అముద్రిత లేఖలు

20 Jan, 2020 00:31 IST|Sakshi

పరిచయం

పూండ్ల రామకృష్ణయ్య తమ 25వ యేటనే నెల్లూరులో ‘అముద్రిత గ్రంథ చింతామణి’ సాహిత్య మాసపత్రికను 1885లో స్థాపించి జీవితాంతం వరకు (1904) జయప్రదంగా నడిపారు. 19 సంవత్సరాలు జీవించిన ఈ గొప్ప పత్రిక ఆ కాలంలోని ప్రసిద్ధ కవులకూ పండిత ప్రకాండులకూ సమర్థమైన వేదికగా నిలిచింది. పూండ్ల రామకృష్ణయ్య ప్రతినెలా కొన్ని పేజీలు అముద్రిత కావ్యాల్ని అచ్చువేసి 20 ప్రశస్తమైన కావ్యాల్ని వెలుగులోకి తెచ్చారు. సంపాదకులుగా ప్రముఖ పండితులకు వేలకొద్దీ లేఖలు రాసి, వారి ప్రతిస్పందనల్నీ విమర్శల్నీ తెప్పించుకుని కావ్యప్రియుల సాహిత్యాభిరుచి పెంపొందించడంలో కృతకృత్యులయ్యారు.

ఈ పుస్తకంలో ఆయన మహాపండితులైన వేదం వెంకటశాస్త్రికి రాసిన 150 లేఖలున్నాయి. ఆ సుహృల్లేఖల్లో ఎన్నో గ్రంథాల చర్చ, సంస్కృత ఆంధ్ర కావ్యానువాదాల తులనాత్మక పరిశీలన, కాలానికి తగిన వ్యావహారిక భాష ఆవశ్యకత, సమకాలీన ఘటనాఘటిక కవుల లౌక్యం, పాండిత్య ప్రకర్ష, ఈర్షా్యద్వేషాలు వ్యక్తమయ్యాయి. ఈకాలం పాఠకులకు ఆకాలం గొప్పవారి గోత్రాలు చక్కగా బోధపడతాయి. 1987లో నవంబర్‌ 6 నాటి లేఖలోని ఈ పంక్తులు అప్పటి సాహిత్యప్రియుల రసానుభూతిని తెలియజేస్తాయి. ‘‘ప్రతాపరుద్రీయ నాటక మందలి ప్రతిని చూచి బ్రహ్మానందముం జెందితిని. నిన్నటి రాత్రి మా యిల్లంతయు దీని పఠనము వలన మన మిత్రబృందముచే నిండిపోయినది’’.

అలాగే, నాటకకర్తలైన ధర్మవరం రామకృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు, నడకుదుటి వీరరాజు ప్రభృతులు పూండ్లవారికి రాసిన ఉత్తరాలు కూడా ఇందులో సంకలింపబడ్డాయి. ‘‘ఆయా పండితుల కష్టనష్టాలు, మానవ సహజమైన కోపతాపాలు, యథార్థ జీవిత అనుభవాలు, కీర్తి కోసం, భుక్తి కోసం పోరాటాలు, వెలుగు నీడలు అన్నీ ఈ జాబుల్లో చూడవచ్చు. కాలగతిలో వాళ్లెంతవరకూ కృతకృత్యులైనారో, ఎట్ల కీర్తికాయులైనారో చూచి విస్మయ పరవశులమౌతాము’’  అంటారు సంపాదకుడు మాచవోలు శివరామప్రసాద్‌.

పూండ్ల రామకృష్ణయ్య  సాహిత్య లేఖలు
సంపాదకులు: డాక్టర్‌ మాచవోలు శివరామప్రసాద్‌; 
పేజీలు: 248; వెల: 200; 
ప్రతులకు: సంపాదకుడు: 
4–638, ఉస్మాన్‌సాహెబ్‌పేట్, నెల్లూరు–524002.
 ఫోన్‌: 9441595080
- ఘట్టమరాజు

మరిన్ని వార్తలు