రాధిక కథ సినిమా తీయొచ్చు

22 Feb, 2020 08:49 IST|Sakshi
ఆఫ్రికన్‌ డాల్స్‌ తయారుచేస్తున్న రాధిక

స్ఫూర్తి

ఇటీవల యాసిడ్‌ అటాక్‌ సర్వయివర్‌ జీవితం ఆధారంగా ‘చపాక్‌’ సినిమా వచ్చింది. ప్రమాదం వచ్చినా గెలిచి చూపిన  అమ్మాయి కథ అది.రాధిక కథ అంతకు తక్కువ కాదు.గట్టిగా వేళ్లు విరుచుకుంటే ఆ వేళ్ల ఎముకలు విరిగిపోయేంత సున్నితమైన అరుదైన వ్యాధిఆమెకు ఉంది.ఇంత కర్కశమైన వ్యాధిలో ఎవరైనా కుంగిపోతారు. విరిగిపోతారు.రాధిక నిలబడింది.ప్రకృతి అన్యాయం చేసినా పోరాడి గెలవమని చెబుతోంది.

రాధికకు అయిదేళ్లున్నప్పుడు ఆడుకుంటూండగా కిందపడింది. ఎడమ తొడ ఎముక విరిగింది. ఆడుకుంటూ పడితే తొడ ఎముక విరగడం విచిత్రం. అయితే డాక్టర్లు సీరియస్‌గా తీసుకోలేదు. పడటం వల్లే విరిగిందని అనుకున్నారు. ఆరునెలల తర్వాత ఉన్నట్టుండి నొప్పి మొదలైంది. అడుగు తీసి అడుగు వేయలేకపోయింది. ఆపరేషన్‌ చేసి ప్లేట్‌ను అమర్చారు. అక్కడితో నయం కాలేదు. దాంతో దాదాపు ఏడు సార్లు ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది. మాటిమాటికీ ఎందుకిలా జరుగుతోందని 2010లో మరిన్ని వైద్యపరీక్షలు చేయిస్తే తేలింది ఎముకలకు సంబంధించిన అరుదైన వ్యాధి అని, ఇది జన్యుపరమైనదనీ, ఈ జబ్బు వల్ల ఆమె ఎముకలు అత్యంత బలహీనంగా ఉన్నాయని. అంటే కోడిగుడ్డు పెంకుల్లా అన్నమాట. ఎముక మజ్జ పిండిలా అయిపోతుందన్నమాట. ఫలితంగా స్కూల్లో గంటలు గంటలు కూర్చోవడంతో వెన్నెముక వంగడం మొదలైంది. దీంతో రాధిక స్కూల్‌కి వెళ్లి చదువుకోలేక ఇంటికే పరిమితం కావలసి వచ్చింది. కాస్త గట్టిగా కదిలినా ఫెళఫెళమని ఎముకలు విరగడమే. ఆపరేషన్లు జరగడమే. కోలుకొని ఇంటికొచ్చిన మర్నాడే మరో ఫ్రాక్చర్‌తో ఆసుపత్రికి పరిగెత్తేవారు. రాధిక సరే.. ఇంట్లో వాళ్లకూ బెంగ.. ఇలాగైతే పిల్ల పరిస్థితి ఏంటి అని. సగం టైమ్‌ ఆసుపత్రిలో.. సగం ఇంట్లోనే గడిచిపోయింది బాల్యము, కౌమారమూ. ఆపరేషన్‌ అయ్యి కోలుకోగానే.. ఎముకలు విరగకుండా నడవడం ప్రాక్టీస్‌ చేసేది. ఇదే జీవితం అయిపోయింది.

ఏం చేయాలి?
‘అన్న స్కూల్‌కు, నాన్న ఆఫీస్‌కు వెళ్లేవాళ్లు. ఇంట్లో పనులతో అమ్మ బిజీ. నాతో మాట్లాడేవాళ్లే లేక దిగులు అనిపించేది. ఒకానొక టైమ్‌లో పిచ్చిపట్టినట్టే అయింది. నా స్థితి మీద నాకే జాలి. ఏదైనా వ్యాపకం మొదలుపెట్టుకోవాలనిపించింది. అప్పటికే నా చదువు డిస్టర్బ్‌ కావద్దని ట్యూటర్‌ను పెట్టి ఇంటి దగ్గరే చదువుకునే ఏర్పాటు చేశారు అమ్మా, నాన్న. అయినా బోలెడంత ఖాళీటైమ్‌. అయితే అదేపనిగా రెండుగంటల కంటే ఎక్కువ కూర్చోలేను.. కూర్చోకూడదు కూడా. ఆ రెండు రెండు గంటల టైమ్‌నే సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. చదువుకోసం కేటాయించుకున్నది పోను మిగిలిన టైమ్‌ని.  ఫ్రెండ్స్‌ కోసం చిన్న చిన్న గ్రీటింగ్‌ కార్డ్స్‌ తయారు చేయడం, డ్రాయింగ్‌ వేయడం చేసేదాన్ని’ అంటూ తనను తాను తీర్చిదిద్దుకున్న తీరును చెప్తుంది రాధిక.

తను తయారుచేసిన ఆఫ్రికన్‌ డాల్స్‌తో రాధిక
యూ ట్యూబ్‌ మార్గం
ఇలాగే ఒకసారి కూర్చోని డ్రాయింగ్‌ వేసుకుంటూంటే రాధిక వాళ్లన్నయ్య ఫ్రెండ్‌ మణికందన్‌..  ఆమెను చూసి క్రాఫ్ట్‌కు సంబంధించిన యూట్యూబ్‌ వీడియోస్‌ను ఆమెకు పరిచయం చేశాడు. అప్పటి నుంచి రాధిక ఆ వీడియోలను చూడ్డం.. కొత్త కొత్త క్రాఫ్ట్స్‌ను నేర్చుకోవడం మొదలుపెట్టింది. వాల్‌ హ్యాంగింగ్స్, పెన్‌హోల్డర్స్, బుట్టలు, ఫొటో ఫ్రేమ్స్, బాక్స్‌లు... అన్నీ పేపర్‌తో చేసినవే. తాను తయారు చేసివన్నీ ఫ్రెండ్స్‌కు, బంధువులకు కానుకలుగా ఇచ్చేది.

‘ఎప్పుడూ ఇవేనా? అని బోర్‌ కొట్టింది కొన్నాళ్లకు. అందుకే యూట్యూబ్‌ వీడియోలతో నేర్చుకున్న ఆర్ట్‌నే కొంత డెవలప్‌ చేసుకుందామని.. బొమ్మల ప్రయోగం చేశా.  బాగా కుదిరాయి. కాన్ఫిడెన్స్‌ పెరిగింది. ఆఫ్రికన్‌ డాల్స్‌ తయారీమీద పడ్డా.  కాగితంతోనే. ముందు ఒకటి చేశా. చాలా బాగా వచ్చింది. తర్వాత పది.. ముందుకన్నా అద్భుతంగా ఉన్నాయన్నారు ఇంట్లో వాళ్లు. అంతే ఇక ఆగలేదు. వాటన్నిటినీ మా అన్నయ్య సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం స్టార్ట్‌ చేశా. మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కొంతమందైతే ఏకంగా కొనడానికే ముందుకొచ్చారు. అసలు అమ్మడమనే ఆలోచనేలేదు నాకు. అదే చెప్పాను వాళ్లకు. కాని వినలేదు. చేసేది లేక ఎంతో కొంత వాళ్లనే ఇమ్మన్నాను. అలా కొనడమే కాక అలాంటి ఇంకో 25 బొమ్మలను ఆర్డర్‌ చేశారు కూడా. ఆశ్చర్యం నాకు’ అని చెప్తుంది రాధిక.

ఆఫ్రికన్‌ డాల్స్‌
రాధిక  చేతిలో రూపుదిద్దుకున్న ఆఫ్రికన్‌ డాల్స్‌ సోషల్‌ మీడియాలో ఈ గ్రూప్‌ నుంచి ఆ గ్రూప్‌కు ఫార్వర్డ్‌ అయి అందరికీ తెలిశాయి. డిమాండ్‌ పెరిగింది. ఇప్పుడు అది  చిన్న సైజు కుటీర పరిశ్రమగా మారింది రాధికకు.‘నిజానికి ఈ క్రాఫ్ట్‌ను ఓ మెంటల్‌ థెరపీగా స్టార్ట్‌ చేశా. ఈ బొమ్మలను చేస్తున్నంతసేపు హ్యాపీగా.. హాయిగా ఉంటాను. ఇంకే ఆలోచనా రాదు. దీంతో నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. కాని ఇప్పుడదో బిజినెస్‌గా మారింది. నమ్మలేకున్నాను. చెప్పాను కదా.. ఎక్కువసేపు కూర్చోలేను అని. ఆ కూర్చున్నంతలోనే ఈ బొమ్మలను చేస్తున్నాను’ అంది రాధిక చేతిలో ఉన్న ఆఫ్రికన్‌ డాల్‌ను ఆప్యాయంగా తడుముతూ.ఇప్పటివరకు రెండువందల పైచిలుకు బొమ్మలు అమ్ముడుపోయాయి. నూటయాభై రూపాయల నుంచి ఏడువందల రూపాయల మధ్య ఉంటుంది వాటి వెల.ప్రస్తుతం  ప్రైవేట్‌గా పదకొండో తరగతి పరీక్ష రాయడానికి సన్నద్ధమవుతోంది రాధిక. నిజానికి పదకొండు, పన్నెండు తరగతులను స్కూల్‌కు వెళ్లి చదువుకోవాలని ఆమె తాపత్రయం. కాని కోయంబత్తూరులోని స్కూళ్లు ఆమెను చేర్పించుకోవడానికి సిద్ధంగా లేవు. రకరకాల కారణాలు చెప్పి, సాకులు చూపి ఆమెకు ప్రవేశం ఇవ్వడం లేదు.‘నాలాంటి వాళ్లకు స్కూల్లో చదువుకునే ఆవకాశమే ఉండదా? వ్యాపకంతో ఎంత బిజీగా ఉన్నా ఆర్నెల్ల కిందటిదాకా ఇలాంటి నెగటివ్‌ ఆలోచనలతోనే సతమతమయ్యా. ఒక్కోసారి నా జీవితం ఇలా ఒక ఫెయిల్యూర్‌లా ఎండ్‌ అయిపోతుందా అని కూడా భయపడ్డా’ అంటుంది  రాధిక.

పాజిటివ్‌ ఎనర్జీ
ఎంతటి ప్రతికూలతలు తనను చుట్టుముట్టినా.. వాటిని పాజిటివ్‌ ఎనర్జీగా మార్చుకోగల సత్తా ఆమెది. ఇప్పుడు తన తల్లిదండ్రులు, సోదరుడి సహాయంతో తన పేపర్‌ క్రాఫ్ట్‌ను వ్యాపారంగా వృద్ధి చేయాలనుకుంటోంది. ఆఫ్రికన్‌ డాల్స్‌నే కాకుండా.. కార్టూన్‌ క్యారెక్టర్స్, అబ్దుల్‌ కలాం వంటి ప్రసిద్ధుల బొమ్మలనూ తయారు చేసే పనిలో ఉంది.పాజిటివ్‌నెస్‌కు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏం ఉంటుంది?!   

మరిన్ని వార్తలు