బండి ఉంటే ‘పార్టీ’ టైమ్‌ జాబ్‌

31 Oct, 2023 07:57 IST|Sakshi

హైదరాబాద్: యూత్‌లో ఎన్నికల జోష్‌ వచ్చేసింది. బండి చేతిలో ఉంటే చాలు ‘జెండా’ ఎత్తుకుంటున్నారు. కండువాలు కప్పేసుకుంటున్నారు. జైకొట్టి హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో యువత ముందంజలో ఉంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల పక్షాన ప్రచారం చేసిపెట్టేందుకు యువకులకు భారీ డిమాండ్‌ వచ్చింది. సాధారణంగా ఎన్నికలు రాగానే ఆయా పార్టీలకు చెందిన నాయకులకు, కార్యకర్తలకు చేతినిండా పని ఉంటుంది. రాత్రింబవళ్లు వ్యూహ ప్రతి వ్యూహాల్లో, ప్రచార ఎత్తుగడల్లో తలమునకలై ఉంటారు.

మరోవైపు ప్రచారంలో తమ ఆధిక్యతను ప్రదర్శించేందుకు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. సంఖ్యాబలాన్ని చాటుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి సహకరించే యువతకు అనూహ్యమైన డిమాండ్‌ వచ్చేసింది. గల్లీలు, బస్తీల్లో ఉండే యువకులే కాకుండా డిగ్రీ, పీజీ స్థాయి విద్యార్థులను కూడా రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి తరలిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వీలైన సమయంలో అప్పటికప్పుడు పార్టీల కండువాలు ధరించి బైక్‌ ర్యాలీలతో హడలెత్తించేందుకు కుర్రకారు సైతం ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఈ ట్రెండ్‌ బలంగా కొనసాగుతోంది. మెజారిటీని ప్రదర్శించేందుకు దీన్ని ఒక అవకాశంగా భావిస్తున్నారు.

ఇదో ‘పార్టీ’టైమ్‌ జాబ్‌ ...
సాధారణంగా డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్న కుర్రాళ్లకు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇచ్చే ఆఫర్‌లు పార్ట్‌టైమ్‌ జాబ్‌గా మారాయి. ప్రతి రోజు ప్రచారానికి వచ్చే వారికి రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు చెల్లిస్తున్నారు. ఇక మధ్యాహ్నం బిర్యానీ, వీలైతే సాయంత్రం బీరు సంగతి సరేసరి. గల్లీబాయ్స్‌ మాత్రమే కాదు. ప్రైవేట్‌ హాస్టళ్లల్లో ఉండే బ్యాచిలర్స్‌, నిరుద్యోగయువతకు ఇదో ఉపాధిగా మారింది. ‘ఇప్పట్లో నోటిఫికేషన్‌లు వచ్చే అవకాశం లేదు. ఖాళీగా ఉంటే ఖర్చులు తప్పవు కదా. అందుకే ప్రచారానికి వెళ్తున్నాను’ అని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్‌ చెప్పాడు.

ఇంటి కిరాయి, రోజువారి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని, సదరు పార్టీవాళ్లు ఇచ్చే డబ్బులతో కొంత ఊరట లభిస్తుందని పేర్కొన్నాడు. సాధారణంగా ఎన్నికలు రాగానే కళాకారులకు, సోషల్‌మీడియా సైనికులకు డిమాండ్‌ ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో అడ్డాకూలీల సేవలను కూడా రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలో బైక్‌ ర్యాలీలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా యువకులకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. ‘రాత్రింబవళ్లు జెండాలు పట్టుకొని తిరగవలసిన అవసరం లేదు కదా.

ఉదయం, సాయంత్రం రెండు, మూడు గంటలు ర్యాలీలకు వెళితే చాలు. సరదాగా ఉంటుంది. పైగా ఖర్చులకు డబ్బులొచ్చేస్తాయి.’ అని సికింద్రాబాద్‌కు చెందిన యువకుడు అభిప్రాయపడ్డారు. మరోవైపు పార్టీల ప్రచారానికి తరలి వచ్చే యువకులతో పెట్రోల్‌ బంకులకు, హోటళ్లకు సైతం గిరాకీ పెరిగింది. అందరూ ఇప్పుడు రెండు చేతులా ఆర్జిస్తున్నారు.

బైక్‌ ట్యాక్సీ వాలాలకూ ఆఫర్‌...
ఓలా, ఉబెర్‌ వంటి సంస్థల్లో పని చేసే ట్యాక్సీ బైక్‌ డ్రైవర్లు, యాప్‌ ఆధారిత సేవలను అందజేసే డెలివరీబాయ్స్‌ కూడా శ్రీజస్ట్‌ ఫర్‌ ఛేంజ్‌శ్రీను కోరుకుంటున్నట్లు ఒక పార్టీకి చెందిన నాయకుడొకరు చెప్పారు. ఒకవైపు ఆయా సంస్థల్లో పని చేస్తూనే వీలైన వేళల్లో ర్యాలీలకు, ప్రదర్శనలకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. రొటీన్‌ విధులకు భిన్నంగా పార్టీ ప్రచారానికి వస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు