తెల్లమచ్చలు తగ్గుతాయా?

10 Jan, 2017 23:31 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్‌

నా శరీరమంతా తెల్లమచ్చలు వచ్చాయి. నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. ఫలితంగా తీవ్రమైన  మానసిక వేదన కలుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. నాకు హోమియోలో పరిష్కారం చెప్పండి. – నాగేంద్రబాబు, మహబూబ్‌నగర్‌
బొల్లి వ్యాధి చర్మంపై మెలనిన్‌ కణాలు తగ్గడం వల్ల వస్తుంది. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్‌ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు.

చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్‌ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్‌ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో  మెలనిన్‌ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. టైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ తగ్గుదలకు ఈ కింది పరిస్థితులు కారణం కావచ్చు.
∙బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు.  డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్‌ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు ∙పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు ∙జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు ∙దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్‌ సమస్యలు; ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల, విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు ∙మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్‌ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది ∙కొన్ని ఎండోక్రైన్‌ గ్రంథులు స్రవించే హర్మోన్స్‌ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది ∙వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌ వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది.

లక్షణాలు : మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి.
చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్‌ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్‌ ఆల్బమ్, లాపిస్‌ అల్బా, రస్టాక్స్‌ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు.

డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్‌
డైరెక్టర్,పాజిటివ్‌ హోమియోపతి
విజయవాడ, వైజాగ్‌

మరిన్ని వార్తలు