న్యూరో సర్జరీ కౌన్సెలింగ్

1 Jul, 2015 23:03 IST|Sakshi

ట్యూమర్ మళ్లీ వస్తుందా?
నా భర్తకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో కుటుంబసభ్యులమందరం చాలా ఆందోళన చెందుతున్నాం. ఈ ట్యూమర్‌ను సురక్షితంగా తొలగించడం సాధ్యమేనా? తీసేశాక మళ్లీ భవిష్యత్తులో ట్యూమర్ తిరిగివచ్చే అవకాశాలు ఉన్నాయా?
 - వి. పద్మావతి, స్టేషన్ ఘన్‌పూర్

 ట్యూమర్ల (కణుతుల)లో చాలా రకాలు ఉన్నాయి. వీటిని ప్రధానంగా రెండు విధాలుగా వర్గీకరిస్తారు. అవి... హానికరం కాని ట్యూమర్లు (బినైన్), హాని చేసే ట్యూమర్లు (మాలిగ్నెంట్). రెండో రకం ట్యూమర్లే సాధారణంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి. సర్జరీ ద్వారా మెదడులోని కణుతులను తొలగించడం కత్తిమీద సాములాంటిదే. ఎందుకంటే శరీరంలోకెల్లా మెదడు అత్యంత సునిశితమైన, సంక్లిష్టమైన కణజాలంతో నిర్మితమైనది. అందువల్ల అక్కడి కణితిని సర్జరీ ద్వారా తొలగించడం కేవలం నైపుణ్యం కలిగిన న్యూరోసర్జన్లకు మాత్రమే సాధ్యం. కణితి చుట్టూ ఉండే అత్యంత సున్నితమైన కణజాలం, నాడులు దెబ్బతినకుండా ఎంతో నేర్పుతో, నైపుణ్యంతో  కూడిన న్యూరో నేవిగేషన్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. దీని సహాయంతో సీటీ, ఎమ్మారై సహాయంతో తీసిన మెదడు కణితికి సంబంధించిన 3డీ చిత్రాలను కంప్యూటర్ తెరపై చూస్తూ సర్జన్లు ఇప్పుడు అత్యంత సురక్షితంగా కణితిని తొలగించగలుగుతున్నారు. అందువల్ల ముందుగా మీ భర్త మెదడులో ఏర్పడ్డ ట్యూమర్ ఏ రకానికి చెందిందో పరీక్షల ద్వారా నిర్ధారణ చేయాలి. మెదడులో ఏర్పడ్డ ట్యూమర్ బినైన్ రకం అయివుంటే, ఒకసారి సమూలంగా తొలగించిన తర్వాత అది మళ్లీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాగే మాలిగ్నెంట్ ట్యూమర్లను సైతం శస్త్రచికిత్స, రేడియేషన్, కీమోథెరపీ వంటి ప్రక్రియల ద్వారా చాలావరకు అదుపు చేయవచ్చు. దీనివల్ల మాలిగ్నెంట్ ట్యూమర్ కలిగించే దుష్ర్పభావాలకు లోనుకాకుండా దీర్ఘకాలంపాటు జీవితాన్ని కొనసాగించే అవకాశాలున్నాయి.
 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తలకు గాయమై రక్తస్రావం అవుతుంటే, ఆంబులెన్స్ వచ్చి, ఆసుపత్రికి తరలించేలోగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

 - బి. ప్రసాదరావు, సాలూరు
 ముందుగా బాధితుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకునేలా చూడాలి. తల లేదా శరీరంలోని గాయాల వల్ల రక్తస్రావం అవుతున్న ప్రదేశాలను గుర్తించి, వాటిపై శుభ్రమైన బట్టతో నొక్కిపెట్టడం ద్వారా రక్తస్రావాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించాలి. తర్వాత బాధితుడిని సమతలమైన ప్రదేశంలో ఒకవైపునకు ఒత్తిగిలి ఉండేలా పడుకోబెట్టాలి. బోర్లా లేదా వెల్లకిలా పడుకోబెట్టకూడదు. సాధ్యమైనంత త్వరగా అంబులెన్స్ ద్వారా సమీపంలో అన్ని సౌకర్యాలు ఉన్న హాస్పిటల్‌కు తరలించాలి. అంతవరకు అతడి పట్ల పైన తెలిపిన ముందుజాగ్రతలు తీసుకోవాలి.
 

మరిన్ని వార్తలు