తలవంచి ధరను జయించిన తల్లి ఆమె!

10 Sep, 2016 23:55 IST|Sakshi
తలవంచి ధరను జయించిన తల్లి ఆమె!

మార్చి 1, 1980న వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ మూడవ స్నాతకోత్సవానికి నోబెల్ ప్రపంచ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసాను ఆహ్వానించారు.  అయితే ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని విద్యార్థులలో ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించి నిరసనలు చేపట్టింది. అంతటి మహోన్నత వ్యక్తి వరంగల్‌లాంటి పట్టణానికి రావడమే మహాభాగ్యమని, ఆమెను అడ్డుకొని అవమానించవద్దని యూనివర్శిటీ జిల్లా, పోలీసు అధికారులు, ప్రముఖులు వారికి నచ్చజెప్పేందుకు అనేక దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో యూనివర్శిటీలో ఆమె కారు ప్రయాణించే రోడ్డుకు కొంత దూరంలో ఒక గీత గీసి అది దాటకుండా నిరసన వ్యక్తం చేసుకొమ్మని పోలీసులు విద్యార్థుల నాదేశించారు.

వారి నిరసన ప్రజల దృష్టిని పెద్దగా ఆకర్షించకున్నా యూనివర్శిటీ కేంపస్‌లో మాత్రం ఉద్రిక్తత నెలకొంది. అప్పుడు ఎం.ఎ. ఎకనమిక్స్ రెండో సంవత్సరంలో ఉన్న నాలాంటి అభిమానులకు ఒక వైపు ఆనందం, మరోవైపు మదర్ భంగపడ్తారేమోనన్న భయం! మార్చి1 న రాష్ట్ర గవర్నర్ పి.సి.అబ్రాహాముతో సహా మదర్ వచ్చారు. యాభైమందికి పైగా విద్యార్థులు ‘మదర్ థెరిస్సా గో బ్యాక్’ లాంటివి రాసిన ప్లకార్డులు, రకరకాల నినాదాలతో వారికి నిర్దేశిత స్థలంలో నిలబడ్డారు. అంతలోనే ఆమె కారు వారున్న స్థలాన్ని సమీపించింది. ఆమె వారిని చూడదులే అనుకున్న పోలీసుల అంచనాలు తారుమారయ్యాయి.

మదర్ వారిని చూడనే చూశారు. అంతే! మరుక్షణం డ్రైవర్‌తో కారు ఆపించారు. ఏం జరుగుతున్నదో అర్థం చేసుకునేలోగానే మదర్ మెరుపు వేగంతో కారు దిగడం, విద్యార్థుల ముందుకు వెళ్లిపోయి రెండు చేతులూ జోడించి నిలబడటం జరిగిపోయాయి. పోలీసులు ఆమెకు భద్రతా వలయంగా ఏర్పడబోగా ఆమె వారిని సున్నితంగా వారించి దూరంగా నిలబెట్టారు. ఇది నిరసనకారులు కూడా ఊహించని పరిణామం. అక్కడున్న వీఐపీలందరి మొహాల్లో ఆందోళన... మదర్‌పై దాడి జరుగుతుందేమోనన్న భయం, కాని ఆమెలోని నిశ్చలత్వాన్ని అడుక్డుకునే సాహసం చేయలేదెవరూ.

ఐదడుగుల పొడవు కూడా లేని మదర్‌లోని ప్రశాంతత, నిర్మలత్వం, నిర్భయత్వం, విధేయత, సాత్వికత  ఆందోళనకారులనే కాదు, అక్కడున్న వారెవరికీ మాట పెగలకుండా చేశాయి. ‘నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి’ అంటూ చేతులు జోడించి అంటున్న ఆమె మాటల్లోని యధార్థత అంతా తలదించుకునేలా చేసింది. నినాదాలు ఆగిపోయాయి, ప్లకార్డులు నేలకూలాయి. నిశ్శబ్దం అలుముకుంది. ‘ఇది మీ ఉత్సవం. నేను మీ అతిథిని. మీరు లేకుండా అదెలా జరుగుతుంది? మనమంతా కలిసి వెళ్దాం పదండి’ అంటూ విద్యార్థుల్లో ఇద్దరిని తన రెండుచేతులతో పట్టుకొని పోలీసులు దారి చూపగా వారితోబాటు ఉత్సవ ప్రాంగణానికి గబగబా నడవడం ఆరంభించారు మదర్. అంతే! నిరసనకారులతో సహా అంతా మదర్‌ను వెంబడించారు.

అధికారులు అన్ని రోజులుగా సాధించలేకపోయిన శాంతిని మదర్ ఒక్క నిమిషంలో తన సాత్వికత్వంతో సాధించారు. ఎంతో గందరగోళం మధ్య జరుగుతుందనుకున్న స్నాతకోత్సవం ఆనాడు ఎంతో ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగింది. కేవలం పదినిమాషాలే సాగిన తన ప్రసంగంలో మదర్ దేవుని ప్రేమను అత్యద్భుతంగా ప్రకటించారు. చేతలతో దేవుని ప్రేమను అంత అద్భుతంగా చాటే వ్యక్తికి ప్రవచనాలు, ప్రసంగాల అవసరం ఏముంటుంది? సాత్వికులు ధన్యులు. వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్న యేసుక్రీస్తు ప్రవచనంలోని శక్తి, వాస్తవికత ఆరోజు నాలాంటి వారెందరికో అర్థమైంది. ఆమెకు మొన్ననే సెంయిట్ హుడ్ ఇచ్చారు. సెయింట్ అంటే అక్కడెక్కడో, మరోలోకంలో ఉండి పూజలందుకుంటున్న భావన. కాని మదర్ అంటే మన పక్కనే ఉండి ప్రేమతో కన్నీళ్లు తుడుస్తున్న ఆదరణ!! అందుకే ఇప్పుడూ ఎప్పుడూ ఆమె అమ్మే!!  - రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్

మరిన్ని వార్తలు