మాఘ మాసం ఆరోగ్య స్నానాలు

28 Jan, 2020 09:06 IST|Sakshi

అఘము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘం అంటే పాపాలను నశింప చేసేది అన్నది పండితోక్తి. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఈ మాసంలో సూర్యుని ఆరాధి స్తారు. తెల్లవారుజామునే స్నానం చేయటాన్ని ఒక నియమంగా పెట్టుకుంటారు. నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని భావిస్తారు. శరీరాన్ని చలికి అలవాటు చేయటం కోసమే ఈ నియమాన్ని పెట్టి ఉంటారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. అందుకే చలికి భయపడకుండా ఉదయాన్నే నదీ స్నానం చేయటం ఉత్తమం.

‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసం శ్రేష్ఠమైనదని శాస్త్రం చెబుతోంది. మృకండు ముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన
మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అందుకే ఈ మాసానికి అంత విశిష్టత ఉంది. ప్రతిరోజూ స్నానం, పూజ, మాఘ పురాణ పఠనం లేదా శ్రవణం చేయడం సకల పాపహరణం అని మాఘపురాణం చెబుతోంది.

మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి. ఆసమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సూర్యశక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుందని అంటారు.

మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా ఆరు సంవత్సరాలఅఘమర్షణ స్నానఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణవచనం.

సూర్యుడు ఉచ్ఛ స్థితిలో ఉండే మాసం
‘మాఘాది పంచకం’ అంటే మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం ఈ ఐదు మాసాలు శుభకార్యాలకు ప్రసిద్ధి. ఇల్లు కట్టుకోవటానికి మాఘమాసం అనుకూలం. ఆత్మ కారకుడు, ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యభగవానుడు ఉచ్చస్థితిలో ఉండే కాలం. మఖ నక్షత్రంలో, పూర్ణిమ తిథి నాడు చంద్రుడు ఉండే కాలం కనుక కూడా దీనికి మాఘ మాసం అనే పేరు వచ్చింది.

మాఘమాసం ఉత్తరాయణం ప్రారంభమై సూర్యుడు మకరరాశిలో సంచరించే కాలం. అటు చాంద్రమానంలోను, ఇటు సౌర మానంలోనూ సూర్యునికి ప్రాధాన్యత ఉన్న మాసంగా చెబుతారు. సూర్యుడి ఆరాధన వేద కాలం నుంచి ఉంది. ప్రపంచం యావత్తు ఆరాధించకపోయినా, ఆయన గమనాన్ని గమనిస్తూనే ఉంది.  భౌతికంగా ఈ భూమి మీద ప్రాణం నిలచి ఉండటానికి కారణం సూర్యుడు. అన్ని శక్తులూ ఆయన నుంచే లభ్యమవుతున్నాయనీ, సమస్త శక్తులకు సూర్యకిరణాలే కారణమని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. ప్రాతఃకాలంలో స్నానం చేస్తే సూర్యుడు సంతృప్తి చెందుతాడని అంటారు. అంటే ఆరోగ్యమనే కదా అర్థం. నిలవ ఉన్న చల్లని నీళ్లతోకంటె గోరు వెచ్చని నీళ్లతో తలారా ఈ నెలంతా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఇలా ఎందుకు అనుకోవచ్చు. ఎవరినైనా మనం గౌరవించటమంటే ఏంటి? వాళ్లు మన ఇంటికి వచ్చేసరికి శుభ్రంగా స్నానం చేసి ఆహ్వానించాలి కదా.

అందుకే సూర్యోదయానికి ముందే శుచిగా ఉండి, మనం సూర్యుడిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయనను ఎందుకు ఆరాధించాలి అనుకోవచ్చు. మనం సూర్యుడి నుంచే ఆరోగ్యాన్ని కోరుకోవాలి. పాండవులు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు పాండవులను వెంటనంటి వచ్చిన వారందరికీ అన్నం పెట్టడానికి సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చాడని ఒక కథ. ఇక కీచకుడు ద్రౌపది వెంటపడినప్పుడు ఆమె ఒక్క చేతితో అతడిని తోసేసరికి పక్కకు పడిపోతాడు. అంత శక్తి ఆవిడకు సూర్యారాధన వల్ల వచ్చిందని మరో కథ. సూర్యమంత్రాన్ని అగస్త్య మహాముని రాముడికి ప్రసాదించిన మరుసటి రోజున రావణ వధ జరిగిందని ఇంకో కథనం ఉంది. ఆయన వల్ల ఆరోగ్యం, ఆహారం, బలం, శక్తి సమకూరతాయని భావించడం వలనే  వేద కాలం నుంచి సూర్యారాధన జరుగుతోంది. ఆయన పుట్టిన రోజు ఈ మాఘమాసంలోనే వస్తుంది. ఆయనను ఆరాధించటానికి మొదటిమెట్టుగా, స్నానం చేసి, అరుణోపాసనం చేసి, సూర్యభగవానుడిని ఆహ్వానించటానికి సిద్ధంగా ఉండాలి.
– డా. ఎన్‌. అనంతలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త

మరిన్ని వార్తలు