రాములమ్మ ఫ్రమ్ సిరిసిల్ల

8 Oct, 2015 23:34 IST|Sakshi
రాములమ్మ ఫ్రమ్ సిరిసిల్ల

బుల్లితార
 
రాములమ్మ సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన దామెర శిరీషకు టీవీలో నటించే అవకాశం అప్రయత్నంగానే వచ్చింది. అక్క రజిత టీవీనటి. మరో అక్క సౌజన్య కూడా బుల్లితెర నటి. అయితే ‘ఎంబీఏ చేసి ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నాను తప్ప నటిని కావాలనుకోలేదు. యాదృచ్ఛికంగా జరిగిపోయింది’ అంటారు శిరీష. ‘మాది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. నైన్త్ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. టెన్త్ నుంచి హైదరాబాద్‌లోనే. బీకామ్ సెకండియర్‌లో ఉండగా ‘అడగక ఇచ్చిన మనసు’ ఆడిషన్స్‌కెళ్లాను. అక్కయ్యలిద్దరూ ఈ రంగంలో ఉండడంతో ఆ స్క్రీన్ టెస్టు అదీ ఎలాగుంటుందో చూడాలనే సరదాతోనే వెళ్లాను. అయితే సెలెక్ట్ అయిన తర్వాత సీరియస్‌గా కెరీర్ మీదనే దృష్టి పెట్టాను. రజితక్క... నటనలో మెలకువలు చెప్పింది’ అందామె.

 అమ్మానాన్నా అనుకోలేదు ‘అమ్మ దేవి గృహిణి. నాన్న పాపయ్య రిటైర్డ్ టీచర్. మమ్మల్ని నటులను చేయాలని మా పేరెంట్స్ ఎప్పుడూ అనుకోలేదు. కాని అక్కకు మాత్రం నటి కావాలనే కోరిక గట్టిగాఉండటంతో మేమంతా ఆ ఫీల్డ్‌లోకి వచ్చాం. అన్నయ్య మా సొంతూర్లోనే స్థిరపడ్డారు. ఇంట్లో చిన్నదాన్ని కావడంతో అమ్మకు ఇప్పటికీ నా మీద బెంగే. ఏదైనా షూటింగ్ లేటయ్యి టైమ్‌కి రాలేకపోతే ఫోన్ చేస్తూనే ఉంటుంది’. స్కూల్ నుంచి స్టుడియో వరకు ‘నాకు స్టేజ్ ఫియర్ అస్సలు లేదు. చిన్నప్పుడు స్కూల్లో ప్రతి ప్రోగ్రామ్‌లో డాన్స్ చేసేదాన్ని. టీచర్లు నా పేరు రాసేసుకుని తర్వాత చెప్పేవాళ్లు. అయితే అక్కడ డాన్సు చేయడానికి, ఇప్పుడు కెమెరా ముందు నటించడానికి చాలా తేడా ఉంటుంది. వేదిక మీద పెర్‌ఫామ్ చేసేటప్పుడు డాన్సుని ఎంజాయ్ చేస్తాం. కెమెరా ముందు సీన్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి’.
 
సౌందర్య ప్రభావం ఎక్కువ!
 ‘నాకు ప్రభాస్, సౌందర్యల నటన బాగా ఇష్టం. సౌందర్య నటనను అధ్యయనం చేసినట్లు చూస్తాను. ఆ ప్రభావం నా మీద తప్పకుండా ఉంటుందనిపిస్తోంది. ఈ మూడేళ్లలో ఆరు సీరియల్స్‌లో నటించాను. ఇప్పుడు ‘రాములమ్మ’ సీరియల్ చేస్తున్నాను. లీడ్ రోల్స్ చేశాను. అవకాశం వస్తే పోలీస్, సీఐడీ పాత్రల్లో నటించాలని ఉంది’.

 టీవీ రంగం ఫ్యామిలీలాంటిది!
 ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’ సినిమాలో నటించాను. నాకెందుకో టీవీ రంగమే బాగుందనిపించింది. సినిమా ఇండస్ట్రీలాగ గ్లామరస్ పోకడలు ఉండవు. స్కిన్ షో చేయాల్సిన అవసరం ఉండదు. టీవీ రంగంలోకి వచ్చే వారికి ఒక్కమాట మాత్రం కచ్చితంగా చెప్పగలను... మనం కచ్చితంగా ఉంటే మనల్ని పక్కకు తోసేసేవాళ్లుండరు. నటించాలనే కోరిక ఉన్న చాలామంది పరిశ్రమ ఎలా ఉంటుందోననే భయంతో వెనుకడుగు వేస్తుంటారు. కానీ మన పాత్ర వరకు చూసుకుని ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకపోతే ఏ సమస్యా ఉండదు. అందుకు నేనే ఉదాహరణ’.

 జీవిత భాగస్వామి!
‘నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయి నా కుటుంబానికి గౌరవం ఇచ్చి నన్ను బాగా చూసుకునే వాడై ఉండాలని కోరిక. ఇండస్ట్రీలో వ్యక్తిని చేసుకోవాలనుకోవడం లేదు. ఉద్యోగం, వ్యాపారం చేసుకునే అబ్బాయి అయితే బావుణ్ణనుకుంటున్నాను. ఏదైనా మరో రెండేళ్ల తర్వాతే’.
 

మరిన్ని వార్తలు