మరో పెద్దింటి పెళ్లి

10 May, 2018 23:51 IST|Sakshi
లాలూ కొడుకు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌, కాబోయే కోడలు ఐశ్వర్యారాయ్‌

రేపే   

దాంపత్య జీవితానికి బందీ కాబోతున్న పెద్ద కొడుకు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ను ఆశీర్వదించేందుకు రాంచీ జైల్లో బందీగా ఉన్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బుధవారం పెరోల్‌పై విడుదల అయ్యారు. పెళ్లి జరిగే మే 12వ తేదీకి అటు ఇటు కలిపి ఐదురోజుల పాటు ఆయన స్వేచ్ఛా వాయువులు పీలుస్తారు. అయితే జైలు నుంచి లభించిన తాత్కాలిక విముక్తి కారణంగా అది ఆయనకు లభించిన స్వేచ్ఛ కాదు. ఎంతకీ పెళ్లి కాని కొడుకులపై చింతతో బెంగపెట్టుకున్న లాలూకి.. ఎట్టకేలకు పెద్ద కొడుకు ఒకింటివాడు కాబోతుండటంతో ఆ బెంగ నుంచి లభించిన స్వేచ్ఛ అది! పెళ్లి కూతురు పేరు ఐశ్వర్యారాయ్‌! తేజ్‌ప్రతాప్‌కీ, ఐశ్వర్యకు గత నెల 18న పట్నాలోని మౌర్య హోటల్‌లో ఎంగేజ్‌మెంట్‌ అయింది. 

ఎవరీ ఐశ్వర్య!
ఐశ్వర్య బిహార్‌ మాజీ ముఖ్యమంతి దరోగా ప్రసాద్‌ రాయ్‌ మనుమరాలు. 1970 ఫిబ్రవరి 16 నుంచి డిసెంబర్‌ 22 వరకు ఆయన బిహార్‌ సీఎంగా ఉన్నారు. ఐశ్వర్య తండ్రి చంద్రికా ప్రసాద్‌ రాయ్‌ బిహార్‌ మంత్రిగా పనిచేశారు. విశేషం ఏంటంటే.. ఇంతవరకు ఆయన తన కూతురి పెళ్లిని నిర్ధారించకపోవడం! ఐశ్వర్య ముద్దు పేరు ఝిప్సీ. వయసు 25. ముగ్గురు పిల్లల్లో ఆమే పెద్ద. చెల్లెలు ఆయుషి, తమ్ముడు అపూర్వ, అమ్మ, నాన్న.. ఇదీ ఆమె ఫ్యామిలీ. ఐశ్వర్య పట్నాలోని నోటర్‌ డేమ్‌ అకాడమీలో చదివారు. ఢిల్లీ యూనివర్శిటీ మిరిండా హౌస్‌ నుంచి చరిత్రలో పట్టభద్రులయ్యారు. అమిటీ విశ్వవిద్యాలయంలో ఎం.బి.ఎ. చేశారు.  లాలూ ఇంట్లో 2014 తర్వాత ఇంకో పెళ్లి జరగలేదు. ఆ ఏడాది ఆఖరి కూతురు రాజ్యలక్ష్మి పెళ్లి జరిగింది. అప్పట్నుంచి ఇద్దరు కొడుకులు తేజ్‌ప్రతాప్, తేజస్విల పెళ్లి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా తగిన వధువు దొరకకో, ఈ అన్నదమ్ములు తగిన వరులు కాదనో.. పెళ్లి ఘడియలు రాలేదు. తేజస్వికి పెళ్లి సంబంధాలు పుష్కలంగా వస్తున్నప్పటికీ, అన్నయ్య పెళ్లయ్యాకే చేసుకుంటానని భీష్మించుకుని కూర్చోవడంతో అతడి పెళ్లి కూడా అలస్యం అవుతూ వచ్చింది. లాలూ దంపతులకు 9 మంది సంతానం.

అందరికన్నా పెద్దవాడు ఇప్పుడు పెళ్లవుతున్న పిల్లవాడు. రెండో సంతానం తేజస్వి. మూడు మిసా భారతి. నాలుగు రోహిణి. ఐదు చందన. ఆరు రాగిణి. ఏడు హేమ. ఎనిమిది అనుష్క. తొమ్మిది రాజ్యలక్ష్మి. మొత్తం ఏడుగురు కూతుళ్లకూ పెళ్లిళ్లయిపోయాయి. ఇక మిగిలింది ఈ ఇద్దరు అబ్బాయిలు. వీళ్ల కోసం గతంలో లాలూ భార్య రబ్రీదేవి స్వయంవరం కూడా జరిపించారు. అయితే వచ్చే కోడళ్లకు ఆమె కొన్ని ‘సంప్రదాయ నిబంధనలు’ విధించడంతో ఎవరూ ముందుకు రాలేదు. పెద్దల్ని గౌరవించడం; అణకువగా, ఒద్దికగా ఉండటం; సినిమాలు, షాపింగులకు దూరంగా ఉండటం.. ఇంకా ఇలాంటివేవో ఆ నిబంధనల్లో ఉన్నాయి! ఇప్పుడీ కొత్త కోడలు అత్తకు నచ్చిన ఉత్తమురాలు అనే అనుకోవాలి. ఎందుకంటే.. రబ్రీ ఎస్‌ అన్నాకే.. ఎంగేజ్‌మెంట్‌ అయింది. అయితే పెళ్లికి మాత్రం ఐశ్వర్య తండ్రి మనస్ఫూర్తిగా ‘ఎస్‌’ అన్నట్లు ఇప్పటికైతే ఒక్క వార్తా రాలేదు!

మరిన్ని వార్తలు