లక్కీ రెస్టారెంట్!

3 Aug, 2015 23:26 IST|Sakshi
లక్కీ రెస్టారెంట్!

సమ్‌థింగ్ స్పెషల్

మీరు ఎప్పుడూ బయటికెళ్లినప్పుడు టీ, టిఫిన్ ఎక్కడ కానిస్తారు? ఏ రెస్టారెంట్‌లోనో, హోటల్లోనో చేస్తారు... మరి ఆ హోటల్ లేదా రెస్టారెంట్‌లో మీరు కూర్చున్న టేబుళ్ల కింద సమాధులు కనిపిస్తే ఏం చేస్తారు. ఓ పెద్ద కేక వేసి దెబ్బకు ఆ రెస్టారెంట్ యజమాని దగ్గరకు వెళ్లి రెండు చివాట్లు పెట్టి ‘‘నీ రెస్టారెంట్  వద్దు... నీ టీ వద్దు, టిఫిన్ వద్దు అంటారు’’ అంతే కదా..కానీ అహ్మదాబాద్‌లోని లాల్ దర్వాజా ప్రాంతంలో ఓ రెస్టారెంట్ గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోక తప్పదు. ఆ రెస్టారెంట్ పేరు ‘లక్కీ రెస్టారెంట్’. దాని యజమాని కృష్ణన్ కుట్టి నాయర్. అక్కడ కుర్చీల కింద, లోపలికి వెళ్లే దారి పొడుగునా సమాధులే! అది శ్మశానంలోనే కట్టారని అందరూ అనుకుంటుంటారు. కానీ ఆ రెస్టారెంట్ మొదటి నుంచీ శ్మశానంలో లేదు.

1950లో మహమ్మద్ అనే వ్యక్తికి శ్మశానం బయట ఓ టీ కొట్టు ఉండేది. అతనికి సహాయం చేసే కృష్ణన్ కుట్టి నాయర్ నెమ్మదిగా అతని వ్యాపారంలో భాగస్వామి అయ్యాడు. వారి వ్యాపారం లాభాల్లో సాగుతూ ఆ స్థలాన్ని విస్తరించడం మొదలు పెట్టారు. అలా వారు కొట్టు విస్తీర్ణం కోసం మెల్లి మెల్లిగా శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకున్నారు. అలా ఆ కొట్టు కాస్తా పెద్ద రెస్టారెంట్‌గా మారింది. ఆ ఆకుపచ్చ రంగు సమాధులు కలిసి రావడంతో వాటిని తొలగించలేదు. ప్రస్తుతం ఆ ‘లక్కీ రెస్టారెంట్’ను నడిపిస్తున్న నాయర్‌ను ఆ సమాధుల సంగతి అడిగితే ‘‘ ఈ సమాధులే నాకు అదృష్టాన్ని తెచ్చి పెట్టాయి. ఇక్కడికి వచ్చే కస్టమర్లు ఎంతో ఆనందంగా వచ్చి టీ, పాలు తాగి, టిఫిన్, భోజనం చేసి వెళ్తుంటారు. ఎంతోమంది నాకు సలహా ఇచ్చారు ఆ సమాధులను తొలగించమని. కానీ నాకు మనసు రాలేదు. ఎందుకంటే అవే నా బిజినెస్‌కు లక్కీ అని నేను భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చాడు నాయర్.

కొందరు ఆ రెస్టారెంట్‌కు టీ తాగడానికి వచ్చి తమ బంధువుల సమాధి చూసి వెళ్తుంటారు. ఆ రెస్టారెంట్‌లో ఎవరెవరి సమాధులున్నాయో కూడా కృష్ణన్ కుట్టి నాయర్‌కు తెలీదు. అందులో 16వ శతాబ్దానికి చెందిన సుఫీ మహర్షి సమాధి కూడా ఉందని అక్కడి ప్రజల నమ్మకం. ప్రతిరోజూ ఉదయం నాయర్ నిద్రలేవగానే ఆ సమాధులను తుడిచి వాటిపై కప్పిన బట్టను మార్చి డెకరేట్ చేస్తాడు. కస్టమర్లు పెరగడంతో రూములు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నా సరే, ఏనాడూ వాటిని తొలగించాలని అనుకోలేదు నాయర్. ఆ రెస్టారెంట్ ఎప్పుడూ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది.
 

మరిన్ని వార్తలు