మీఠా బంధన్‌

25 Aug, 2018 00:29 IST|Sakshi

ఇదిగోండి బుజ్జి బుజ్జి మిఠాయిలు. కొరకక్కర్లేదు. నాలుక మీద పెడితే చాలు... అయినా ఈ రోజుల్లో మిఠాయి పెద్దదైతే ముఖాలు చిన్నవవుతున్నాయి... కేలరీలు గట్రా ఎక్కువని!అందుకే ఈ రాఖీకి చిన్న చిట్టి చిన్నారి చ్వీట్లు

చిన్నారి జిలేబి
కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; సెనగ పిండి – ఒక టేబుల్‌ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను; బేకింగ్‌ పౌడర్‌ – పావు టీ స్పూను; బేకింగ్‌ సోడా – చిటికెడు; పుల్ల పెరుగు – 3 టేబుల్‌ స్పూన్లు; మిఠాయి రంగు – చిటికెడు (నీళ్లలో కలిపి కరిగించాలి); నీళ్లు – అర కప్పు + 3 టేబుల్‌ స్పూన్లు; నూనె లేదా నెయ్యి – డీప్‌ ఫ్రైకి సరిపడా
పాకం కోసం: పంచదార – ఒక కప్పు; నీళ్లు – అర కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; నిమ్మ రసం – అర టీ స్పూను.

తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, సెనగ పిండి, బేకింగ్‌ పౌడర్, బేకింగ్‌ సోడా వేసి బాగా కలపాలి ∙ఏలకుల పొడి, పుల్ల పెరుగు జత చేసి మరోమారు కలపాలి ∙మిఠాయి రంగు కలిపిన నీళ్లు జత చేసి మూత పెట్టాలి ∙(పిండి మరీ పల్చగా ఉండకూడదు. అవసరాన్ని బట్టి మాత్రమే నీళ్లు కలుపుకోవాలి) ∙మిశ్రమాన్ని ఒక రోజు నాననివ్వాలి ∙మరుసటి రోజు మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలిపి, అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేసి మిశ్రమం చిక్కగా ఉండేలా చూసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో పంచదార, నీళ్లు వేసి ఉడికించాలి ∙తీగ పాకం వచ్చిన తరవాత ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, నిమ్మ రసం వేసి కలిపి దింపేయాలి ∙జిలేబి మిశ్రమాన్ని జిలేబి వేసే సీసాలో పోసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక జిలేబి సీసాలోని మిశ్రమాన్ని నూనెలో జిలేబి ఆకారం వచ్చేలా తిప్పుకోవాలి ∙రెండువైపులా దోరగా వేయించిన తరవాత పంచదార పాకంలో వేసి సుమారు రెండు గంటల తరవాత ప్లేటులో అందించాలి.

చమ్‌ చమ్‌ ఇన్‌ డాలర్‌
కావలసినవి: పాలు – ఒక లీటరు; నిమ్మ రసం – 2 టేబుల్‌స్పూన్లు; పంచదార – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – 4 కప్పులు; ఏలకుల పొడి – పావు టీ స్పూను.
స్టఫింగ్‌ కోసం: పచ్చి కోవా – పావు కప్పు (సన్నగా తురమాలి); పంచదార పొడి – ఒక టీ స్పూను; కుంకుమ పువ్వు రేకలు – 5 (పావు టీ స్పూను పాలలో నానబెట్టాలి); ఏలకుల పొడి – చిటికెడు; పిస్తాచూ తరుగు – మూడు టేబుల్‌ స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ: ∙ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి  మంట బాగా తగ్గించి నిమ్మ రసం వేస్తూ కలపాలి ∙పాలు విరిగి నీళ్లు, పాల ముద్ద విడివడతాయి ∙స్టౌ మీద నుంచి దింపేసి, చల్లారాక పల్చటి వస్త్రంలో వేసి, నీరు పూర్తిగా పిండేసి, ఆ వస్త్రానిన గట్టిగా మూట కట్టి, సుమారు గంట సేపు మూట మీద బరువు ఉంచాలి ∙ఇలా చేయడం వల్ల నీరు పూర్తిగా పోతుంది ∙నీరు పోయిన తరవాత ఆ ముద్దను ఒక ప్లేటులోకి తీసుకుని, చేతితో పొడిపొడిగా విడదీయాలి ∙పాల విరుగును చేతితో బాగా కలుపుతూ ముద్ద చేయాలి ∙కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని మనకు కావలసిన ఆకారంలో గుండ్రంగా లేదా పొడవుగా ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙వెడల్పాటి పాత్రలో ఒకటిన్నర కప్పుల పంచదార, నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, సన్న మంట మీద కొద్దిగా మరిగించాలి ∙తయారుచేసి ఉంచుకున్న ఉండలను ఒక్కొక్కటిగా పాకంలో వేసి మూత పెట్టాలి ∙సుమారు పది నిమిషాల తరవాత మూత తీసి చమ్‌చమ్‌లను చెక్క స్పూనుతో వెనక్కు తిప్పి మూత పెట్టాలి ∙మరో పది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙పావు టీ స్పూను
ఏలకుల పొడి జత చేసి చల్లారనివ్వాలి ∙కుంకుమ పువ్వుతో అలంకరించాలి.

స్టఫింగ్‌ తయారీ: ∙ఒక పాత్రలో పావు కప్పు పచ్చి కోవా, టీ స్పూను పంచదార పొడి, చిటికెడు ఏలకుల పొడి, పాలలో కలిపిన కుంకుమ పువ్వు వేసి ఒక స్పూనుతో బాగా కలపాలి  చమ్‌చమ్‌లలో అదనంగా ఉన్న పంచదార పాకాన్ని తీసేయాలి ∙ఒక్కో చమ్‌చమ్‌ను చేతిలోకి తీసుకుని చాకుతో మధ్యకి కట్‌ చేయాలి ∙ఒక టీ స్పూను స్టఫింగ్‌ మిశ్రమాన్ని అందులో ఉంచి, కొబ్బరి తురుమును పైన చల్లాలి  పిస్తాచూ తరుగును సిద్ధంగా ఉన్న చమ్‌చమ్‌ల పైన చల్లి, చేతితో మృదువుగా అదమాలి ∙కావాలనుకుంటే నీళ్లలో కలిపిన కుంకుమపువ్వుతో గార్నిష్‌ చేసుకోవచ్చు.

పైనాపిల్‌ బర్ఫీ
కావలసినవి:
పైనాపిల్‌ స్లయిసులు – 4; పాలు – ఒక లీటరు; నెయ్యి – కొద్దిగా; పెరుగు – అర టీ స్పూను; పంచదార – ఒక కప్పు; నిమ్మ ఉప్పు – రెండు చిటికెలు; పైనాపిల్‌ ఎసెన్స్‌ – నాలుగు చుక్కలు.

తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో పాలు పోసి, స్టౌ మీద ఉంచి వేడి చేసి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక అందులో పెరుగు వేయాలి ∙ఈ మిశ్రమాన్ని స్టౌ మీద ఉంచి చిక్కపడేవరకు ఆపకుండా కలుపుతుండాలి ∙మిశ్రమం సగానికి తగ్గిన తరవాత పంచదార జత చేయాలి  నిమ్మ ఉప్పు కూడా వేసి బాగా కలపాలి  మిశ్రమం బాగా గట్టిపడేవరకు ఉడికించాలి ∙పైనాపిల్‌ ఎసెన్స్‌ వేసి బాగా కలిపి, నెయ్యి రాసిన  పాత్రలో సగం మిశ్రమం పోయాలి  తరిగి ఉంచుకున్న పైనాపిల్‌ స్లయిసెస్‌ను మిశ్రమం మీద ఉంచి, మిగిలిన సగం మిశ్రమం ఆ పైన వేయాలి ∙మిశ్రమాన్ని సమానంగా పరిచి చల్లారనివ్వాలి  కావలసిన ఆకారంలో కట్‌ చేసుకోవాలి.

లౌకీ కలాకండ్‌
కావలసినవి:సొరకాయ – ఒకటి (తొక్క తీసి సన్నగా తురమాలి); పంచదార – అర కప్పు; కోవా – పావు కిలో; బొంబాయి రవ్వ – ఒక టేబుల్‌ స్పూను; బాదం + పిస్తాచూ తరుగు – కొద్దిగా; కుంకుమపువ్వు – పావు టీ స్పూను; మిఠాయి రంగు – పావు టీ స్పూను (కొద్దిగా నీళ్లలో కలపాలి); ఏలకుల పొడి – అర టీ స్పూను

తయారీ: ∙ఒక పాత్రలో సొరకాయ తురుము, నీళ్లలో కలిపిన మిఠాయి రంగు వేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙కొద్దిగా చల్లారాక నీరు పిండి తీసేసి, అర కప్పు పంచదార జత చేసి పక్కన ఉంచాలి ∙పెద్ద పాత్రలో పాలు పోసి స్టౌ మీద సుమారు పది నిమిషాల సేపు మరిగించాక, బొంబాయి రవ్వ వేసి కలిపి దింపేయాలి ∙పెద్ద బాణలిలో సొరకాయ మిశ్రమం వేసి ఆపకుండా కలుపుతుండాలి ∙కుంకుమ పువ్వు, ఏలకుల పొడి, పాలు జత  చేసి బాగా కలపాలి ∙వెడల్పాటి పళ్లానికి నెయ్యి పూసి, తయారుచేసి ఉంచుకున్న కలాకండ్‌ మిశ్రమం పోసి సమానంగా పరవాలి ∙బాదం తరుగు, పిస్తాచూ తరుగుతో అలంకరించి, ఫ్రిజ్‌లో ఉంచాలి ∙గంట సేపయ్యాక బయటకు తీసి కావలసిన ఆకారంలో కట్‌ చేయాలి.

ఖీర్‌ కదమ్‌
కావలసినవి
పచ్చి కోవా – ఒక కిలో; పాలు – 2 లీటర్లు; కుంకుమ పువ్వు – కొద్దిగా; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; పంచదార – ఒక కిలో; పంచదార పొడి – 4 టీ స్పూన్లు; కొబ్బరి తురుము – తగినంత; మిఠాయి రంగు – 4 చుక్కలు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; నీళ్లు – తగినన్ని

తయారీ: ∙మందపాటి పాత్రను స్టౌ మీద ఉంచాలి ∙పాలు పోసి మరిగించాక, నిమ్మ రసం వేసి కలపాలి ∙పాలు విరిగాక ఒక వస్త్రంలో కట్టి, నీళ్లు పిండేసి పనీర్‌ తయారు చేసుకోవాలి ∙చిన్న చిన్న ఉండలుగా రసగుల్లాలను చేసుకుని పక్కన ఉంచాలి ∙మరొక పాత్రను స్టౌ మీద ఉంచి నీళ్లు, పంచదార వేసి తీగ పాకం వచ్చేవరకు ఉడికించాలి ∙కుంకుమ పువ్వు, మిఠాయి రంగు వేసి కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న రసగుల్లాలను పంచదార పాకంలో వేసి సుమారు గంటసేపు ఉంచాలి ∙స్టౌ మీద ఒక నాన్‌స్టిక్‌ పాన్‌లో కోవా వేసి కొద్దిగా రంగు మారేవరకు కలపాలి ∙కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేయాలి.

చిట్టి కాజా
కావలసినవి
మైదా పిండి – ఒక కప్పు; బేకింగ్‌ సోడా – చిటికెడు; ఉప్పు – చిటికెడు; నెయ్యి – పావు కప్పు + 2 టేబుల్‌ స్పూన్లు; నీళ్లు – తగినన్ని; బియ్యప్పిండి – కొద్దిగా; 
పంచదార పాకం కోసం; పంచదార – 2 కప్పులు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్‌ సోడా, ఉప్పు, ¯ð య్యి వేసి ఉండలు లేకుండా కలపాలి ∙కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలిపి, గంట సేపు పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద పాత్రలో పంచదార, నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు ఉడికించి దింపేయాలి ∙వేరొక పాత్రలో బియ్యప్పిండి, నెయ్యి వేసి ముద్దలా చేసి పక్కన ఉంచాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండిని ఉండలుగా చేసి, ఒక్కో ఉండ తీసుకుని చపాతీల మాదిరిగా అన్నిటినీ ఒత్తుకోవాలి ∙బియ్యప్పిండి ముద్దను ఒక చపాతీ మీద పూసి ఆ పైన మరో చపాతీ ఉంచి దాని మీద మళ్లీ బియ్యప్పిండి ముద్ద పూయాలి ∙ఈ విధంగా ఐదు చపాతీలను ఒకదాని మీద ఒకటి ఉంచాక, రోల్‌ చేయాలి ∙అంగుళం మందంలో ముక్కలుగా కట్‌ చేసి, మధ్య భాగంలో కొద్దిగా ఒత్తాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, కాజాలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙తయారుచేసి ఉంచుకున్న పాకంలో వేసి రెండు మూడు గంటలయ్యాక బయటకు తీసి ప్లేట్‌లో అందించాలి.

గవ్వలు
కావలసినవి: నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; మైదా పిండి – 2 కప్పులు; నూనె – డీప్‌ ఫ్రైకి తగినంత; ఉప్పు – చిటికెడు; బెల్లం తరుగు/పంచదార – ఒక కప్పు; నీళ్లు – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ: ∙ఒకపాత్రలో మైదా పిండి, నెయ్యి వేసి బాగా కలపాలి.నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ∙గవ్వలు తయారుచేసుకునే బల్ల మీద ఒక్కో ఉండను గవ్వ మాదిరిగా ఒత్తి పక్కన పెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక తయారుచేసి ఉంచుకున్న గవ్వలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం తరుగు/పంచదార వేసి స్టౌ మీద ఉంచి తీగపాకం వచ్చేవరకు ఉడికించాలి ∙తయారుచేసిన గవ్వలను బెల్లం పాకంలో వేసి చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

స్వీట్‌ సమోసా
కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; నానబెట్టిన సెనగ పప్పు – అర కప్పు; పంచదార పొడి/బెల్లం తరుగు – అర కప్పు; కరిగించిన నెయ్యి – పావు కప్పు; జీడిపప్పులు – 2 టేబుల్‌ స్పూన్లు (ముక్కలు చేయాలి); కిస్‌మిస్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; బాదం పప్పులు – 10 (నీళ్లలో నానబెట్టి, తొక్క తీసి ముక్కలు చేసుకోవాలి); ఏలకుల పొడి – టీ స్పూను; నెయ్యి లేదా నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, నెయ్యి వేసి పూరీ పిండిలా కలిపి, సుమారు అర గంట సేపు మూత పెట్టి పక్కన ఉంచాలి ∙సెనగపప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఉడికించి దింపేయాలి చల్లారాకి నీరు ఒంపేసి సెనగ పప్పును మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక మెత్తగా చేసిన సెనగ పప్పు  వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙నెయ్యి వేరుపడుతున్నట్లుగా అనిపించాక కిందకు దింపి చల్లారాక డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు, బెల్లం తరుగు/పంచదార పొడి, ఏలకుల పొడి జత చేసి బాగా కలిపి, వేరొక పాత్రలోకి తీసి, పక్కన ఉంచాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి దీర్ఘచతురస్రాకారంలో సన్నగా పొడవుగా ఒత్తుకుని, సమోసా ఆకారం వచ్చేలా మడతలు వేయాలి ∙ఒక టీ çస్పూను స్టఫింగ్‌ మిశ్రమం అందులో ఉంచి అంచులు మూసేయాలి (అంచులను నీటితో తడి చేస్తే గట్టిగా అతుకుతుంది ∙ఇలా అన్నీ తయారుచేసుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి దోరగా వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙కొద్దిగా చల్లారాక అందించాలి.

రాఖీ మిఠాయిలను ఇలా అందంగా అలంకరించండి...
రక్షాబంధన్‌ను ప్రత్యేకంగా జరుపుకోవాలనుకోగానే, రకరకాల మిఠాయిలు తయారుచేసి, పండుగను అంగరంగ వైభవంగా చేసుకోవాలనుకుంటారు. ఈ మిఠాయిలను చేసినవి చేసినట్లుగా కాకుండా, వాటిని అందంగా అలంకరిస్తే, మిఠాయిలు రుచిగానే కాకుండా, కనువిందు కూడా చేస్తాయి.

∙మోతీచూర్‌ లడ్డూ వంటి వాటిని బాదం, జీడిపప్పు, పిస్తా తరుగులతో అలంకరించాలి.
∙లడ్డూలను ప్లేట్‌లో ఉంచాక, చుట్టూ గులాబి రేకలు వేస్తే కంటికి ఇంపుగా ఉంటుంది.
∙గులాబ్‌జామ్, రసగుల్ల వంటివాటిని కొబ్బరి తురుముతో గార్నిష్‌ చేయాలి.
∙వంటకం పూర్తి చేసి, ప్లేట్‌లో అందించేటప్పుడు గార్నిషింగ్‌ చేస్తే తాజాగా ఉంటుంది.
∙రాఖీ పండుగ ప్రతిబింబించేలా మీరు తయారుచేసే స్వీట్లను రాఖీ ఆకారంలో తయారుచేస్తే, మిఠాయిలోనే పండుగ కనిపిస్తుంది.
∙బర్ఫీ, పేడా వంటి వాటి మీద రాఖీ డిజైన్‌ చేసి, చుట్టూ పంచదార పాకంతో డిజైన్‌ చేశాక, కొబ్బరి తురుమును చల్లి, చివరగా ఒక చెర్రీ ఉంచితే, నోటికి విందు చేసే రాఖీ తయారయినట్లే.
– డా. బి. స్వజన్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజమ్‌ అండ్‌ 
ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజమ్‌)  

మరిన్ని వార్తలు