పాపకు ఒంటిపై పులిపిరుల వంటి కాయలు...?

1 Jan, 2014 23:39 IST|Sakshi
పాపకు ఒంటిపై పులిపిరుల వంటి కాయలు...?

మా అమ్మాయికి ఏడేళ్లు. ఆమెకు ముఖంతో పాటు ఒంటిపైన అక్కడక్కడా చిన్న చిన్న పులిపిరి కాయల్లాంటివి కనిపిస్తున్నాయి. మేం గమనించిన దాని ప్రకారం అవి  రోజురోజుకూ పెరుగుతున్నాయి. అవి జీవితాంతం వస్తూనే ఉంటాయని కొందరు ఫ్రెండ్స్ చెబుతున్నారు. దాంతో మాకు ఆందోళనగా ఉంది. మా పాప విషయంలో మాకు సరైన సలహా ఇవ్వండి.
 - ధరణి, నరసరావుపేట

 
 మీరు చెప్పిన కొద్దిపాటి వివరాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్ ములస్కమ్  కంటాజియోజమ్ కావచ్చని అనిపిస్తోంది. ఇది వైరస్ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి.  ముఖ్యంగా రెండు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో దీన్ని చాలా ఎక్కువగా చూస్తుంటాం.

వ్యాప్తి జరిగే తీరు : చర్మానికి చర్మం తగలడం వల్ల, తువ్వాళ్ల వంటి వాటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల నుంచి వాళ్లకే వ్యాపించడం కూడా ఉంటుంది. దీన్నే సెల్ఫ్  ఇనాక్యులేషన్ అంటారు. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ  లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే... బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు.
 
 చికిత్స :
ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు క్రయోథెరపీ, క్యూరటాజ్ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయవచ్చు. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్ మెడిసిన్స్‌తోనూ వీటికి చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు ఇమిక్యుమాడ్ అనే క్రీమ్‌ను లీజన్స్ ఉన్న ప్రాంతంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్ వాడటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి చికిత్సను కొనసాగించండి.
 
మా పాప వయస్సు ఆరేళ్లు. కొన్నాళ్ల క్రితం బాగా జలుబు చేస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం.  ముక్కు నుంచి చెవికి ఉండే ఎడినాయిడ్ గ్రంథి బ్లాక్ అయిందని ఆయన చెప్పారు. జలుబు తగ్గిపోయింది గానీ... ఇప్పుడు మరో పక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. మా పాపకు ఎందుకిలా జరుగుతోంది?
 - సురేఖ, కొత్తగూడెం

 
  మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్ విత్ యూస్టేషియన్ కెటార్’ అని చెప్పవచ్చు. చిన్న పిల్లల్లో ఈ కండిషన్‌ను తరచూ చూస్తుంటాం. ఎడినాయిడ్స్ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్ పైన ఉంటాయి. టాన్సిల్స్‌కు వచ్చినట్లే వీటికి కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. ఇలాంటప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనసైటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది (రెస్ట్‌లెస్ స్లీప్) వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు చాలా దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో మాత్రం చాలా అరుదుగా ఎడినాయిడ్స్‌ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రీషియన్ లేదా ఈఎన్‌టీ సర్జన్‌ను కలిసి తగు చికిత్స తీసుకోండి.
 
 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్,
 స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్

 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు