స్వేచ్ఛాబంధన్‌

15 Aug, 2019 12:50 IST|Sakshi

భలే మంచి రోజు ఇది. బానిస శృంఖలాలు తెంచుకుని భరతమాత స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు. అంతేనా! రాఖీ పండుగ కూడా కలిసి వచ్చిన రోజు. ఈ రెండు వేడుకలను కలుపుకుంటూ భరతమాత చేసిన ఈ స్వగత రచనను ఆస్వాదించండి.

ఎంతోమంది దేశభక్తులు తమ చేతులకు రాఖీలు కట్టించుకున్న రోజు ఇది. రుక్సానా తన చేతికి కట్టిన రాఖీ కోసం పురుషోత్తముడు గ్రీకువీరుడు అలెగ్జాండరును చంపకుండా విడిచిపెట్టాడు. ఎంత అద్భుతమైన పండుగ. కేవలం రాఖీ కారణంగానే అలెగ్జాండరును విడిచిపెట్టాడా. కాదు.. అదొక్కటే కారణం కాదు.. రాఖీలో దాగి ఉన్న విడదీయరాని ప్రేమ కారణంగానే పురుషోత్తముడు అంత ఉత్తమంగా ప్రవర్తించాడు. అందుకే ఈ రోజు నాకు రెండు పండుగల సంబరాలు జరుగుతున్నాయి. నా బిడ్డలందరూ నన్ను ‘భరతమాత’ అంటూ ఆప్యాయంగా పెనవేసుకుపోతున్నారు. నేను మాత్రం నా పుత్రసంతానం చేతులకున్న రాఖీలు చూస్తూ మురిసిపోతున్నాను. నా ఆడపిల్లలకు ఎంతో భరోసా ఇస్తున్న శుభ పండుగ ఇది. ఆడపిల్లలు అస్వతంత్రులేమీ కాదు, చేతకానివారూ కాదు. ఆప్యాయతను కోరే సున్నిత మనస్కులు. అందుకే సోదరుల ప్రేమను స్వార్థంగా ఆశిస్తారు. నిస్వార్థంగా వారికి సేవలు అందిస్తారు. మన ఇంటి ఆడపడుచులను కంటికి రెప్పలా చూసుకోవాలని ఒక తల్లిగా నేను నిరంతరం ఆకాంక్షిస్తుంటాను.

ఒక పక్కన మువ్వన్నెల జెండాలతో నగరాలు, గ్రామాలు, పల్లెలు కళకళలాడుతుంటే, మరోపక్క నా పిల్లలు చేసుకుంటున్న అన్నచెల్లెళ్ల పండుగతో నాకు కన్నులపండువుగా ఉంది. నా అంతరంగం పరవళ్లు తొక్కుతోంది. రంగురంగుల మిఠాయి బిళ్లలతో బడిపిల్లలు నోళ్లు తీపి చేసుకుంటుంటే ఎర్రగా మారిన వారి నోళ్లు చూసి నా హృదయం పసిపిల్లలా గెంతుతుంటే, పరవశించిపోతాను. ‘హిమగిరీంద్రము నుండి అమృతవాహిని దాకా అఖిల భారత జనుల అలరించు తల్లీ’ అంటూ దేశభక్తి గీతాలు ఆలపిస్తుంటే, నా మేను పులకరించిపోతోంది. ‘కల గంటినే నేను కలగంటినే, కలలోన తల్లిని కనుగొంటినే, ఎంత బాగున్నదో నా కన్నతల్లి ఎన్నాళ్లకెన్నాళ్లకగుపించె మళ్లీ’ అని కొన్ని సుస్వరాల ఆలాపన వింటుంటే, నా మనసు కోకిల గానం చేస్తోంది.

ఇంతలోనే ‘అన్నయ్య హృదయం దేవాలయం, చెల్లెలె ఆ గుడి మణిదీపం’ అంటూ చెల్లెమ్మలు అన్నయ్యను పొగడ్తలతో ముంచెత్తుతుంటే, నా బిడ్డలంతా అనురాగ బంధాన్ని పటిష్టం చేసుకుంటున్నందుకు నా మాతృహృదయం పరవశించపోతోంది. ‘ఎందరో వీరుల త్యాగఫలమే మన నేటి స్వేచ్ఛకే మూల బలం, వారందరినీ తలచుకుని మన మానసవీధిని నిలుపుకుని’ అంటూ వీరుల త్యాగాలను స్మురించుకుంటున్నారు నా వారంతా.

నా మీద ఎంత ప్రేమ. కలం పట్టిన ప్రతి కవి సిరాలో నుంచి స్వేచ్ఛాసుమాల వర్ణాలు జాలువారుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో నాకు స్వతంత్రం వచ్చిందనే విషయం పిల్లలకు గుర్తు చేయాలన్న లక్ష్యంతో పాఠశాలల్లో జెండాలు ఎగురవేస్తూ, బిళ్లలు పంచుతుంటే, పిల్లలంతా ముద్దుముద్దు మాటలతో నన్ను కీర్తిస్తూ పాడుతుంటే, నా గురించి నా ఒళ్లే గగుర్పొడిచేలా ఉపన్యాసాలు చెబుతుంటే, నా మాతృహృదయం ద్రవించిపోదా. నాకు ఉత్తరాన ఉన్న హిమాలయాలు అవే కదా. ఈ చిన్నారుల మాటలకు అవి ద్రవించకుండా ఉంటాయా. ఈ పండుగతో పాటు నా పిల్లలంతా మరో పండుగ సంబరంగా జరుపుకుంటుటే, నా ఆనందం ద్విగుణీకృతమవుతోంది. నా నొసట అశోకుని ధర్మచక్రాన్ని కుంకుమగా దిద్దుతూ, మరోపక్క సోదరుల నుదుటన నిలువుగా కస్తూరీ తిలకం అద్దుతుంటే... అబ్బో... మళ్లీ ఎన్నాళ్లకు ఇంతటి సుందర దృశ్యాన్ని కళ్లారా చూసే అదృష్టం కలుగుతుందో అనిపిస్తోంది.

శ్రీకృష్ణుడు ద్రౌపదిని కాపాడి అన్నాచెల్లెళ్ల అనుబంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాడు. సుభద్ర కోరుకున్న అర్జునుడికి ఇచ్చి వివాహం జరిపించి, పితృవాత్సల్యాన్ని అనుభూతి చెందాడు. ఒక తల్లిగా నేను ఇంతకంటె ఏం కోరుకుంటాను. ఇంతటి ఆనందానుభూతులన్నీ ఈ రోజు నా మనసు పొరల్లోంచి బయటకు వస్తున్నాయి.
ఈ రోజు నాకు మాత్రమే కాదు నా సంతానానికి కూడా జేజేలు పలుకుదాం.
నా వారందరికీ రక్షాబంధన శుభాశీస్సులు పలుకుతున్నాను.

ఒక పక్కన మువ్వన్నెల జెండాలతో నగరాలు, గ్రామాలు, పల్లెలు కళకళలాడుతుంటే.. మరోపక్క నా పిల్లలు చేసుకుంటున్న అన్నాచెల్లెళ్ల పండుగతో నాకు కన్నుల పండువుగా ఉంది. నా అంతరంగం పరవళ్లు తొక్కుతోంది.సృజనాత్మక రచన: వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా