ధీర విజయ

28 Jun, 2019 05:30 IST|Sakshi
విజయ నిర్మల

నివాళి

నటి.
తెలుగు, తమిళ, మలయాళ భాషలలో కూడా నటించింది.

దర్శకురాలు.
అక్కినేని, శివాజీ గణేశన్‌లను కూడా డైరెక్ట్‌ చేసి అత్యధిక సినిమాలు చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌పై తన సంతకం చేసింది.

సహచరి.
భర్త వేసే ప్రతి అడుగులోనూ భాగమవుతూ తన అడుగు చెరిగిపోకుండా కాపాడుకుంది.

తల్లి.
కుమారుడి వెన్నంటే ఉండి అతడి కెరీర్‌కు
వెన్నెముకలా నిలిచింది.

సంపూర్ణ స్త్రీ.
సమాజం స్ఫూర్తి పొందేలా తన జీవితాన్ని సఫలం చేసుకుంది. విజయ నిర్మల సార్థక నామధేయి. వెండితెర విజయకేతనం. అన్ని విధాల ధీర విజయ. తెలుగువారి గర్వకారణాలలో తప్పక మెదిలే ఒక గొప్ప స్త్రీ ఉనికి.

రావు బాలసరస్వతి విజయ నిర్మలకు బంధువు. బాల సరస్వతి గాయని, నటి. ఆ రోజుల్లో సూపర్‌స్టార్‌. ఏడేళ్ల వయసులో ఒక రోజు విజయ నిర్మల తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా బాలసరస్వతి వచ్చి ఆమెను ఎత్తుకొని తన ఇంటికి తీసుకెళ్లింది. తెల్లవారి లేచి చూసిన విజయ నిర్మలకు ఆశ్చర్యం. ఆ తర్వాత బాలసరస్వతి తీసుకువెళ్లిన చోటు చూశాక ఇంకా ఆశ్చర్యం. అది ఒక స్టూడియో. అక్కడ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. బాల నటి కావాలని బాల సరస్వతిని కోరితే విజయ నిర్మలను తీసుకొచ్చి నిలబెట్టింది. ఆ సినిమా పేరు ‘మచ్చరేకై’ (తమిళం). అలా వెండి తెర మీద బుజ్జిపాదాలతో అడుగులు వేసిన విజయ నిర్మల చేసిన ప్రయాణం సుదీర్ఘమైనది. ఘనమైనది కూడా.

జయ కృష్ణా ముకుందా మురారి
విజయ నిర్మలకు పన్నెండు పదమూడేళ్లు వచ్చాయి. ఆమె కుటుంబం సినిమాలకు అంతో ఇంతో సంబంధం ఉన్నదే. తల్లి  శకుంతల గృహిణే అయినా తండ్రి రామ్మోహనరావు వాహిని స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా పని చేసేవారు. బాలనటిగా గుర్తింపు పొందిన విజయ నిర్మలకు అవకాశమొస్తే దగ్గరుండి ప్రోత్సహించడానికి తండ్రి సిద్ధంగా ఉన్నారు.

విమల, విజయనిర్మల
ఆ సమయంలో తలుపు తట్టిన మంచి అవకాశమే ‘పాండురంగ మహత్య్మం’లో నటించే అవకాశం. అందులోని ‘జయ కృష్ణా ముకుందా మురారి’ పాటలో విజయ నిర్మల బాలకృష్ణునిగా నటించాలి.

‘మీనా’లో నాగరత్నమ్మ (కృష్ణ తల్లి), కృష్ణ, విజయనిర్మల

అది ఎవరి పర్యవేక్షణలో? కృష్ణుడంటే తనే అని తెలుగు ప్రజలు ఆరాధించే ఎన్టీఆర్‌ పర్యవేక్షణలో. ఎన్టీఆర్‌ విజయ నిర్మలను ఎంతో ప్రోత్సహించారు. అది చాలా పెద్ద పాట. ప్రతిరోజూ మేకప్‌ను ఆయనే సరిదిద్దడం, కళ్లచివర శంఖు చక్రాలను దిద్దడం ఆయనే చేసేవారు. కొన్నిరోజుల షూటింగ్‌ జరిగింది. ఒకరోజు షాట్‌లో విజయ నిర్మల కళ్లు తిరిగి పడిపోయారు. రామారావు షూటింగ్‌ ఆపేశారు. మూడు నాలుగు రోజుల తర్వాత ‘నా కృష్ణుడికి దిష్టి తగిలినట్టుంది’ అని పెద్ద బూడిద గుమ్మడికాయతో దిష్టితీసి మిగిలిన పాటను సెట్‌లోకి బయటివారు ఎవరూ రాకుండా షూటింగ్‌ ముగించారు. ఆ పాట తెలుగు సినిమాలలో, ఎన్టీఆర్‌ నటజీవితంలో దాంతోపాటు విజయ నిర్మల నట జీవితంలో కూడా నిలబడింది.

‘దేవదాసు’లో కృష్ణ

పిలిచిన కేరళ గాలి
తర్వాతి కాలంలో సినిమాటోగ్రాఫర్‌గా పేరు గడించిన విన్సెంట్‌ ఆ రోజుల్లో మలయాళంలో దర్శకుడిగా ఒక సినిమా తీయదలిచారు. ఆయన వాహినిలో పని చేస్తున్నప్పుడు విజయ నిర్మల తండ్రికి స్నేహితుడయ్యాడు. విజయ నిర్మలను చూసి ‘మీ అమ్మాయి కళ్లు బాగున్నాయి. నేను మలయాళంలో ఒక ఘోస్ట్‌ సినిమా తీస్తున్నాను. ఆ పాత్రకు కళ్లు చాలా ముఖ్యం. హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్‌ చేస్తాను’ అంటే తండ్రి అంగీకరించారు. అలా విజయ నిర్మల మలయాళంలో నటించిన తొలి సినిమా ‘భార్గవి నిలయం’. అది హిట్‌ అయ్యింది. ఆ తర్వాత ఆమె అక్కడ డజనుకు పైగా సినిమాలలో నటించారు. ఈలోపు బి.ఎన్‌.రెడ్డి నుంచి ‘రంగుల రాట్నం’లో నటించడానికి పిలుపు వచ్చింది.. తెలుగులో తొలిసారి హీరోయిన్‌గా. ‘రంగుల రాట్నం’ కమర్షియల్‌గా సక్సెస్‌ కాకపోయినా క్లాసిక్‌గా నిలిచి ఆమెకు పేరు తెచ్చింది.

ఎస్‌.వి. రంగారావును గెలిచింది
తెలుగులో ‘షావుకారు’ను విజయా సంస్థ తమిళంలో ‘ఎంగవీట్టు పెణ్‌’గా తీయదలిచింది. తెలుగులో లీడ్‌ రోల్‌ చేసిన షావుకారు జానకి పాత్ర తమిళంలో విజయ నిర్మలకు ఇచ్చారు. షూటింగ్‌ తొలిరోజు సెట్‌కు ఎస్‌.వి. రంగారావు వచ్చారు. విజయ నిర్మలను చూశారు. ‘ఏమిటి... ఈ అమ్మాయా నా మేనకోడలుగా చేసేది. ఏం బాగాలేదు. కె.ఆర్‌.విజయను పెట్టి తీయండి’ అని వెళ్లిపోయారు. విజయ నిర్మల చాలా అప్‌సెట్‌ అయ్యారు. చాన్స్‌ పోయినట్టే అనుకున్నారు. రెండు రోజుల తర్వాత మళ్లీ విజయా సంస్థ నుంచి పిలుపు వచ్చింది. ‘ఏమిటి... రంగారావు గారు ఒప్పుకున్నారా’ అంటే ‘కాదు.. ఆయననే మార్చేశాం. ఆయన ప్లేస్‌లో ఎస్‌.వి.సుబ్బయ్యను తీసుకున్నాం’ అని జవాబు వచ్చింది. అలా తమిళంలో అవిఘ్నంగా అడుగుపెట్టిన నటి విజయ నిర్మల. అక్కడ కూడా ఆమె దాదాపు డజను సినిమాల్లో నటించారు.

వచ్చాడు నా రాజు ఈ రోజు
ఆ తర్వాత ఆమె నట జీవితం ఎలా ఉండేదో తెలియదు. కాని బాపు–రమణలు సొంత నిర్మాణ సంస్థ మొదలెట్టి తీసిన ‘సాక్షి’ సినిమాలో కృష్ణతో కలిసి నటించడం ఆమె జీవితాన్ని మార్చింది. కృష్ణ జీవితాన్ని కూడా. వారిరువురూ గోదావరి ప్రాంతంలోని ‘మీసాల కృష్ణుడి’ గుడిలో ‘అమ్మ కడుపు చల్లగా’ పాటలో తాళి కట్టే సన్నివేశంలో నటించారు. షూటింగ్‌ ముగించి బయటకు వస్తుంటే బయటే ఉన్న నటుడు రాజబాబు ‘ఇది మీసాల కృష్ణుడి గుడి.

విజయనిర్మల, కృష్ణ

చాలా పవర్‌ఫుల్‌. ఇక్కడ ఉత్తుత్తి జంట అయినా నిజమైన జంట అయిపోతుంది’ అని జోస్యం చెప్పారు. మూడు నాలుగు నెలలో అదే నిజమైంది. ఆ సమయంలో మూడు నాలుగు సినిమాలలో నటిస్తున్న విజయ నిర్మల, కృష్ణ తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇరువురికీ అది ద్వితీయ వివాహమే. పెళ్లి విషయం కృష్ణే ప్రపోజ్‌ చేశారని విజయ నిర్మల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ పెళ్లి ఆ సమయంలో ఇండస్ట్రీలో న్యూస్‌ క్రియేట్‌ చేసినా క్రమంగా అందరూ వారి జంటను ఆదరించారు.

భర్తను డైరెక్ట్‌ చేసిన భార్య
సాధారణంగా భర్తను భార్య డైరెక్ట్‌ చేయడం కొంచెం సున్నితమైన అంశం. సెట్‌లో నటుడి కన్నా దర్శకుడిదే పై చేయి. కాని కృష్ణ, విజయ నిర్మలల మధ్య ఉండే అవగాహన, సామరస్యం, ప్రొఫెషనలిజమ్‌ అసాధారణమైనది. అందుకే ఆమె దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలలో కృష్ణ భేషజం లేకుండా, ఇగోకు పోకుండా ఎలా చెప్తే అలా చేస్తూ నటించారు. కృష్ణ సూపర్‌ డూపర్‌ హిట్స్‌లో విజయ నిర్మల దర్శకత్వం వహించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కృష్ణ చేత ‘త్రిబుల్‌ యాక్షన్‌’ చేయించి విజయ నిర్మల తీసిన ‘రక్త సంబంధం’ సినిమా సంచలనం.

కృష్ణ, విజయనిర్మల

ఉన్నది కాసేపే అయినా
ఈ సినిమాలు ఒకెత్తయితే ఉన్నది కాసేపే అయినా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా తెచ్చిన పేరు ఒక ఎత్తు. ఆ సినిమాలో సీతారామరాజు ఆత్మబంధువు సీతగా కనిపించి ఆమె పాడిన పాట ‘వస్తాడు నా రాజు ఈరోజు’ ఎంత హిట్టో అందరికీ తెలుసు. విశేషం ఏమిటంటే కృష్ణతో పెళ్లయ్యాక కూడా ‘బొమ్మలు చెప్పిన కథ’, ‘మంచి మిత్రులు’, ‘ముహూర్తబలం’ సినిమాలలో ఆయన చెల్లెలిగా విజయ నిర్మల నటించారు. ఇతర హీరోల పక్కన నటించడానికి కృష్ణ అభ్యంతర పెట్టకపోవడం వల్ల ‘బుద్ధిమంతుడు’, ‘తాతా మనవడు’, ‘బుల్లెమ్మ బుల్లోడు’ వంటి హిట్‌ సినిమాలు ఆమెకు దక్కాయి.

విజయనిర్మల, జ్యోతిలక్ష్మి

కెరీర్‌ను హుందాగా నిలబెట్టుకొని
విజయ నిర్మల అనుకుంటే ఎన్నో క్యారెక్టర్‌లను చేసి ఉండేవారు. ఎన్నో క్యారెక్టర్లు కావాలనుకుని పొందేవారు. కానీ నటిగా, దర్శకురాలిగా, గృహిణిగా, తల్లిగా తన ప్రయారిటీస్‌ని ఆమె ఎప్పుడూ గట్టిగా పట్టించుకున్నారు. వీటిని సమన్వయం చేసుకుంటూ హుందాగా తన మార్గంలో నడిచారు. ఎప్పుడూ డల్‌గా ఉండే విజయ నిర్మలను ఎవరూ చూడలేదు. ఎప్పుడూ బ్రైట్‌గా, గ్లామరస్‌గా, కృష్ణ పక్కన ఎనర్జిటిక్‌గా ఆమె కనపడేవారు. సినిమా రంగంలో ఎందరో నటీమణులకు ఆమె ధైర్యం. మార్గదర్శి. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు ఆమె ఎంతో సపోర్ట్‌ చేసేవారు.
అన్ని అవకాశాలు ఉంటే అందలం చేరడం వింత కాదు. కానీ ఒక మామూలు కుటుంబం నుంచి అంతంత మాత్రం చదువు కలిగి ఉండి ఇంత జీవితాన్ని ఇంత సమర్థంగా నడపడం కచ్చితంగా స్ఫూర్తివంతమైన అంశం.

కృష్ణతో 47 సినిమాలలో
తెలుగులో హిట్‌ పెయిర్స్‌ చాలా ఉన్నాయి. ఎన్‌.టి.ఆర్‌–జయలలిత, అక్కినేని–సావిత్రి, జమున–హరనాథ్‌... కానీ కృష్ణ–విజయ నిర్మల జోడి చేసినన్ని సినిమాలు ఎవరూ చేయలేదు. వీరిరువురూ కలిసి 47 సినిమాలలో నటించారు. ‘అత్తగారు–కొత్త కోడలు’, ‘టక్కరిదొంగ–చక్కని చుక్క’, బందిపోటు భీమన్న’, ‘అమ్మ కోసం’.. ఇలా అనేక సినిమాల్లో నటించారు. అయితే ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాలో కృష్ణతో కలిసి గుర్రపు స్వారీ చేయడం, స్టంట్స్‌లో పాల్గొనడం దేనికీ తాను తక్కువ కాదు అన్న స్థాయిలో విజయ నిర్మల చేశారు. ‘పండంటి కాపురం’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘మీనా’, ‘దేవదాసు’, ‘కురుక్షేత్రం’ ఈ సినిమాలన్నింటిలో వారి జంట రక్తి కట్టింది. ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ఆత్మాభిమానం చంపుకొని మానం అమ్ముకోవడానికి సిద్ధపడే సన్నివేశంలో విజయ నిర్మల నటన ఎన్నదగినదిగా నిలిచింది.

కృష్ణగారిని ఒంటరిని చేసి వెళ్లారని తప్ప బహుశా అభిమానులకు వేరే ఫిర్యాదులుండే అవకాశం లేదు. జీవించినంత కాలం ప్రతిభా తరంగాలను ప్రసారం చేసిన విజయ నిర్మల మరణించాక దివ్య తరంగాలతో కృష్ణగారి సమక్షంలోనే ఉంటారని ఈ అభిమానులే ఊరట చెందుతారు.
ఎందుకంటే అదే సత్యం.
ఈ బహుముఖ సమర్థురాలికి తెలుగువారి ఘన నివాళి.
– కె


 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు