గిడుగును ఆడుకున్న పిడుగు

3 Dec, 2018 03:16 IST|Sakshi

సాహిత్య మరమరాలు

గురజాడ అప్పారావు తెలివిగా ఓటమిని కూడా గెలుపుగా కన్పించేట్టు చేసేవారు. గురజాడ, గిడుగు రామ్మూర్తి పంతులు చిన్నతనం నుంచి మంచి స్నేహితులు, సహచరులు. గిడుగును ఏదో విధంగా ఆట పట్టించేవారు గురజాడ.

ఒకరోజు గురజాడ, గిడుగు చెరువు కట్టమీదకు షికారుకు వెళ్లారు. అప్పుడు గురజాడ తాను ‘మేఘ మల్హర’ రాగమాలాపించి వర్షం కురిపిస్తానని పందెం కాశారు. అది వర్షాకాలం కావడాన, అంతకుముందే దట్టంగా మబ్బులు పట్టివుండటాన, గొంతు సవరించుకుంటుండగానే చినుకులు మొదలయ్యాయి. అది తనకే అమితాశ్చర్యాన్ని కలిగించింది. తాను తాన్‌సేన్‌ అంతటివాడినని పొంగిపోయారు.

అయితే ఇంకో రోజు మాత్రం యీ మంత్రం పారలేదు. గురజాడ ఎంత పాడినా మబ్బులు తన పాటను ఆలకించలేదు. అయినా గిడుగుకు టోకరా ఇవ్వడం ఎలా? ఎవరో తనకంటే గొప్ప సంగీత విద్వాంసుడు యెక్కడో బిగ్గరగా మేఘ రంజని రాగం ఆలాపిస్తుండటం వల్ల మేఘాలు అటువైపు పరుగెత్తుతున్నాయని బుకాయించారు.
- అయినాల కనకరత్నాచారి

మరిన్ని వార్తలు