ఇంటికొచ్చిన ఆకాశం

27 Apr, 2019 00:04 IST|Sakshi

ప్రాణం పోయినంత పనౌతుంది.. దగ్గరి బంధువు పోతే!జ్ఞాపకాలు గుచ్చిగుచ్చి ఏడ్పిస్తాయి.. నిర్లక్ష్యాలు వెక్కిరిస్తాయి!అనుబంధాలు చక్కిలిగిలి పెడ్తాయ్‌!మనిషిపోతే.. ఇంకా ఎంతో ఉంటుంది..లేమి గుండె నింపుతుంది... తలపు తలుపు తెరుస్తుంది..ఆకాశం ఇంటికొస్తుంది!!

‘‘నిరంజన్‌... ఓ అన్న. జానకి.. అతని చెల్లెలు. కుటుంబం కోసం కష్టపడ్డం తప్ప ఇంకేం తెలియని.. పట్టని మనిషి అతను. అన్న అనుబంధం కోసం తపించే చెల్లెలు ఆమె. ఈ ఇద్దరి కథే... ‘‘హ్యాపీ జర్నీ’’.. మరాఠీ సినిమా.  అమేజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. రక్తసంబంధంగా మాత్రమే మిగిలిన ఆ బంధం.. ఆప్యాయతానురాగాల అనుబంధంగా ఎలా బలపడిందో చూపే  ప్రయాణం.

తొలి మజిలీ
గ్యారేజ్‌ నడుపుతున్న తండ్రి ఆర్థిక బాధ్యతను పంచుకోవడానికి టీనేజ్‌లోనే  గల్ఫ్‌కి వెళ్తాడు నిరంజన్‌. అప్పటికి జానకి వయసు రెండేళ్లు. అవసరమున్నప్పుడు అమ్మానాన్నలతో ఫోన్లో మాట్లాడ్డం తప్ప దాదాపుగా ఇండియాకు రాకుండానే పనిలో మునిగిపోతాడు. ఇంటికి డబ్బులు పంపించడమే అతని ధ్యేయం. అలాంటి నిరంజన్‌.. కుటుంబంలో జరిగిన ఓ విషాదం వల్ల ఇండియా వస్తాడు. అప్పటికి అతని చెల్లెలి వయసు పదిహేడేళ్లు.

మూడో రోజు..
నిరంజన్‌ గల్ఫ్‌ నుంచి వచ్చిన మూడోరోజున .. నాలుగువేల రూపాయల ఇంటర్నెట్‌ బిల్‌ వస్తుంది. ‘‘ఇంత బిల్‌ ఏంటీ’’ అంటూ పేరెంట్స్‌ని కేకలేస్తాడు. ‘‘నాకేం తెలీదు.. జానకే వాడేది’’ తల్లి చెప్తుంది అమాయకంగా. ఆ రాత్రి .. ఇంటి బయట.. వ్యాన్‌లో చెల్లెలు ఉన్నట్టు నిరంజన్‌కు కలొస్తుంది. దిగ్గున లేచి ఆరుబయటకు వస్తాడు. వ్యాన్‌లోకెళ్తాడు. వెనక సీట్లో ఓ అమ్మాయి అటు తిరిగి పడుకుని ఉంటుంది. షాక్‌ అవుతాడు. శంకిస్తూనే ఆ అమ్మాయి భుజం తడ్తాడు. ఆ పిల్ల ఇటు తిరుగుతుంది. అవాక్కవుతాడు. చెల్లెలు! ‘‘నువ్వు .. ఇక్కడ?’’ విస్మయంగా అతను. ‘‘అవున్నేనే’’ అంటూ లేచి కూర్చుంటుంది జానకి. 

లాంగ్‌డ్రైవ్‌కి తీసుకుపొమ్మని అడుగుతుంది. ‘‘లాంగ్‌ డ్రైవ్‌ లేదు ఏం లేదు. ముందు ఇక్కణ్ణుంచి వెళ్లిపో’’ అని కోప్పడ్తూ వ్యాన్‌ దిగి ముందున్న పచ్చికలో కూర్చుని కునికిపాట్లు పడ్తుంటాడు. హఠాత్తుగా మెలకువ వస్తుంది. వ్యాన్‌ విండో సీట్లోంచి తననే చూస్తూ జానకి కనిపిస్తుంది. పెంకిపిల్ల అని విసుక్కుంటూ ‘‘లాంగ్‌ డ్రైవ్‌కి తీసుకెళితే వెళ్లిపోతావా?’’ అని అడుగుతాడు. ‘‘నేననుకున్న పని పూర్తవగానే వెళ్లిపోతా.. నువ్వు ఉండమన్నా ఉండను’’ అంటుంది.  

తెల్లవారి...
ఇంటిముందున్న వ్యాన్‌ని చూపిస్తూ ‘‘అది బాగైపోతే డెలివరీ చేయొచ్చు కదా’’ అంటాడు తండ్రితో నిరంజన్‌. ‘‘ఇంకా కొంచెం పనుంది’’ చెప్తాడు తండ్రి. లోపల గదిలో..  బట్టలు మూటకడుతూ ‘‘జానకి బట్టలు.. అనాథాశ్రమంలో ఇచ్చొస్తావా?’’ బాధ నిండిన స్వరంతో అడుగుతుంది నిరంజన్‌ వాళ్లమ్మ. ‘‘అమ్మా.. ఆత్మలుంటాయా?’’ అడుగుతాడు. ‘‘కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్లు ఆత్మలుగా మారి కోరికలు తీర్చుకుని పోతారు. అవునూ .. ఎందుకడిగావ్‌ ఇది?’’ అంటుంది తల్లి. ‘‘తెలుసుకుందామని’’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోతాడు. ఈ లోపు బయటనుంచి ఒకటే హార్న్‌.. చెవులు చిల్లులు పడేలా.

  చిరాకు పడుతూనే ఇంట్లో ఎవరూ చూడకుండా టీ తీసుకెళ్లి వ్యాన్‌ విండోలోంచి చెల్లికి ఇస్తాడు. ‘‘కాఫీ లేదా? టీ తెచ్చావ్‌’’ అయిష్టంగా మొహం పెడుతూ చెల్లి. ‘‘ఇచ్చింది తాగు’’ అని వెళ్లబోతుంటే  ‘‘నిరంజన్‌... నోట్‌పాడ్‌ తెచ్చివ్వా?’’ అడుగుతుంది జానకి. ‘‘నోట్‌పాడా? నీకేమన్నా బుద్ధుందా? ఇంటర్నెట్‌ బిల్‌ నాలుగువేలొచ్చింది తెల్సా? అవునూ... ఆ పెన్‌డ్రైవ్‌లో ఆ పోర్న్‌ వీడియోలేంటీ? నీ వయసేంటి? నువ్‌ చేస్తున్న పనులేంటి?’’ అని బెదిరిస్తాడు. ‘‘అవి నా పర్సనల్‌ థింగ్స్‌. చెక్‌ చేయడం మ్యానర్సేనా?’’ జానకి ఎదురు మాట్లాడుతుంది. ఎప్పటిలాగే వినిపించుకోకుండా వెళ్లిపోతాడు అతను. ఇంట్లో  అల్మారా సర్దుతుంటే ఫోటోలతో ఉన్న జానకి బ్యాగ్‌ కనపడుతుంది.

జానకికి ఊహ తెలిసినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు దిగిన ఫోటోలు. అమ్మ, నాన్న, జానకి... తన ఫోటో ఉన్న ఫ్రేమ్‌ పట్టుకుని. కొన్ని ఫొటోల్లో జానకి.. తన ఫోటో ఫ్రేమ్‌ పట్టుకొని. అమ్మ, నాన్న, జానకి.. ముగ్గురే దిగిన ఫోటో ఒక్కటీ లేదు. తను లేకపోయినా తన ఫోటో పట్టుకుని కుటుంబ ఛాయాచిత్రాన్ని పూర్తి చేసింది చెల్లెలు. కళ్లు చెమ్మగిల్లుతాయి నిరంజన్‌కు. తను గల్ఫ్‌లో ఉన్నా చెల్లెలు తనను ఆ కుటుంబంతో కలిపే ఉంచింది. మనసు ఆర్ద్రమవుతుంది. వెంటనే నోట్‌ప్యాడ్‌ తీసుకొని చెల్లికి ఇచ్చొస్తాడు. ఆమె ఆనందానికి అవధులుండవ్‌.

లక్షన్నర బిల్లు..
రెండోరోజుకల్లా ఓ ఆరు జతల కొత్తబట్టలు ఇంటికి డెలివరీ అవుతాయి. లక్షన్నర రూపాయలు క్రెడిట్‌కార్డ్‌ నుంచి డెబిట్‌ అయినట్టూ మెస్సేజ్‌ వస్తుంది.  అనుమానం చెల్లి మీదకు మళ్లి ఆ కొత్తబట్టల బ్యాగ్స్‌తో విసావిసా చెల్లి దగ్గరకు వస్తాడు. నోట్‌ ప్యాడ్‌లో మ్యూజిక్‌ వింటున్న జానకి చెవుల్లోంచి ఇయర్‌ ఫోన్స్‌ లాగేసి.. ‘‘ఏంటీ పని?’’ అని గద్దిస్తాడు. ‘‘అరే వ్వా.. వచ్చేశాయా బట్టలు? ఏం నచ్చలేదా?’’ అంటుంది. కోపాన్ని దిగమింగుకుంటూ.. ‘‘నా జీవితంలో ఇంత ఖరీదైన బట్టలు నేనెప్పుడూ వేసుకోలేదు. నాకెవ్వరూ ఇప్పించలేదు’’ అరుస్తాడు. ‘‘అందుకే ఇప్పుడు వేసుకో నిరంజన్‌.. నేను ఇప్పించానుగా’’ అంటుంది. ‘‘మతి ఉండే మాట్లాడుతున్నావా? వీటికి లక్షన్నర తగలేస్తావా? డబ్బులనుకున్నావా? ఇంకేమన్నానా? ఎంత కష్టపడితే వస్తాయో తెలుసా?’’ అంటూ కన్నెర్ర చేస్తాడు.

‘‘తెలుసు. మా కోసం నీ ఇష్టాలను చంపుకొని ఎంత కష్టపడ్డావో తెలుసు. మమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నువ్వెన్ని కోల్పోయావో తెలుసు. నా ట్రీట్‌మెంట్‌ కోసం పైసాపైసా కూడబెట్టిందీ తెలుసు. కానీ ఏమైంది? నిరంజన్‌... ఇప్పటినుంచైనా నీ కోసం నువ్వు బతుకు. నచ్చినట్టు ఉండు. ముసలోడిలా ఉండకు. స్టయిల్‌ మార్చు’’ అంటూ ఇంకేదో చెప్పబోతుంటే.. ‘‘నోర్ముయ్‌’’ ఆవేశంగా అతను. అంతే! ఏడుపు లంకించుకుంటుంది ఆ పిల్ల. కంగారుపడి ‘ఏడ్వకు’ అంటూ చెల్లెలిని బతిమాలుతాడు. సారీ చెప్తాడు.  

మలి మజిలీ...
ఆ రోజు రాత్రి మళ్లీ లాంగ్‌డ్రైవ్‌కి వెళ్తారు అన్నాచెల్లెళ్లు. ఊరవతల ఓ సెలయేటి ఒడ్డున  వ్యాన్‌ ఆపి.. దిగుతాడు నిరంజన్‌. ఒడ్డున కూర్చుని బీర్‌ తాగుతుంటాడు. వ్యాన్‌ విండో దగ్గర జానకి. ‘‘ఖతర్‌కి  వెళ్లినప్పుడు నీ వయసెంత అన్నయ్యా?’’ అడుగుతుంది. ‘‘పదహారుంటాయేయో. వారానికి ఒక్కరోజు రెండు పూటలా భోజనం చేసే చాన్స్‌ దొరికేది. ఓ నాలుగేళ్లకు అక్కడి నుంచి దుబాయ్‌కొచ్చా.  ఉద్యోగం చేస్తూనే కంప్యూటర్స్‌ నేర్చుకున్నా. తర్వాత కొన్నాళ్లకు మంచి జాబ్‌ దొరికింది. అంటే రోజూ రెండుపూటలా భోజనం చేసే అవకాశం ఇచ్చిన కొలువన్నమాట’’ బీర్‌ తాగుతూ తన జీవితం గురించి చెప్తాడు చెల్లికి.

ఆమె కళ్లల్లో నీళ్లు. ‘‘నిన్ను ఎంత మిస్‌ అయ్యానో తెలుసా అన్నయ్యా? అందరిలాగే నాకూ నీతో షికారుకెళ్లాలని.. కలిసి ఆడాలని.. పాడాలని.. సినిమాలు చూడాలని.. నీ దగ్గర అలగాలని..’’ తీరని కోరికలన్నీ వివరిస్తుంది. నిరంజన్‌ కళ్లల్లోనూ నీటి చెమ్మ.  ‘‘నాకూ ఇవ్వవా బీర్‌...’’ అడుగుతుంది  కిటికీలోంచి చేయి చాస్తూ. ‘‘ఆ..’’ గదమాయిస్తాడు. ‘‘ప్లీజ్‌’’ రిక్వెస్ట్‌ చేస్తుంది. నవ్వుతూ బీర్‌  ఇస్తాడు. గటగటా తాగేసి బాటిల్‌ నీళ్లల్లో పడేస్తూ.. ‘‘గర్ల్‌ ఫ్రెండ్‌?’ అడుగుతుంది.

‘‘ఏంటీ, ఈ మెకానిక్‌కు.. అదీ గల్ఫ్‌లో గర్ల్‌ఫ్రెండా?’’ నవ్వేస్తాడు. చివుక్కుమంటుంది చెల్లి మనసు. ‘‘అవునూ.. స్కూల్‌ డేస్‌లో నీకో గర్ల్‌ ఫ్రెండ్‌ ఉండేదని విన్నానే?’’ అంటుంది.‘‘అలీస్‌. కాని నేను గల్ఫ్‌కెళ్లిపోయా కదా.. అక్కడితో ఎండ్‌ అయింది’’ అంటాడు విచారంగా. నిట్టూరుస్తుంది జానకి. అలా  ఆ రోజు నుంచి ఆ అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధం పెరుగుతూంటుంది. ప్రతిరోజూ ఇద్దరూ కలిసి లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లడం.. ఆ ప్రయాణంలో చిన్నప్పటి నుంచి మిస్‌ అయినవన్నీ గుర్తు చేసుకోవడం.. మాట్లాడుకోవడం వాళ్ల దినచర్య అవుతుంది.

ఆ అన్నకు బిడ్డగా..
చెల్లికి నచ్చినట్టుగా వ్యాన్‌ను క్యారవాన్‌లా మోడిఫై చేస్తాడు. స్టవ్‌ అమరుస్తాడు. కాఫీనుంచి డిన్నర్‌ దాకా కలిసే చేస్తుంటారు. చెల్లి మెచ్చేట్టుగా తన డ్రెస్సింగ్, హెయిర్‌ స్టయిల్‌ మార్చుకొని యంగ్‌లుక్‌కి వచ్చేస్తాడు. నిరంజన్‌ తల్లిదండ్రులకు ఆశ్చర్యంతోపాటు అనుమానమూ కలుగుతూంటుంది. ఎప్పుడు చూసినా అతను వ్యాన్‌లో ఉండడం.. వ్యాన్‌ గోడలకు లిప్‌స్టిక్, నెయిల్‌ పాలిష్‌ మరకలూ కనిపిస్తూండడంతో నిరంజన్‌ తల్లి ఆందోళన పడ్తూంటుంది. ‘‘పోనీలే.. ఇప్పటికైనా ఓ తోడు కావాలని వాడికి అర్థమైంది. అనవసరంగా టెన్షన్‌ పడకు’’ అంటూ ఆమెకు సర్దిచెప్తాడు తండ్రి.  ఆ టైమ్‌లోనే తన బాయ్‌ఫ్రెండ్‌ను అన్నకు చూపిస్తుంది జానకి.తామిద్దరూ మాట్లాడుకునే అవకాశం కల్పించమని కోరుతుంది అన్నను. కల్పిస్తాడు నిరంజన్‌.

అలా మొత్తానికి చిన్నప్పటి నుంచి తామిద్దరూ కోల్పోయిన అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని ఇద్దరూ ఆస్వాదించేలా చేస్తుంది జానకి. డబ్బు సంపాదించే యంత్రంలా కష్టపడ్డం మాత్రమే తెలిసిన అన్నను మనిషిగా మలచి అతనికి మనసుందన్న విషయాన్ని గుర్తుకు తెస్తుంది. ఆ క్రమంలోనే.. నిరంజన్‌ చిన్నప్పటి గర్ల్‌ఫ్రెండ్‌ అలీస్‌తో కలుపుతుంది అతణ్ణి. ఇరువైపుల పెద్దలూ ఆ పెళ్లికి అంగీకరిస్తారు. ఆ సంతోషంలో.. ఆ రాత్రి..  అన్నతో ... ‘‘నిరంజన్‌ నీకు కూతురు పుడితే... పిచ్చిపిచ్చి రిస్ట్రిక్షన్స్‌ పెట్టకు. సెల్‌ఫోన్స్‌.. మెయిల్స్‌ చెక్‌ చేయకు...’’ అని ఆమె చెప్తూంటే  అన్నిటికీ ‘‘సరే’’ అంటూంటాడు నిరంజన్‌. ‘‘ఆమె బాయ్‌ఫ్రెండ్‌ సిగరెట్‌ అడిగితే ‘నో స్మోకింగ్‌’ అంటూ లెక్చర్స్‌ ఇవ్వకు’’ అంటుంది.. ‘‘నో.. దీనికి ఒప్పుకోను’’ అంటాడు అతను. నవ్వుకుంటారు.

ఆమె నిద్రపోయాక వ్యాన్‌ దిగి వెళ్లిపోతాడు నిరంజన్‌.తెల్లవారుతుంది. ఎందుకో డౌట్‌ వచ్చి వ్యాన్‌ దగ్గరకు పరిగెత్తుకొస్తాడు నిరంజన్‌. చెల్లి కనిపించదు. అంతా వెదుకుతాడు.. డిక్కీతో సహా. ఎక్కడా  కనిపించదు. ఏడుస్తాడు.. పొగిలి పొగిలి. ‘‘నేను వచ్చిన పని అయిపోగానే వెళ్లిపోతా’’ అన్న చెల్లెలి మాటలు గుర్తొస్తాయి. ఆ వ్యాన్‌ను ఆప్యాయంగా తడిమి వెనుదిరుగుతాడు. నిరంజన్‌కు అలీస్‌తో పెళ్లవుతుంది. జానకి మళ్లీ పుడుతుంది.అసలు సంగతి ఏమిటంటే, నిరంజన్‌ చెల్లి జానకి బ్లడ్‌ క్యాన్సర్‌తో చనిపోతుంది. అందుకే ఇండియా వస్తాడు నిరంజన్‌. ఆ వ్యాన్‌లో ఉన్నది ఆమె ఆత్మ.

సరస్వతి రమ

మరిన్ని వార్తలు