తొమ్మిదేళ్ల పాపకు పులిపిరులు ఎక్కువైతే?...

28 Jan, 2016 22:58 IST|Sakshi

ఆయుర్వేద కౌన్సెలింగ్
 
 నా వయసు 48 ఏళ్లు. ఏడాదిగా చిన్న విషయాలకే చిరాకు, కోపం వస్తోంది. మా స్నేహితురాళ్లు... ఇది మెనోపాజ్ వయసు గనక అలాగే ఉంటుంది, ఏం పరవాలేదంటున్నారు. నాలో ఆందోళన ఎక్కువవుతోంది. ఆయుర్వేదంలో పరిష్కారం సూచించ ప్రార్థన. - రత్నకుమారి, నిజామాబాద్
  స్త్రీలలో బహిష్టులు పూర్తిగా ఆగిపోవడానికి ముందుగా కొంతకాలంపాటు, బహిష్టులు ఆగిపోయిన అనంతరం కొంతకాలంపాటు శారీరకంగా, మానసికంగా చాలామార్పులు సంభవించడం వల్ల చాలా లక్షణాలతో బాధపడటం సహజం. ఈ సమస్యను ‘మెనోపాజ్’గా చెబుతారు. ఈ ప్రక్రియ 45-55 ఏళ్ల వయసులో సంభవిస్తుంది. ఇక్కడ వాతదోషం ప్రధానంగానూ, పిత్తదోషం అనుబంధంగానూ చోటుచేసుకొని, స్త్రీల హార్మోన్లలో విశిష్టమైన తేడాలు కనిపిస్తాయి. ఆ వయసుకు సంబంధించిన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఆయుర్వేదం ఈ కింది ప్రక్రియలను నిర్దేశించింది.

ఆహారం: ఉప్పు, పులుపు, మసాలాలు, కారాలను గణనీయంగా తగ్గిస్తూ, పోషకవిలువలను సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. పీచుపదార్థాలు అధికంగా ఉండే శాకాహారం, ఆకుకూరలు, తాజాఫలాలు, ఎండిన ఫలాలు ప్రతినిత్యం తినాలి.
 ఉదా: కొబ్బరినీళ్లు, చెరకురసం, వెజిటబుల్ జ్యూసులు, ఖర్జూరం, పాలు, పెరుగు వంటివి. మొత్తంమీద రోజూ 4-5 లీటర్ల వరకు ద్రవపదార్థాలు తాగాలి. నువ్వుల పప్పు ప్రతిరోజూ ఉదయం 2 చెంచాలు, సాయంత్రం రెండు చెంచాలను నమిలి తింటే క్యాల్షియమ్ అధికంగా లభిస్తుంది. మొలకెత్తే  దినుసులు కూడా మంచిదే.

విహారం: ప్రాతఃకాలంలో నిద్రలేవడం, రాత్రి 10గంటలకల్లా పడుకోవడం చాలా అవసరం. రోజూ ఉదయం లేలేత సూర్యకిరణాలలో ఓ అరగంటపాటు ఉండాలి. శ్రావ్యమైన సంగీతం వినడం చాలా మంచిది.

ఔషధం:  శతావరెక్స్ (గ్రాన్యూల్స్) ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా పాలతో తాగాలి. సరస్వతీ లేహ్యం: ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా తినాలి.  పునర్నవాది మండూర (మాత్రలు) ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, అధికరక్తస్రావం ఉంటే ‘బోలబద్ధరస’ మాత్రలు ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ఇలా రోజుకి ఆరు వరకు వాడవచ్చు.

గమనిక: మధుమేహం, హైబీపీ వంటి ఇతర వ్యాధులు ఉంటే వాటిని అదుపులోకి తేవాలి.
 గృహవైద్యం: శొంఠి, దనియాలు, జీలకర్ర... ఈ మూడింటిని కషాయంలాగా కాచుకొని ఉదయం ఆరు చెంచాలు, సాయంత్రం ఆరు చెంచాలు తాగాలి.
 
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు,
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్‌నగర్, హైదరాబాద్
 
 పీడియాట్రిక్ కౌన్సెలింగ్
 
మా అమ్మాయికి తొమ్మిదేళ్లు. ఆమెకు ముఖం మీదా, ఒంటిపైన అక్కడక్కడా చిన్న  చిన్న పులిపిరి కాయల్లాంటివి వస్తున్నాయి. పైగా అవి రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆమె మేనిపై వాటిని చూస్తే మాకు ఆందోళనగా ఉంది. మా పాప విషయంలో మాకు సరైన సలహా ఇవ్వండి. - కల్యాణి, కోదాడ
 
మీరు చెప్పిన  వివరాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్ ములస్కమ్  కంటాజియోజమ్ కావచ్చని అనిపిస్తోంది. ఇది వైరస్ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి.  ఇది ముఖ్యంగా రెండు నుంచి 12 ఏళ్ల పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాం.
 
వ్యాప్తి జరిగే తీరు...
 చర్మానికి చర్మం తగలడం వల్ల, వ్యాధి ఉన్నవారి తువ్వాళ్లను మరొకరు ఉపయోగించడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల నుంచి వాళ్లకే వ్యాపించడం కూడా చాలా సాధారణం. దీన్నే సెల్ఫ్ ఇనాక్యులేషన్ అంటారు. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే... బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో
ఎక్కువగా కనిపిస్తుండవచ్చు.
 
చికిత్స: ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే క్రయోథెరపీ, క్యూరటాజ్ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయవచ్చు. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్ మెడిసిన్స్.... అంటే ఉదాహరణకు ఇమిక్యుమాడ్ అనే క్రీమ్‌ను లీజన్స్ ఉన్న ప్రాంతంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్ కలిపి ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, చికిత్సను కొనసాగించండి.
 
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్
రోహన్ హాస్పిటల్స్
విజయనగర్ కాలనీ
హైదరాబాద్
 
పల్మనాలజీ కౌన్సెలింగ్
 
నా వయస్సు 32. నేను గత మూడేళ్లుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నాను. నేను దగ్గినప్పుడు దగ్గుతో తేన్పు కూడా వస్తుంది. నాకు సరైన చికిత్స వివరించగలరు. - సుజాత, గుంటూరు

 మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు బ్రాంకైటిస్‌తో బాధపడుతున్నారు. శ్వాసనాళాలకు వచ్చే ఇన్‌ఫ్లమేషన్ (వాపు, ఎరుపు)నే బ్రాంకైటిస్ అంటారు. శ్వాసనాళపు గోడ లేదా లోపలి కండరం మందం పెరగడం వల్ల గానీ కండరం కుచించుకు పోవడం వల్ల గానీ ఇలాంటి పరిస్థితులు కలుగుతుంది.

కారణాలు: బాక్టీరియా, వైరల ఇన్‌ఫెక్షన్ల వల్ల బ్రాంకైటిస్ వస్తే గనక ఆ సమస్య స్వల్పకాలికంగా ఉంటుంది. అదే అలర్జీ వల్ల వస్తే దీర్ఘకాలికంగా వేధిస్తుంది. పుప్పొడి, డస్ట్‌మైట్స్, పెంపుడు జంతువుల వెంట్రుకల లాంటివి అలర్జీ కారక పదార్థాలు. కొందరికి తలస్నానం చేస్తే కూడా తుమ్ములు మొదలై అలర్జీ ప్రారంభమౌతుంది. పొగ తాగడం వల్ల కేవలం శ్వాసవ్యవస్థలోని కింది భాగం ప్రభావితం అవుతుంది. కాని అలర్జీ వల్ల మొత్తం శ్వాసవ్యవస్థ ప్రభావితం అవుతుంది.
 
నివారణ:  అలర్జీ కారక పదార్థాలు, ప్రేరకాలకు దూరంగా ఉండడం  దీర్ఘకాలిక జలుబు, దగ్గు ఆయాసం వేధిస్తుంటే అశ్రద్ధ చేయకుండా డాక్టరును సంప్రదించాలి  సొంత వైద్యం వద్దు.

పరిష్కారం: అన్ని రకాల బ్రాంకైటిస్‌లకు యాంటీ బయోటిక్స్ వాడకూడదు. కేవలం బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చే బ్రాంకైటిస్‌కు మాత్రమే యాంటీ బయోటిక్స్ వాడాలి. వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చే బ్రాంకైటిస్‌కు ఇవి పనిచేయవు. వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చే బ్రాంకైటిస్‌కు యాంటీ హిస్టామిన్స్, డీ కంజెస్టెంట్స్‌లాంటి మందులు ఉపశమనం కలిగిస్తాయి.

దగ్గుకు సిరప్‌లు బాగా పని చేస్తాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చే బ్రాంకైటిస్‌కు యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల సమస్య తగ్గకపోగా ఇంకా పెద్దవి కావొచ్చు. బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌కి కూడా సొంతంగా యాంటీ బయోటిక్స్ వాడకూడదు. ఇష్టం వచ్చినట్లు మిడి మిడి జ్ఞానంతో వీటిని వాడటం వల్ల బాక్టీరియా నిరోధకతను పెంచుకుంటుంది. అందుకే డాక్టర్‌ను సంప్రదించకుండా ఉపయోగించవచ్చు.

అశ్రద్ధ చేస్తే:  బ్రాంకైటిస్‌కు సరైన చికిత్స తీసుకోకపోయినా, అశ్రద్ధ చేసినా అది న్యుమోనియాకు దారితీయొచ్చు. ఇలాంటప్పుడు తప్పనిసరిగా యాంటీబయోటిక్స్ వాడాలి. న్యుమోనియా ఉన్నప్పుడు అసాధారణ శబ్దాలు వినబడతాయి. ఎక్స్‌రేలో మచ్చలుగా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు ఆక్సిజన్ పెట్టి చికిత్స అందిచాల్సి వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నా, షుగర్ అదుపులో లేకున్నా, కిమోథెరపీ మందులు వాడి ఉన్నా... హెచ్‌ఐవీ ఉన్నా న్యూమోనియా పదేపదే రావొచ్చు. స్టిరాయిడ్స్, రేడియేషన్ తీసుకున్న వాళ్లలో కూడా న్యుమోనియా మళ్లీ రావచ్చు.

మరిన్ని వార్తలు