నాకీ జన్మ బాగానే ఉంది

25 Jul, 2018 00:32 IST|Sakshi

చెట్టు నీడ

ఒకసారి దుస్తులు మాసిపోయాక ఇక ఎక్కడ కూర్చోడానికైనా మనిషి సిద్ధపడతాడు కాబట్టి, దుస్తులు మాసిపోకుండా ముందే జాగ్రత్తపడడం మంచిది.

అనగనగా ఓ రాజు. ఆ రాజు మంచివాడే కానీ, మాటలను అదుపు చేసుకోవడం చేతకానివాడు. అలా ఓ రోజున ఒక మునిని ఇష్టం వచ్చినట్లు మాట్లాటంతో ఆ ముని ఆగ్రహావేశాలకు గురయ్యాడు. రాజుని ఓ పందిలా అవుతావని శపించాడు. తాను పందిలా మారడమన్న ఊహనే రాజు భరించలేకపోయాడు. వెంటనే ముని కాళ్లమీద పడి, ‘‘మహాత్మా! దయచేసి నాకు శాపాంతం తెలియజెప్పండి’’ అని ప్రార్థించాడు. ‘‘నువ్వు పంది జన్మలో ఉండగానే ఎవరైనా సరే, నిన్ను కనిపెట్టి నిన్ను సంహరిస్తే, నీకు సద్గతి కలుగుతుంది’’ అని చెప్పాడు. వెంటనే రాజు, యువరాజుని పిలిచి ‘‘కుమారా, ఒక ముని నన్ను పంది జన్మ ఎత్తమంటూ ఘోరంగా శపించాడు. నేను ఇంతకాలమూ రాజుగా గడిపిన వాడిని. పందిలాగా బతకాల్సిన దుస్థితి రాకూడదు. కనుక నేను పందినైన తర్వాత నన్ను ఎలాగైనా సరే వెతికి అక్కడికక్కడే చంపివేస్తే నాకు వెంటనే విముక్తి కలుగుతుంది’’ అని చెప్పాడు.కొంతకాలం గడిచింది. యువరాజు బయలుదేరాడు. ఎక్కడెక్కడో వెతికాడు. చివరికి ఓ చోట తన తండ్రిని పంది రూపంలో కనిపెట్టగలిగాడు. ఓ మురికి కాలువలో ఆ పంది మరొక ఆడ పందితోనూ, ఓ నాలుగైదు పంది పిల్లలతోనూ ఉండగా చూశాడు.

యువరాజు పంది రూపంలో ఉన్న తండ్రిని నరకడానికి కత్తి తీశాడు.అప్పుడు ఆ పంది మాటలాడింది.‘కుమారా, తొందరపడకు. కాస్తంత ఆగు. ఇప్పుడు ఈ బతుకు బాగానే ఉంది. ఏ మాత్రం అసహ్యంగా లేదు. ఇదిగో నా పక్కనున్న ఈమె నీకు పిన్ని. మిగిలిన పంది పిల్లలు నీకు తమ్ముళ్లు’’ అంది.ఆ మాటలు విన్న యువరాజు మనసు వికలమై పోయింది.  దేన్నయితే ముందు అసహ్యించుకుంటామో తర్వాత దాన్నే ఇష్టపడతాం. దేన్నయితే కోరుకుంటామో అది దొరికిన తర్వాత వద్దనుకుంటాం. ఒకసారి కావాలనుకున్నది మరోసారి వద్దనుకోవడమే మనిషి స్వభావం. ఒకసారి దుస్తులు మాసిపోయాక ఇక ఎక్కడ కూర్చోడానికైనా మనిషి సిద్ధపడతాడు కాబట్టి, దుస్తులు మాసిపోకుండా ముందే జాగ్రత్తపడటం మంచిది.
– యామిజాల జగదీశ్‌ 
 

మరిన్ని వార్తలు