మణిపూర్ విద్యార్థుల హత్య కేసులో నలుగురు అరెస్ట్.. | Sakshi
Sakshi News home page

మణిపూర్ విద్యార్థుల హత్య కేసులో నలుగురు అరెస్ట్..

Published Sun, Oct 1 2023 9:10 PM

CBI Arrests 6 For Killing Two Manipur Students - Sakshi

ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా తెలియజేశారు. 

మూడు నెలల క్రితం మణిపూర్ అల్లర్లలో జరిగిన దారుణ సంఘటన ఒకటి ఇటీవల వెలుగులోకి రావడంతో మరోసారి ఆ రాష్ట్రం భగ్గుమంది. కనిపించకుండా పోయిన ఇద్దరు మైనర్ విద్యార్థుల మృతదేహాల ఫోటోలు వైరల్ కావడంతో ఆగ్రహించిన విద్యార్థులు రోడ్లపైకి నిరసనలు తెలిపారు. వెంటనే ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం కేసును సీబీఐ చేతికి అప్పగించింది.

మణిపూర్ పోలీసులు ఆర్మీ సంయుక్తంగా కేసులో దర్యాప్తు చేయగా నిందితులు ఇంఫాల్‌కు 51 కి.మీ. దూరంలో అత్యధిక సంఖ్యలో కుకీలు నివాసముండే చురాచంద్‌పూర్‌లో ఉన్నట్లు కనుగొన్నారు. హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న నలుగురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు మహిళలను కూడా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్టైన వారిని పావోమిన్లామ్ హవోకిప్, మల్సాన్ హవోకిప్, లింగ్నేచొంగ బైటే, తిన్నీఖోల్‌లుగా గుర్తించారు. 

మే 3న అల్లర్లకు బీజం పడింది ఈ చురాచంద్‌పూర్‌లోనే. దీంతో భద్రతా దళాలు అప్పట్లోనే ఇక్కడి తిరుగుబాటు వర్గాలతో ఎటువంటి అల్లర్లకు పాల్పడమని హామీ కూడా ఇచ్చారు. ఈ ప్రాంతంలో నిందితులను పట్టుకున్న భద్రతా దళాలు అక్కడి నుండి వారిని ఇంఫాల్ ఎయిర్‌పోర్టుకు తరలిస్తున్నారని తెలుసుకుని భారీ సంఖ్యలో జనం ఎయిర్‌పోర్టును చుట్టుముట్టారు. అప్పటికే అక్కడ కేంద్ర భద్రతా బలగాలను మోహరించడంతో వారు లోపలికి ప్రవేశించలేకపోయారు.  ఉద్రిక్త పరిస్థితుల నడుమ వారిని ఇంఫాల్ ఎయిర్‌పోర్టు నుండి 5.45 కి ఆఖరి ఫ్లైట్‌లో అసోంలోని గువహతికి తరలించింది సీబీఐ.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ.. ఇద్దరు విద్యార్థులు హిజామ్ లువాంబి, హేమంజిత్ హత్య కేసులో ప్రధాన నిందితులను చురాచంద్‌పూర్‌లో అరెస్టు చేయడం జరిగింది. నేరం చేసిన వ్యక్తి అందరి కళ్లుగప్పి తప్పించుకోవచ్చేమో కానీ చట్టం చేతుల్లో నుంచి మాత్రం తప్పించుకోలేరు. వారు చేసిన తప్పుకు తగిన శిక్ష పడి తీరుతుందని రాశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. కొన్ని కుకీ తిరుగుబాటు గ్రూపులు మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన ఉగ్రవాదులతో చేతులు కలిపి మణిపూర్ అల్లర్లకు కారణమయ్యారని.. దాని ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రం ఉగ్రవాదులతో పోరాడుతోందని అన్నారు. హత్య కేసులో నిందితులు దొరికారు కానీ చనిపోయినవారి మృతదేహాల జాడ ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ హత్య 

Advertisement
Advertisement