మొక్కజొన్న బాల్యం

8 Aug, 2019 09:10 IST|Sakshi

బొమ్మలిల్లు

ఆ ఇంటి పై కప్పు నుంచి వెలువడిన చిక్కటి పొగ ఆకాశంలో దట్టమైన మేఘాలను సృష్టిస్తోంది. అప్పటికే అలుముకున్న చిక్కటి మంచు దుప్పటిని చీల్చుకుంటూ ప్రయాణిస్తోంది పొగ. ఇంట్లో ఎంత భారీ వంటలు వండితే ఇంత చిక్కటి పొగ ఇంత సేపు వస్తుంది? ఎంతమందికి వండుతున్నారు? పెళ్లి వంటి వేడుక ఉందేమో, విందు కోసం పెద్ద ఎత్తున వంటలు చేస్తున్నారేమో అనిపిస్తుంది ఆ పొగను చూస్తుంటే. మణిపూర్‌లోని సాంగ్‌సాంగ్‌ గ్రామస్థులకు అది రోజూ అలవాటైన దృశ్యమే. ఆ ఇల్లు నెలీ చాచియాది.

బొమ్మల ‘కర్మాగారం’
ఆ పొగ వస్తున్న ఇల్లు నెలీ చాచియా బొమ్మలిల్లు. నిజమే. బొమ్మరిల్లు కాదు బొమ్మలిల్లే. ఆ ఇంట్లో నెలీ చాచియా బొమ్మలు తయారు చేస్తుంది. దాదాపుగా అన్నీ చేతిలో పూలబుట్ట పట్టుకున్న మోడరన్‌ యువతి బొమ్మలే. ఆ బొమ్మలకు ముడిసరుకు మొక్కజొన్న పంట వ్యర్థాలే. అది ఆమె బొమ్మల కార్ఖానా. నెలీ ఆడుతూపాడుతూ బొమ్మలు చేస్తుంది. ఆ బొమ్మలను పిల్లల కోసం అమ్ముతుంది. నెలకు కనీసంగా 45 వేలు సంపాదిస్తోంది. రోజంతా వర్క్‌ స్టేషన్‌లో గడిపితే పన్నెండు బొమ్మలు చేస్తుందామె. బొమ్మ డిజైన్‌ను బట్టి మార్కెట్‌లో రెండు నుంచి ఐదు వందల ధర పలుకుతుంది. ఉద్యోగాలు దొరకట్లేదని, ఉపాధికి మార్గాల్లేవని నిరాశ పడకూడదంటారు నెలీ. ‘ప్రకృతిలో ప్రతిదీ అవసరమైన వస్తువే, ప్రతి వస్తువూ అందమైనదే. మన దృష్టి కోణం సృజనాత్మకమైనదైతే ఆ వస్తువులో సౌందర్యాన్ని చూడగలుగుతాం. మనసు పెట్టి పని చేస్తే... ఆ పనే మనకు ఆలంబన’ అంటారామె.

డబ్బుంటే అబ్బేది కాదేమో
నెలీ చాచియా బొమ్మలు తయారు చేయడాన్ని వృత్తిగా మలుచుకోవడానికి బీజం పడిన చిన్నప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ‘‘నా చిన్నప్పుడు తోటి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లినప్పుడు అందరి దగ్గరా బొమ్మలుండేవి. అందరూ ఆటలకు తమ బొమ్మలు తెచ్చేవాళ్లు. ఆ బొమ్మలన్నీ ఒక చోట చేర్చి ఆడుకునే వాళ్లం. నాకు బొమ్మలు కొనడానికి అమ్మ దగ్గర డబ్బులుండేవి కాదు. అందరి దగ్గరా బొమ్మలున్నాయని, నాకూ కొనివ్వమని బాగా మారాం చేసి ఏడ్చాను. అప్పుడు మా అమ్మ... మొక్కజొన్న కండెలు, పొట్టు, ఆకులతో బొమ్మ చేసిచ్చింది. బొమ్మ ఎలా చేయాలో నేర్పించి, ఎన్ని రకాల బొమ్మలు కావాలో అన్నీ చేసుకోమన్నది. అప్పటి నుంచి రకరకాలుగా బొమ్మలు చేసుకుని ఆటలకు తీసుకెళ్లేదాన్ని. నా బొమ్మలకు క్రేజ్‌ కూడా పెరిగింది. పెద్దయిన తర్వాత నా చేతిలో ఉన్న కళనే ఉపాధిగా మార్చుకుంటే బాగుంటుందనిపించింది. అలా 2000వ సంవత్సరంలో బొమ్మల తయారీ యూనిట్‌ ప్రారంభించాను. తర్వాత కొన్నేళ్లకు పిల్లలకు, మహిళలకు బొమ్మల తయారీలో శిక్షణ ఇవ్వడం కూడా మొదలుపెట్టాను. ‘ఇలా అందరికీ నేర్పిస్తూ పోతే నీ పరిశ్రమ నడిచేదెలాగ’ అన్నారు స్నేహితులు. నేర్పించడంలో నా ఉద్దేశం... ప్రతి ఒక్కరిలో ‘మన ఎదుట ఉన్న ఎందుకూ పనికిరావనుకున్న వస్తువులతో అందమైన రూపాన్ని తయారు చేయవచ్చ’నే ఊహకు జీవం పోయడమన్నమాట. నా దగ్గర నేర్చుకున వాళ్లు... నేను నేర్పిన మెళకువలకు తమ క్రియేటివిటీని జోడించి, వాళ్లకు అందుబాటులో ఉన్న మెటీరియల్‌తో మరింత ఆకర్షణీయమైన బొమ్మలు చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న కళ బయటికొస్తుంది. నా బొమ్మలన్నీ పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించని ఎకో ఫ్రెండ్లీ బొమ్మలే. పర్యావరణానికి హాని కారకమైన వస్తువుల వినియోగంలో తొలి వరుసలో ఉన్నది  పిల్లల ఆట బొమ్మలే. వాటి స్థానాన్ని ఎకో ఫ్రెండ్లీ బొమ్మలతో భర్తీ చేయాలనేది నా కోరిక’’ అంటారు నెలీ చాచియా.
మణిపూర్‌ రాజధాని నగరంలో ఇంఫాల్‌లో ఒక స్టోర్‌ తెరిచారామె. తాను మాత్రం ఎక్కువ రోజులు సొంతూరు సాంగ్‌సాంగ్‌ లోని బొమ్మల పరిశ్రమలోనే పని చేస్తారు. బొమ్మల పరిశ్రమకే కాదు ఏ పరిశ్రమ అయినా

మణిపూర్‌ బొమ్మ
‘‘ఇండియన్‌ ఫ్లవర్స్, ఆర్నమెంటల్‌ ప్లాంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్, మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌లు  సంయుక్తంగా 2007లో న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్‌ ఫ్లోరా ఎక్స్‌´ ో నిర్వహించాయి. ఆ ఎక్స్‌పోలో పాల్గొనడం నాకు పెద్ద టర్నింగ్‌ పాయింట్‌. అప్పటినుంచి నెలీ చాచియా మణిపూర్‌ దాటి బయటి ప్రపంచానికి తెలిసింది. నా మొక్కజొన్న బొమ్మల స్టాల్‌ కోసం అనేక ఎగ్జిబిషన్‌ల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి. విదేశాల్లో కూడా మన మొక్కజొన్న బొమ్మలకు మంచి ఆదరణ లభిస్తోంది’’.– నెలీ చాచియా, ఎకో ఫ్రెండ్లీ బొమ్మల పరిశ్రమ నిర్వహకురాలు

మొక్కజొన్న మెరుపుతీగలు
మొక్కజొన్న కంకిని కప్పి ఉంచే ఆకులు, ఆకులకు గింజలకు మధ్య ఉండే పట్టులాంటి మృదువైన దారాలు, గింజలు ఒలిచిన కండెలు, గింజలను మర పట్టినప్పుడు వచ్చే పొట్టు ఆమె బొమ్మలకు ముడిసరుకులు. పొట్టును తడిపి బొమ్మ తల, దేహం ఆకారాల్లో మలిచి ఆరబెట్టాలి. మొక్కజొన్న ఆకులను బొమ్మలకు దుస్తుల్లా కట్టాలి. మృదువైన దారాలను తల మీద అమరిస్తే చక్కటి హెయిర్‌స్టయిల్‌తో మోడరన్‌ యువతి బొమ్మ రెడీ. నెలీ ఫ్లోరిస్ట్‌ కూడా కావడంతో ఆమె బొమ్మల్లో డ్రై ఫ్లవర్స్‌ పూలబుట్టలు కూడా ప్రధానంగా కనిపిస్తాయి.

సరే... యజమాని వర్క్‌స్టేషన్‌ను వదిలి షో రూమ్‌లో కూర్చోవడం మొదలు పెడితే ఇక అప్పట్నుంచి పరిశ్రమ తిరోగమనం మొదలైనట్లే అంటారామె. – మంజీర

మరిన్ని వార్తలు