానా వీరుడి పేరు చదవగానే ధర్మరాజు ‘నాకు చెందిన వాడు’ అని ధర్మోదకాలు వదిలాడు. మరొక వీరుడి పేరు చెప్పగానే ‘నాకు చెందిన వాడు’ అని ధృతరాష్ట్రుడు నీళ్ళు నువ్వులు వదిలాడు... కార్యక్రమం ఇలా నడుస్తుండగా... కర్ణుడి పేరు చదివారు. ‘నాకు చెందిన వాడు కాడు’ అని ధర్మరాజు అన్నాడు. ధృతరాష్ట్రుడు అలాగే అన్నాడు.

అక్కడే ఉన్న కుంతీదేవి అది విని తట్టుకోలేక పోయింది. యుద్ధ సమయంలో ఆమె శిబిరంలో ఉన్న కర్ణుడి దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడితే..‘‘అర్జునుడు తప్ప మిగిలిన పాండవుల జోలికి రాను... ఎటుచూసినా నీకు పాండవులు ఎప్పుడూ ఉంటారు’ అని చెప్పాడు. అటువంటి ఔదార్యమున్నవాడిని... తన కుమారుడేనని, కన్యా సంతానమని ఎప్పుడూ  చెప్పుకోలేక పోయింది. ఇప్పుడు చిట్టచివరన కనీసం నువ్వులు–నీళ్ళు కూడా దక్కడం లేదు. తల్లడిల్లిపోయింది. భోరున ఏడుస్తూ చెప్పేసింది. నాకు కొడుకు, నీకు సోదరుడు – అంది. ధర్మరాజన్నాడు కదా...‘‘ఎంత తప్పు చేసావమ్మా! కర్ణుడు పెద్దవాడు. పట్టాభిషేకం చేసుకోవాలి. నీవు ఈ రహస్యాన్ని దాచి అన్నను చంపించావు.

కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంత సేపు కూడ నిజం దాగకుండు గాక!’’ అని శాపమిచ్చాడు తల్లికి. ఎవరికోసం అష్టకష్టాలు పడిందో ఆ బిడ్డల వలన శాపం పొంది తలదించుకుంది. మహా ఔన్నత్యం కల ఇల్లాలని భీష్మ పితామహుడి ప్రశంసలు కూడా పొందిన కుంతీదేవి చివరకు వైరాగ్యం పొంది, కృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ... ‘‘చాలు కృష్ణా, ఉత్థానపతనాలు జీవితంలో ఎన్నో చూశా. ఒక్కొక్కసారి సంతోషించా... ఒక్కొక్కసారి లోయల్లోకి జారిపోయా. ఎన్ని కష్టాలు పడ్డానో, యాదవులందు నువ్వున్నావని, నా మేనల్లుడివనీ, నేను మేనత్తననీ మమకారం వద్దు. కడుపున పుట్టిన బిడ్డలని మమకారం వద్దు.

ఈ మమకారమనే పాశాలు కోసెయ్యవా కష్ణా! ఆ గంగ ఎక్కడ పుట్టిందో చివరకు సముద్రంలో చేరిపోయినట్లుగా ఇక నా జీవితం ఎప్పుడూ నిన్నే స్మరిస్తూ నీలోనే ఐక్యమయిపోయేటట్లుగా నువ్వు తప్ప నా మనసులో ఇంకొక ఆలోచన రాకుండా నన్ను అనుగ్రహించవయ్యా!’’ అని ప్రార్థన చేసింది. కలిసొచ్చినన్నాళ్ళు ధర్మం పట్టుకోవడం చాలా తేలికే. కాలం కలిసిరానప్పుడు, కాల ప్రవాహానికి ఎదురీదాల్సి వచ్చినప్పుడు చూపిన ధైర్యం, తెగువ, నిబ్బరం చెప్పనలవి కాదు. ద్రౌపదీ దేవి ఎంత గొప్ప స్త్రీ, సింహాసనానికి ఉత్తరాధికారులు కావలసిన ఉపపాండవులను రాత్రికి రాత్రి నిద్రలో అశ్వత్థామ చంపితే... అప్పుడు చూడాలి ఆమె ఆంతరంగంలోని లోతులు, ఆమె ప్రదర్శించిన ఔన్నత్యం !

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా