మరో నూతనం!

31 Dec, 2018 01:37 IST|Sakshi

నిరంతరమూ కదిలిపోతున్న కాలంలో కదలకుండా ఉన్నదానిని చూడగలగడమే జ్ఞానం.

కాలం చెప్పినన్ని కథలు మనకు మరెవ్వరూ చెప్పలేరు. ఇన్ని కథలు చెప్పి కూడా, అది కేవలం సాక్షిగా ఉండిపోతుంది. కాలం అందరిపట్లా సమాన వేగంతో కదిలిపోతూ ఉంటుందనేది సత్యం. అయినా, ఒక్కొక్కరి మానసిక స్థితిని బట్టి, కాలం కొందరికి వేగంగా కదిలినట్టుగా, మరికొందరికి దీర్ఘంగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. కాలమంటే రెండు సంఘటనల మధ్య దూరం. ఒకస్థాయిలో చూస్తే, ప్రతీక్షణమూ ప్రతీదీ మారిపోతూనే ఉంది. మరొక స్థాయినుండి చూసినపుడు నిజానికి ఏదీ మారటం లేదు. ఋజుమార్గంలో చూసేవారు ఈ రెండింటిలో ఏదో ఒకటే సరైనదని అంటారు. కాని ఈ రెండూ నిజాలే అనేది కాదనలేని సత్యం.
గత సంవత్సరంలో జరిగిన సంఘటనలను ఒకసారి పరిశీలించి చూసుకుని, వాటి నుండి నేర్చుకుని, భవిష్యత్తులోకి ఉత్సాహ భరితంగా సాగటానికి కొత్త సంవత్సర ఆరంభం మంచి సమయం.

కొత్తసంవత్సరం అనగానే లేటెస్ట్‌ ఫ్యాషన్‌లు, కొత్త పోకడలు ఏవో రాబోతున్నాయని వార్తలు షికారు చేస్తాయి. ఫ్యాషన్లు ప్రతీ ఏడూ పాతబడిపోతూ, మారుతూనే ఉంటాయి కాని, జ్ఞానం ఎప్పటికీ పాతబడనిది. నిజాయితీ, లోతైన అవగాహన, సున్నితత్వం వంటి గుణాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. నిరంతరమూ కదిలిపోతున్న కాలంలో కదలకుండా ఉన్నదానిని చూడగలగటమే జ్ఞానం. నిరంతం మారిపోతూ ఉన్న సంఘటనల వెనుక స్థిరంగా కదలకుండా ఉన్న దానిని చూడగలగటమే జ్ఞానం. మతిలేకుండా వచ్చిపడుతున్న జ్ఞాపకాలన్నిటినీ ఆవరించి ఉన్న ఆకాశాన్ని, ఏ మనసూ లేని ప్రదేశాన్ని చూడగలగటమే జ్ఞానం.

ఈ ఎరుక కలిగినపుడు నీ చుట్టూ జరుగుతూ నీవు చూస్తున్న వాటన్నిటికీ ఏదో ఒక ఆధారం ఉందని తెలుస్తుంది. అది లేనపుడు చుట్టూ జరిగే సంఘటనలు ఒకదానికొకటి సంబంధం లేకుండా జరుగుతున్నట్టు కనిపిస్తాయి. సంఘటనలనుండి కాలాన్ని విడదీయలేము కాని, మనసును ఆ రెండింటినుండి విడదీయవచ్చు. జీవితంలో జరిగే సంఘటనలు, పనులలో కలిసిపోవటంలో ఒక విధమైన ఆనందం ఉన్నది. అలాగే అంతరంగంలో, ఆత్మలో విశ్రాంతి పొందటంలో మరొక విధమైన ఆనందం ఉన్నది. ఈ రెండింటినీ గ్రోలనిదే జీవితం సంపూర్ణం కాదు. రెండింటినీ ఆనందించాలంటే మనం కేంద్రంలో స్థిరంగా ఉండగలగాలి. 

మరిన్ని వార్తలు