బంధించేదీ... విముక్తి కలిగించేదీ..!

8 Aug, 2018 00:50 IST|Sakshi

చెట్టు నీడ

ఒకసారి ఇద్దరు స్నేహితులు రోడ్డుమీద వెళుతున్నారు. దారిలో ఒకచోట భాగవత పురాణ కాలక్షేపం జరుగుతోంది. వాళ్లలో ఒకడు ‘‘ఒరేయ్‌! పురాణం విందాం రారా’’ అని లోపలకి వెళ్లి కూర్చున్నాడు. రెండవవాడు మాత్రం లోపలికి తొంగి చూసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. వాడు నేరుగా ఒక జూదగృహం వద్దకెళ్లాడు. కాని అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాడు. ఆ పరిసరాలు, వాళ్ల ప్రవర్తన అతనికి ఎబ్బెట్టుగా తోచాయి.‘ఛీ! ఎంత సిగ్గుచేటు, నా స్నేహితుడు పవిత్రమైన పురాణాన్ని వింటూ, సత్కాలక్షేపం చేస్తుంటే, నేనేమో ఇక్కడికొచ్చి చేరాను’ అని పశ్చాత్తాప పడ్డాడు. 

ఇక రెండవ వాడేమో, పురాణం వింటున్నాడు కానీ, కాసేపటికి మనసులో ఏదో పురుగు తొలిచింది. అతని దృష్టి కాస్తా పురాణం మీదినుంచి స్నేహితుడిమీద, అతను వెళ్లిన ప్రదేశం మీదా మళ్లింది. ‘నేనెంతో బుద్ధిహీనుణ్ణి. ఎప్పుడో జరిగిపోయిన పాత కథలను వింటూ ఇక్కడ కూర్చుండిపోయాను. వాడు ఏ వ్యభిచార గృహంలోనో, జూదగృహంలోనో హాయిగా కాలక్షేపం చేస్తున్నట్టున్నాడు’ అని వాపోయాడు. కాలం తీరి వాళ్లిద్దరూ మరణించారు.యమభటులు వచ్చి భాగవతం విన్నవాడి జీవాన్ని నరకానికి ఈడ్చుకుంటూ పోతే, జూదగృహానికి వెళ్లిన వాడి జీవాన్ని విష్ణుభటులు సగౌరవంగా స్వర్గానికి తీసుకెళ్లారు. భగవంతుడు మనిషిలో చూసేది అతనిలోని పవిత్రమైన భావాలను, నిర్మలమైన భక్తిని మాత్రమే. మనల్ని బంధించేదీ, విముక్తి కలిగించేదీ కూడా  మనస్సే. మనసును అదుపులో పెట్టుకోగలిగితే చాలు... అంతా సౌఖ్యమే, ఆనందమే.  

మరిన్ని వార్తలు