బైక్ అంటేనే లైక్: ధోని

11 Apr, 2014 23:04 IST|Sakshi

బైక్ మీద రివ్వున దూసుకుపోవడం అంటే ఎవరికిష్టం ఉండదు... ధోని కూడా ఈ విషయంలో సగటు భారతీయుడే. బైక్‌లంటే చెవి కోసుకుంటాడు. ఏదైనా కొత్త తరహా బైక్ కనిపిస్తే వెంటనే దాన్ని నడపాలంటాడు. ఏదైనా మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా బైక్ వచ్చిందంటే... జట్టులో ఎవరికి వచ్చినా తాను తీసుకుని గ్రౌండ్‌లో రౌండ్ వేస్తాడు.
 
గత ఏడాది చాంపియన్స్ లీగ్ సమయంలో ధోని పెద్ద సాహసమే చేశాడు. రాజస్థాన్‌తో మ్యాచ్ ముగిశాక జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్లడానికి చెన్నై జట్టు మొత్తం విమానం ఎక్కేసింది. కానీ ధోని మాత్రం ఒక్కడే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బైక్ మీద ఢిల్లీ వెళ్లాడు. తనకు బాగా ఇష్టమైన హెల్‌కాట్ ఎక్స్ 132 (2200 సీసీ) మీద మూడు గంటలలోపే 266 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసి రాజధానికి చేరుకున్నాడు.

మహికి బైక్‌లంటే ఎంతఇష్టమో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇదే బైక్‌ను గత ఏడాది నోయిడాలో ఉన్న బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌పై కూడా నడిపాడు. ఇక ఈ బైక్‌ను కొనుగోలు చేసిన తొలి దక్షిణాసియా వ్యక్తి ధోనీయే కావడం విశేషం. ఈ హెల్‌కాట్ ఎక్స్ 132 బైక్‌ను ధోనీ రూ. 28 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇదే ధోనీ దగ్గరున్న అత్యంత ఖరీదైన బైక్.
 
ఒకప్పుడు రాజ్‌దూత్, యమహా లాంటి బైక్‌లంటే చాలా ఇష్టపడే మహి ఇప్పుడు మనసుకు నచ్చిన లేటెస్ట్ బైక్‌లు నడుపుతూ తన ముచ్చటను తీర్చుకుంటున్నాడు. అలాగని పాత బైక్‌లపై మోజు తీరిందనుకుంటే పొరపాటే.. ప్రతీ బైక్ అతని గ్యారేజీలో ఉండాల్సిందే. రాంచీలో లంకంత ఇల్లు కట్టుకున్న ధోని.. అక్కడే తాను ముచ్చటపడిన బైక్‌ల కోసం గ్యారేజీని కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పటి వరకు 20 బైక్‌లను కొనుగోలు చేసిన మహి వీటిలో ఎక్కువ బైక్‌లను రాంచీలోని గ్యారేజీకి తరలించాడట.
 
తాను తొలిసారిగా అమితంగా ఇష్టపడి నడిపిన బైక్ (రాజ్‌దూత్)ను  తీసేయకుండా ప్రస్తుతం తన గ్యారేజీలోనే ఉంచాడు. అప్పట్లో దానిని రూ.4500కు కొన్నాడట. రెండేళ్ల క్రితం అది చెడిపోతే దగ్గరుండి రిపేర్ చేయించుకున్నాడు.  బిజీ షెడ్యూల్ కారణంగా గ్యారేజీలో ఉన్న బైక్‌లను నడపడం  వీలుచిక్కడం లేదని తెగ ఫీలైపోతున్నాడట. క్రికెట్ నుంచి ఏ మాత్రం విరామం లభించినా బైక్ మీద రాంచీలో చక్కర్లు కొట్టడం ధోనీకి అత్యంత ఇష్టమైన వ్యాపకం.

మరిన్ని వార్తలు