మాస్టారు  ఊళ్లో ఉన్నారా?

13 Feb, 2019 00:30 IST|Sakshi

మహా మహోపాధ్యాయ

రఘునాథ శర్మ గురించి రాజమహేంద్రిలో ప్రస్తావన వస్తే, ముందుగా సాహితీ మిత్రులు అడిగే ప్రశ్న ఒక్కటే.. మాస్టారు ఊళ్లో ఉన్నారా? అని. దగ్గర దగ్గరగా ఎనభై వసంతాల వయసున్న ఈ మాస్టారు.. నేటికీ విరామమివ్వక, విశ్రమించక ప్రవచనాల బోధనకు పర్యటనలు చేస్తూనే ఉన్నారు. 

పట్టుమని పదేళ్ల ప్రాయం చేరుకోకమునుపే ఆ పిల్లవాడి తండ్రి కన్నుమూయడంతో నెలకు మూడు రూపాయల స్కూల్‌ ఫీజు కూడా కట్టలేని దుస్థితి. చుట్టుపక్కలవారు ఎవరో చెప్పారు. ఆగిరిపల్లిలో భోజనం పెట్టి, చదువు చెబుతారని. కట్టుబట్టలతో తల్లి ఆ పిల్లవాడిని ఆగిరిపల్లిలో ఆ వదాన్యుల ఇంటికి చేర్చింది. పిల్లవాడు భాషాప్రవీణ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయి, బడిపంతులుగా ఉద్యోగపర్వంలోకి ప్రవేశించాడు. తనలోని విద్యాతృష్ణను అణచుకోలేక, ఎంఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయి, డాక్టరేట్‌ అందుకుని యూనివర్సిటీ ఆచార్యుని స్థాయికి ఎదిగాడు.

సుమారు లక్షా పాతిక వేల శ్లోకాల వేదవ్యాస భారతానికి ప్రామాణికమైన తెలుగు అనువాదాన్ని అందించడమే జీవిత లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. ఇప్పటి వరకు ఇంచుమించు లక్ష శ్లోకాలకు ఆంధ్రానువాదం పూర్తి చేయడమే కాకుండా, 77 వసంతాల ముదిమిలో అలుపెరుగక దేశమంతటా పర్యటిస్తూ ఆర్షధర్మం, సనాతన ధర్మాలపై ప్రవచన పరంపరలు నిర్వహిస్తున్నాడు. ‘భారత భారతి’, ‘మహామహోపాధ్యాయ’ పురస్కారాలను అందుకుని,  తెలుగు భాషకు విశిష్ట సేవలను అందించినందుకు గుర్తింపుగా ఇటీవలే భారత ప్రభుత్వ గౌరవ పురస్కారానికి ఎంపికయిన ఈ ‘పిల్లవాడి’పేరు.. శలాక రఘునాథ శర్మ. 

గోదావరీ తీరాన  
‘‘అనంతపురం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పదవీ విరమణ చేసిన అనంతరం, ఆంధ్ర మహాభారత రచనకు శ్రీకారం చుట్టిన ఆదికవి నన్నయ భట్టారకుడు నడయాడిన రాజమహేంద్రిలో శలాక రఘునాథ శర్మ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. నెలకు కనీసం 20 రోజులు సాహితీసభలలో పాల్గొనడానికో, ప్రసంగాలు చేయడానికో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న శలాక రఘునాథ శర్మ గురించి రాజమహేంద్రిలో ప్రస్తావన వస్తే, ముందుగా సాహితీమిత్రులు అడిగే ప్రశ్న ఒక్కటే.. మాస్టారు ఊళ్లో ఉన్నారా? అని. శలాక గురించి బహుళ ప్రచారంలో ఉన్న జోక్‌.. మాస్టారు తరచు రైళ్లలో, అప్పుడప్పుడు రాజమహేంద్రిలో స్వగృహంలో ‘కూడా’ ఉంటారని. అలుపెరుగని తన సాహితీ ప్రస్థానం గురించి ఆయన మాటల్లో వినేందుకే బాగుంటుంది.

గురువుల వాత్సల్యం
కృష్ణాజిల్లా, గొల్లపాలెం అనే గ్రామంలో 1941లో జన్మించాను. మేము అయిదుగురు అన్నదమ్ములం, నాకు ఇద్దరు అక్కచెల్లెళ్లు. తండ్రి నరసయ్య నాకు రోజూ ఒక గంటసేపు అమరకోశం నేర్పేవారు, ఆ శ్లోకాలు నోట నానేవి. తండ్రి నాకు పదేళ్ల ప్రాయం రాకుండానే, 1950లో కన్నుమూశారు. అమ్మ నిర్వహణలో ఉన్న ఆస్తి నాస్తి అయిపోయింది. నెలకు మూడు రూపాయల స్కూల్‌ ఫీజు కట్టడం బరువై పోయింది. ఎవరో అమ్మకు చెప్పారు ఆగిరిపల్లిలో భోజనం పెడుతూ చదువు చెబుతారని.

కట్టుబట్టలతో నన్ను అమ్మ వదాన్యులు గరికిపాటి పట్టాభి రామశాస్త్రి, రామ్మూర్తి అనే పెద్దల దగ్గర చేర్చింది. గరికిపాటి కుటుంబ వాత్సల్యం, గురువుల ఆశీస్సులు నాకు లభించాయి. మహా మహోపాధ్యాయులు, రాష్ట్రపతి పురస్కారగ్రహీతలు అయిన పేరి వేంకటేశ్వర శాస్త్రి, రామచంద్రుని కోటేశ్వర శర్మల వద్ద విద్యనేర్చుకునే మహదవకాశం నాకు లభించింది. 1955–60 మధ్యకాలంలో భాషాప్రవీణ పరీక్షలలో ప్రథమ శ్రేణిలో మొదటి ర్యాంకులో ఉత్తీర్ణుడినయ్యాక, ఉద్యోగపర్వంలోకి ప్రవేశించాను.

టీచర్‌గా తొలి ఉద్యోగం
రాజమహేంద్రవరం, గౌతమీ విద్యాపీఠంలో నెలకు రూ.84 జీతం అందుకుంటూ గ్రేడ్‌–2 తెలుగు పండితునిగా ‘ఉద్యోగపర్వం’లో ప్రవేశించాను. ఆ తరువాత పండిట్‌ ట్రెయినింగ్‌ పూర్తి చేసుకుని, విశాఖపట్టణం, ఏలూరు, శ్రీశైలం పట్టణాలలో తెలుగు పండితునిగా పని చేశాను. ఉద్యోగాలకు స్వస్తి చెప్పి, హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏలో చేరాను. దివాకర్ల వేంకటావధాని అనుగ్రహంతో సీటు వచ్చింది. డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, గిడుగురాజు రామరాజు, పాటిబండ్ల మాధవ శర్మ, పల్లా దుర్గయ్యలు నాకు గురువులు. 1967లో ఎం.ఏ బంగారు పతకం, డిస్టింక్షన్‌తో ఉత్తీర్ణుడినయ్యాను. 1968లో అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకునిగా తిరిగి ఉద్యోగపర్వంలో ప్రవేశించి, 2001లో డీన్‌గా పదవీ విరమణ చేసి, రాజమహేంద్రవరంలో స్థిరపడ్డాను.

భారతం మీదనే ఎందుకు?
భాషాప్రవీణ చదువుతున్నప్పుడు సభాపర్వంలో ద్వితీయ ఆశ్వాసం పాఠ్యాంశంగా ఉండేది. శిశుపాల వధ ద్యూతం ఘట్టాలు చదువుతూంటే భారతం మీద ఆకర్షణ కలిగింది. శ్రీశైలంలో ఉన్నప్పుడు పెద్దగా పని ఉండేది కాదు. విశ్రాంతి సమయాలలో కవిత్రయ భారతంలో ప్రతిరోజూ ఒక ఆశ్వాసం చదివేవాడిని. నాటినుంచి నేటి వరకు ఆ ‘రుచి’ నన్ను వదలలేదు. ఆ సమయంలోనే వేదవ్యాసుని మూలభారతం అధ్యయనం చేయడం ప్రారంభించాను. సంస్కృత భారతాన్ని సులభమైన శైలిలో తెలుగు ప్రజలకు అందించాలన్న బలమైన కోరిక, ఈశ్వర ప్రేరణ నాలో ఏర్పడింది. నీలకంఠీయ వ్యాఖ్యానంతో, వ్యాసభారతంలోని 12 పర్వాలకు శ్లోకానువాదాన్ని,  భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలకు మూల విధేయాంధ్రానువాదాన్ని పూర్తి చేశాను’’ అని తెలిపారు రఘునాథశర్మ.

మూడు వేల పేజీల పుస్తకం!
‘కొన్ని వేదమంత్రాలకు విస్తృతమైన భావం, వ్యాఖ్యానాలతో ‘మంత్రాక్షర మహావిభూతి’ అన్న గ్రంథాన్ని వెలువరించాలన్న ఆలోచన ఉంది. ఇదో బృహత్‌ ప్రాజెక్టు. మహాభారతం విషయానికి వస్తే, ఆదిపర్వంలోని తొలి అధ్యాయం, యక్షప్రశ్నలు (వనపర్వం), విదురనీతి, సనత్సుజాతీయం (ఉద్యోగపర్వం), భగవద్గీత (భీష్మపర్వం), భీష్మస్తవరాజం (శాంతిపర్వం), ఆనుశాసనిక పర్వంలోని విష్ణు, శివసహస్రనామాలు, అశ్వమేధపర్వంలోని అనుగీతలను ఒక బృహద్గ్రంథంగా.. (అచ్చులో సుమారు మూడువేల పేజీలు రావచ్చు) మహాభారత ప్రణవం పేరిట వెలువరించాలన్న ఆశయం ఉంది. మానవుని మాధవునివైపు మళ్లించే ఈ నిధిని తెలుగువారికి అందించాలని కోరిక.  ఆ మంచిరోజు కోసం చూస్తున్నాను.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా