సినిమా చూపిస్త మావా..

2 Jul, 2015 10:56 IST|Sakshi
సినిమా చూపిస్త మావా..

పేరు సింహా. ‘రేసుగుర్రం’లో ‘సినిమా చూపిస్త మావా’... తెలుసంటే, ఆయన గొంతు మీకు సుపరిచితమే. ‘నేను పెళ్లికి రెడీ’లో ‘నీవు నేను ఒకటేలే..’ అనే మెలోడీ ద్వారా పరిచయమైన సింహా, 12 ఏళ్లలో 200 పాటల వరకూ పాడారు. వాటిలో ‘పిల్లా నీ కళ్లకున్న కాటుకేమో సూపరే’ (లయన్),  ‘అరే జంక్షన్లో.. జంక్షన్లో..’ (ఆగడు) లాంటి హిట్స్ అనేకం. తాజాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డందుకున్న ఈ ఉత్తమ గాయకుడితో చిట్‌చాట్...
 
మొత్తం మీ లైఫ్ ఒక పాటలా సాగిపోతున్నట్టుంది...
(నవ్వుతూ) గత ఏడాది ఇరవైనాలుగు సినిమాలకు పాడాను. వాటిలో పద్ధెనిమిది సినిమాలు బ్లాక్‌బస్టర్స్. నేను పాడేవన్నీ మాస్ సాంగ్సే. ‘గుమ్మా గుమ్మా పండిస్తావా..’ (అందరూ దొంగలే... దొరికితే) పాట బాగా హిట్ కావడంతో అలాంటివి వస్తున్నాయి. తెర వెనక హుషారుగా పాడతాను. అదే వేదిక మీద పాడుతున్నప్పుడు చిన్న చిన్న స్టెప్పులు కూడా వేస్తాను. సింహా ఉంటే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుందని అందరూ అంటుంటారు.

ఇంతకూ మీకు మొదటి అవకాశం ఎలా వచ్చింది?
 ఏదో  ప్రోగ్రామ్‌లో నేను పాడిన పాట విని, సంగీతదర్శకుడు చక్రి అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచీ ఆయన చివరి శ్వాస వరకూ ఏ సినిమా చేసినా దాదాపు నాకో పాట ఇచ్చేవారు. చక్రిని మర్చిపోవడం అంత సులువు కాదు. ఆయన నాకెంతో ఆత్మీయుడు.
     
ఆత్మీయులు పోయినప్పుడు బాధగా ఉంటుంది. బాధ కలగడంతో పాటు వృత్తిపరంగా అవకాశాలు తగ్గుతాయని అనిపించిందా?
 లేదు. ఎందుకంటే చక్రి దగ్గర పాడటం మొదలుపెట్టాక గుర్తింపు వచ్చింది. దాంతో మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, తమన్ ప్రోత్సహించడం మొదలుపెట్టారు. తమన్ ఏ సినిమా చేసినా నాతో పాడించాలనుకుంటారు. ఇప్పుడు దేవిశ్రీ, దర్శకుడు సురేందర్ రెడ్డి బాగా ఆదరిస్తున్నారు. అవకాశాల పరంగా కొదవ లేదు కానీ, చక్రి లాంటి మంచి వ్యక్తిని పోగొట్టుకోవడం బాధ అనిపించింది. ఆయన ఎంతోమంది సింగర్స్‌కి లైఫ్ ఇచ్చారు.

దాదాపు రెండొందలు పాటలు పాడిన మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదనిపిస్తోంది?
 నేను ఎవరికీ పెద్దగా టచ్‌లో ఉండను. సి.ఏ. చదివా. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ, మరోవైపు పాడుతుంటాను.
     
గాయకునిగా ఇంత బిజీ అయ్యాక కూడా ఉద్యోగం చేస్తున్నారంటే... సెక్యూర్టీ కోసమా?

 ప్రసిద్ధ నోవార్టిస్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా చేస్తున్నా. సౌకర్యవంతమైన జీవితం. పైగా, నాకు లైఫ్‌లో రిస్కులు తీసుకోవడం ఇష్టం ఉండదు. అందుకని ఉద్యోగం వదులుకోలేదు. పైగా సాఫ్ట్‌వేర్ సైడ్ కాబట్టి శని, ఆదివారాలు సెలవు. దాంతో ఆ రెండు రోజులూ పాటల రికార్డింగ్‌కి కేటాయిస్తాను. ఈ విషయంలో సంగీతదర్శకుల సహకారం మరవలేనిది. ఎప్పుడైనా విడి రోజుల్లో పాడాలంటే మా ఆఫీసు నుంచి సులువుగానే అనుమతి లభిస్తుంది. అందుకని రెండు పడవల మీదా వెళుతున్నా.
     
తెలుగులో హిందీ సింగర్స్ కూడా ఎక్కువయ్యారు?
అవును. వాళ్ల ఉచ్చారణే బ్యూటీ అని అంటున్నారు. అఫ్‌కోర్స్ శ్రోతలు కూడా ఇష్డపడుతున్నారు కాబట్టి వాళ్లతో పాడిస్తున్నారు. అదేం తప్పు కాదు. అందుకే నేను కూడా స్టయిల్ మార్చి, ట్రెండ్‌ని అనుసరిస్తూ పాడుతున్నాను.
     
సంగీతంలో శిక్షణ ఏమైనా తీసుకున్నారా?
లేదు. మా నాన్న గారు మిలట్రీలో చేశారు. లయన్ అంటే ఇష్టం కాబట్టి, నాకీ పేరు పెట్టారు. మాది సంప్రదాయ కుటుంబం. అందరూ బాగా చదువుకున్నవాళ్ళే. మా అన్నయ్య ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్. నేనూ బాగా చదువుకుంటూనే, పాటల వైపు వచ్చా. చిన్నప్పటి నుంచి నాకు కిశోర్‌కుమార్, మహమ్మద్ రఫీ పాటలంటే ఇష్టం. వారి పాటలు పాడుకునేవాణ్ణి.
     
హిందీ సాంగ్‌‌స ఇష్టంగా పాడుకున్న మీకు అక్కడ పాడాలని లేదా?
నా లక్ష్యమదే. అక్కడా మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్నా. పెద్ద హీరోతో ప్రముఖ దర్శకుడు తీస్తున్న ఫిల్మ్‌లో ఛాన్సొచ్చింది.
     
ఫలానా సంగీత దర్శకులకు పాడలేదనే కొరత ఉందా?

 కీరవాణిగారి ట్యూన్‌కి ఇప్పటి వరకూ పాడలేదు. అదే పెద్ద లోటు. ఇళయరాజా, రహమాన్‌ల స్వరాలకు పాడాలని ఆశ.
     
మర్చిపోలేని సంఘటనలేమైనా?

‘సినిమా చూపిస్త మావా..’ పాటను టీవీలో చూస్తూ, ఓ 80 ఏళ్ల వృద్ధురాలు డ్యాన్స్ చేయడం యూ ట్యూబ్‌లో చూసి, ఆనందపడిపోయా. ఈ పాట పెడితేనే అన్నం తింటామని మారాం చేస్తున్న పిల్లలున్నారని తెలిసి, చిన్నపిల్లాడిలా సంబరపడ్డా. ఆ పాటకే మొన్న ఫిల్మ్‌ఫేర్ అందుకున్నా.     - డి.జి. భవాని
 

మరిన్ని వార్తలు