ఈ శాండ్‌విచ్‌ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!

29 Oct, 2023 09:29 IST|Sakshi

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాండ్‌విచ్‌. న్యూయార్క్‌లోని సెరండిపిటీ–3 అనే రెస్టారెంట్‌ ఈ శాండ్‌విచ్‌ను ‘నేషనల్‌ గ్రిల్డ్‌ చీజ్‌ డే’ సందర్భంగా ఏప్రిల్‌ 12 నుంచి తన మెనూలో చేర్చి, కస్టమర్లకు వడ్డిస్తోంది. ఈ గ్రిల్డ్‌ చీజ్‌ శాండ్‌విచ్‌ ఖరీదు 214 డాలర్లు (రూ.18,229). న్యూయార్క్‌ రెస్టారెంట్లలో పూర్తి స్థాయి భోజనం ఖరీదే 30 డాలర్లకు (రూ.2,497) మించదు. అలాంటిది ఈ శాండ్‌విచ్‌ ధరకు అమెరికన్లే కళ్లు తేలేస్తున్నారు. అయినా, కొందరు సంపన్నులు ఈ శాండ్‌విచ్‌ను రుచి చూడటానికి సెరండిపిటీ–3 రెస్టారెంట్‌ వద్ద క్యూ కడుతుండటం విశేషం.

ఈ శాండ్‌విచ్‌ తయారీకి ఫ్రెంచ్‌ పల్మన్‌ షాంపేన్‌ బ్రెడ్, గడ్డిలో పెరిగే తెల్ల పుట్టగొడుగులు, అరుదైన కాషియోకవాలో పొడోలికా గ్రిల్డ్‌ చీజ్, తినడానికి ఉపయోగించే 23 క్యారెట్ల బంగారు రేకులు ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇందులో వినియోగించే కాషియోకవాలో పొడోలికా చీజ్‌ను పొడోలికా జాతి ఆవుల పాల నుంచి తయారు చేస్తారు. ఈ జాతి ఆవులు ప్రపంచంలో దాదాపు పాతికవేలు మాత్రమే ఉన్నాయి. ఇవి ఏడాదిలో కేవలం మే, జూన్‌ నెలల్లో మాత్రమే పాలు ఇస్తాయి. అందువల్ల వీటి పాలు, వీటి పాలతో తయారయ్యే చీజ్‌ వంటి ఉత్పత్తులు అత్యంత ఖరీదైనవి. 

(చదవండి: జపాన్‌లో కూడా కణకణలాడే నిప్పుల మీద నడిచే ఆచారం..!)

మరిన్ని వార్తలు