మొక్కనైనా కాకపోతిని

12 Jan, 2018 00:17 IST|Sakshi

మొక్కల్తో పెనవేసుకున్న బంధం ఆమెను కదలనివ్వడం లేదు. కానీ భర్త రిటైర్‌ అయితే క్వార్టర్స్‌ని ఖాళీ చేసి వెళ్లిపోవాలి! తప్పదు. 

పుణెలోని ‘మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ క్యాంపస్‌. అందులో ఓ విశాలమైన ఇల్లు. ఇంటి వెనుక అంతకంటే విశాలమైన తోట. ఆ తోటలో వందల యేళ్ల నాటి మహావృక్షాలు. వాటిల్లో ఒక మర్రి చెట్టు కొమ్మలకు, ఊడలతో పాటుగా ఒక ఊయల కూడా వేలాడుతుంటుంది. రోజూ ఉదయాన్నే 97 ఏళ్ల పెద్దాయన ఆ ఊయలలో కూర్చుని పేపర్‌ చదువుకుంటారు. సూర్య కిరణాలు ఒంటిని తాకింది ఇక చాలనిపించే వరకు అక్కడే కూర్చుని, కూతురు పెంచిన తోటను మురిపెంగా చూసుకుంటారు. ఆ పక్కనే మరో మర్రి చెట్టు చుట్టూ నేలపై వంద అడుగుల మేర రాళ్లు పరిచి, తొమ్మిది సిమెంట్‌ స్టూళ్లు వేసి ఉంటాయి. సాయంత్రం ఇరుగుపొరుగు క్వార్టర్ల వాళ్లు వచ్చి అక్కడ కూర్చుంటారు. గార్డెన్‌లో పెరిగిన క్రోటన్స్, గులాబీలు, వంకాయలు, టమాటాలు, బ్రోకలీ, కాకరకాయ తీగలు, గుమ్మడి పాదు, పాలకూర మడి, క్యాలిఫ్లవర్‌ తోపాటు అప్పుడెప్పుడో కాసిన నాలుగు అడుగుల సొరకాయ కూడా చర్చకు వస్తూనే ఉంటుంది. ఆవు పేడ, టీ డికాక్షన్‌తో పెరిగిన ఆర్గానిక్‌ గార్డెన్‌ అది.  ఇవన్నీ.. 60 ఏళ్ల మంజు బెహెన్‌ చేతితో పెరిగిన తోట విశేషాలు. క్యాంపస్‌లో మంజు బెహెన్‌ భర్తకు కేటాయించిన క్వార్టర్‌ చుట్టూ ఉన్న 15 వందల చదరపు అడుగుల నేలలో ఒక్క అడుగును కూడా వృథాగా వదల్లేదామె. మర్రిచెట్ల నీడన మరే మొక్కా మొలవదు కదాని మర్రి చెట్లనూ వదల్లేదు.  చెట్ల నీడను సిట్టింగ్‌ ఏరియాగా మలిచింది.

మంజు బెహెన్‌ది ఎం.పి.లోని జబల్పూర్‌. తొమ్మిదేళ్ల వయసులో తల్లి ఆమెకు రోజూ రెండు పూటలా మొక్కలకు నీరు పోసే బాధ్యత అప్పగించింది. అలా మొదలైన అలవాటు ఆమెకు ఆరు పదులు నిండుతున్నా కొనసాగుతూనే ఉంది. ‘మొక్కకు నీరు పోయని రోజు ఒక్కటీ లేదు’ నా జీవితంలో అంటోందామె. అంత చక్కగా గార్డెన్‌ పెరిగితే పక్షులు ఊరుకుంటాయా? చిలుకలు ఆకుల్లో కలిసి తొంగి చూస్తుంటాయి. ఉడుతలు కిచకిచమంటూ కొమ్మల మధ్య విహరిస్తుంటాయి. ‘పిల్లి, ఉడుత కలిసి పెరిగేది నా తోటలోనే’ అంటుంది మంజు బెహెన్‌ గర్వంగా. ఆమె ఇరుగుపొరుగు వాళ్లు బయటి ఊళ్లకు వెళ్లేటప్పుడు వాళ్ల పెంపుడు కుక్కలు, పిల్లుల్ని ఈ తోటలోనే వదిలిపెడతారు. ‘మా నాన్నకు,  కూతురు, కోడలు, కొడుకు, మనుమలు, మనుమరాళ్లకు తోటలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టమైన ప్లేస్‌ ఉంది. ఇప్పుడు నా భర్త రిటైర్‌ అయితే క్వార్టర్‌ను ఖాళీ చేయాలి. ఈ తోటను వదిలి వెళ్లక తప్పదు’ అంటోంది మంజు బెహెన్‌. అదే ఇప్పుడామె బెంగ.          

మరిన్ని వార్తలు