Mobile Bus Stop: బస్‌స్టాప్‌ల కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సిన అవసరం లేదు

18 Nov, 2023 10:09 IST|Sakshi

బెంగళూరులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం... అనేది ఒక కోణం.మరో కోణం ఇది...‘నేను ఒక ప్రైవేట్‌ కంపెనీలో కొంతకాలం పాటు పనిచేశాను. బస్‌స్టాప్‌ చేరడానికి కనీసం రెండు కిలోమీటర్ల దూరం నడవాలి. దీంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది’ అంటుంది రజిని. ‘ఒకరోజు ఏదో ఫంక్షనుకు వెళ్లొస్తుంటే చాలా ఆలస్యం అయింది. ఆ రాత్రి సమయంలో బస్‌స్టాప్‌ నుంచి నేను ఉండే చోటికి వెళ్లడానికి రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఎంత భయమేసిందో చెప్పలేను’ అంటుంది శ్రీకళ.

‘నేను ఇండ్లలో పనిచేస్తుంటాను. నేను ఉన్న చోట నుంచి బస్‌స్టాప్‌కు రావడానికి అయిదు కిలోమీటర్ల దూరం నడవాలి’ అంటుంది రుక్మిణి. రుక్మిణి, శ్రీకళ, రజని... లాంటి ఎంతోమంది మహిళలు బస్సు ప్రయాణానికి సంబంధించి తాము ఎదుర్కొంటున్న సమస్యను ఎవరితోనూ చెప్పుకోలేదు. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. ఇలాంటి మహిళల విన్నపాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడానికి సృజనాత్మక విధానంలో ఏర్పాటయింది ఈ ట్రావెలింగ్‌ బస్‌స్టాప్‌...మరిన్ని సిటీ బస్‌స్టాప్‌లను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో బెంగళూరులోని వివిధ సంఘాలు, కళాకారులు ‘అల్లి సెరోనా’ పేరుతో ఒక వేదికగా ఏర్పడి ‘మొబైల్‌ బస్‌స్టాప్‌ ఇన్‌స్టాలేషన్‌’ టూర్‌ను ఏర్పాటు చేశారు.

ఈ మొబైల్‌ బస్‌స్టాప్‌ బస్సు ఎప్పడూ వెళ్లని ప్రాంతాలకు వెళుతుంది. ఒక ప్రాంతంలో మూడు రోజుల పాటు ఏర్పాటు చేస్తారు. సాధారణ బస్‌స్టాప్‌ కంటే సృజనాత్మకంగా ఈ హైపర్‌–క్రియేటివ్‌ మొబైల్‌ బస్‌స్టాప్‌ను రూపొందించారు. దీనిలో టికెట్‌ కౌంటర్, సిట్టింగ్‌ ఏర్పాట్లు, న్యూస్‌పేపర్‌ స్టాండ్, వెయిటింగ్‌ స్పేస్‌... మొదలైనవి ఉంటాయి.‘చాలామంది మహిళలు బస్‌స్టాప్‌ల కోసం కిలోమీటర్‌ల దూరం నడవాల్సి వస్తోంది. ఈ సమస్య గురించి మొబైల్‌ బస్‌స్టాప్‌ ఇన్‌స్టాలేషన్‌ ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం’ అంటుంది అల్లి సెరోనా క్రియేటివ్‌ స్ట్రాటజిస్ట్‌ తనిషా.

‘అసంఘటిత రంగంలో పనిచేసే మహిళల కోసం ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేశాం’ అంటున్నారు కమ్యూనిటీ కో–ఆర్డినేటర్‌ సురేష్‌ కాంత.తాము ఉండే ప్రాంతానికి చాలాదూరంగా బస్‌స్టాప్‌లు ఉండడంతో ఎక్కువమంది మహిళలు బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బస్సు రాని ప్రాంతాలలో వచ్చేలా ‘అల్లి సెరోనా’తో కలిసి పనిచేస్తోంది మల్లిక. ఇప్పుడు ఉన్న బస్‌స్టాప్‌లు అరకొర సౌకర్యాలతో ఉన్నాయి, కొన్ని నామమాత్రంగా మాత్రమే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ట్రావెల్‌లింక్‌ బస్‌స్టాప్‌ ఇన్‌స్టాలేషన్‌’ రూపంలో డ్రీమ్‌ బస్‌ స్టాప్‌కు రూపకల్పన చేసింది అల్లి సెరోనా.

‘ఈ మొబైల్‌ బస్‌స్టాప్‌లో ఉన్నట్లే అన్ని బస్‌స్టాప్‌లలో బాగా వెలుతురు ఉన్న లైట్లు, సీసీ కెమెరాలు ఉండాలి. రాత్రివేళల్లో బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఇది ఎంతో ఉపయోగం’ అంటుంది రుక్మిణి. ఈ మొబైల్‌ బస్‌స్టాప్‌ ఇన్‌స్టాలేషన్‌ పుణ్యమా అని మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌లో కదలిక మొదలైంది. చిన్న రూట్స్‌లో కూడా బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు మొదలయ్యాయి.
 

మరిన్ని వార్తలు