ఇల్లంటే ఇంత బాగుంటుందా!

13 Apr, 2020 01:35 IST|Sakshi

లాక్‌డౌన్‌ కవిత

పని భారమంతా ఆమె మీద వేసేసి
పేపరుతోనో టీవీతోనో కాలక్షేపం చేసేవాణ్ని
వండివార్చిన వాటికి వంకలు పెడుతూ 
చాటుగా కళ్లొత్తుకుంటున్న ఆమెను చూసి సంతృప్తిపడేవాణ్ని
కాలర్‌ మీద మరకలు వదలలేదనో 
ఖాళీగా తిని కూర్చుంటున్నావనో చిటపటలాడేవాణ్ని
ప్రపంచ భారమంతా నేనే మోస్తున్నట్టు 
ఇంట్లో చేసేది పనే కాదని తీర్మానించేవాణ్ని
తపస్సు చేస్తున్న మౌనమునిలా శీర్షాసనమేసి
మధ్యలో మాట్లాడితే     
నీకు మాట్లాడ్డమే రాదని చిన్నబుచ్చేవాణ్ని

స్వీయ నిర్బంధం మొదలయింది
కొంచెం కొంచెంగా ‘ఇగో’ ఎగిరిపోసాగింది    
ఇల్లంటే నిలబెట్టిన ఇటుకలు కాదని
అంతకు మించిన మరేదో బంధమనే స్పృహ కలిగింది
ఇన్నాళ్ళూ గుండెల్ని ఛిద్రం చేసిన చూపుల్ని 
గోడ మేకులకు తగిలించేసి 
పెదవుల మీదకి కాస్త చిరునవ్వును అరువు తెచ్చుకున్నాను
ఎండిన బట్టలు మడతపెడుతూనో 
దుమ్ముతో నిండిన అరల్ని దులిపి తుడుస్తూనో 
మనసుకి హాయిగా చేతిపనికి సాయంగా మారాను
మొదట్లో ఏదో శంక, ఆపైన కాసింత విస్మయం     
గుండెల్లోని తడి నీటిపొరలుగా ఆమె కళ్ళల్లోకి చేరింది 
ఇప్పుడు తనే – నేను, నేనే –తనుగా    
ఇద్దరమూ ఒకరికొకరుగా     
అనుబంధాల పూలతీగలుగా అల్లుకుపోతున్నప్పుడు 
ప్రేమతోనో ప్రశంసతోనో నా వైపు చూస్తుంటే అనిపించింది        
నిజంగా ఇల్లంటే ఇంత బాగుంటుందా అని!    
- డా‘‘  జడా సుబ్బారావు

మరిన్ని వార్తలు