శ్వేతా పత్రం

17 Oct, 2016 15:07 IST|Sakshi
శ్వేతా పత్రం

తెల్లగా ఉన్నవన్నీ పాలు కావు.
నల్లగా ఉన్నవన్నీ నీళ్లు కావు.
కానీ, తెల్లటి కాగితంపైన చిన్న మచ్చయినా కనబడుతుంది.
నిజానికి.. తెల్ల కాగితంపై ఎవరైనా మచ్చ వెయ్యొచ్చు.
శ్వేతాబసును ఒక మచ్చ వేధించింది..
తరిమింది.. కరిచింది. కానీ, ఆమె మనోధైర్యాన్ని హరించలేకపోయింది.
యస్.. షి ఈజ్ బ్యాక్. ‘సాక్షి’కి ఎక్స్‌క్లూజివ్‌గా  ఇచ్చిన శ్వేతా పత్రం ఈ ఇంటర్వ్యూ.


ఆ రోజు ఏం జరిగింది ...?

రెండేళ్ల క్రితం శ్వేతాబసు ప్రసాద్‌ను ఓ స్టార్ హోటల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎర్రమంజిల్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆమెను రెస్క్యూ హోమ్‌కి తరలించాలని ఎర్రమంజిల్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను పరిశీలించిన నాంపల్లి కోర్టు శ్వేతాకు క్లీన్ చీట్ ఇచ్చింది. కేసును కొట్టివేస్తూ రెస్క్యూ హోమ్ నుంచి విడుదల చేయాలని ఉత్తర్వ్యులు ఇచ్చింది. నిజానికి ‘సంతోషం’ సినీవార పత్రిక అవార్డుల వేడుకలో పాల్గొనడానికి శ్వేత హైదరాబాద్ వచ్చారు. ఇక్కడి స్టార్ హోటల్‌లో బస చేశారామె. అవార్డు ప్రదానోత్సవం పూర్తి కాగానే ముంబై వెళ్లిపోవాలనుకున్నారు. కానీ, శ్వేత ఫ్లైట్ మిస్ అయ్యారు. దాంతో హోటల్‌లోనే ఉండిపోయారు. ఆ సమయంలో హోటల్‌పై పోలీసులు దాడి చేయడం, అరెస్ట్ చేయడం జరిగాయి.

రెండేళ్ల క్రితం మీ జీవితంలో జరిగిన ఆ సంఘటన ఇంకా వెంటాడుతోంది. ప్రాస్టిట్యూషన్ కేసులో ఏ నటి పట్టుబడినా కొందరు ఉదాహరణగా మీ పేరు లాగడం గురించి?

శ్వేతాబసు ప్రసాద్ : నాకు సంబంధం లేని విషయాల్లో కూడా నా పేరుని లాగుతున్నారంటే నేను పాపులర్ అని అర్థం. నా పేరు స్పెల్లింగ్ బాగుందనీ, నా ఫొటోలు బాగున్నాయనీ అర్థం (నవ్వేస్తూ). నన్ను ఎగ్జాంపుల్‌గా తీసుకునే వాళ్ల గురించి వదిలేద్దాం. మీడియా నాకు సపోర్ట్‌గానే ఉంది. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు ‘కంగ్రాట్స్’ అంటుంటారు. నా మంచి కోరుకునే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. నాకు వాళ్లు చాలు. ఎవరేం మాట్లాడుకున్నా పట్టించుకోను. అయినా మాట్లాడేవాళ్ల నోళ్లు మూయించలేం. ఎవరి సంస్కారం వాళ్లది.

      
చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా సక్సెస్ అయ్యారు. పర్సనల్‌గా మధ్యలో కొన్ని సమస్యలు. ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది?

సమస్యలు కామన్ అండి. సెలబ్రిటీల జీవితంలో తప్పవు. నా లైఫ్‌లో ఇప్పటివరకూ నేను ఎదుర్కొన్న సమస్యలన్నీ నా సక్సెస్‌కి దిష్టిలా భావిస్తున్నాను. చిన్న వయసులోనే పెద్ద పెద్ద విజయాలు చూశాను. ఆ విజయాల ముందు నేను ఎదుర్కొన్న సమస్యలు చాలా చిన్నవి. ఇప్పుడు లైఫ్ అంటారా.. చాలా ప్రశాంతంగా ఉంది. వెరీ కూల్.

      
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘మక్డీ’, ‘ఇక్బాల్’ మాత్రమే చేశారు. ఎందుకని?


‘మక్డీ’ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. చదువు పాడవుతుందని అమ్మా నాన్న వద్దన్నారు. ‘ఇక్బాల్’కి సుభాష్ ఘయ్ నిర్మాత. అంత పెద్ద నిర్మాత అడగడంతో కాదనలేదు. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. కొంతమంది పేరెంట్స్ డబ్బులు కోసం ఆలోచించి, సినిమాలు ఒప్పుకుంటారు. మా అమ్మానాన్న అలా కాదు. అందుకే ‘ఇక్బాల్’ తర్వాత సినిమాలు చేయనివ్వలేదు. నా బాల్యం సో స్వీట్. స్కూల్లో మంచి మార్కులొచ్చేవి. ఆర్టిస్ట్‌గా మంచి పేరొచ్చింది. నాది మంచి ఫ్యామిలీ. ఇన్ని తియ్యని విషయాలున్నాయి. పెద్దయ్యాక చిన్న చేదు అనుభవం. ఇప్పుడు చేస్తున్న ‘మిక్సర్ పొట్లం’ సినిమా టైటిల్ నా లైఫ్‌కి వర్తిస్తుంది. నా లైఫ్‌లో టూ మచ్ స్వీట్, చిన్నపాటి కారం ఉంది. నో ప్రాబ్లమ్.

      
ఇక్కడొచ్చిన సమస్య ఏంటంటే.. స్వీట్ గురించి కాకుండా హాట్ గురించే పదే పదే మాట్లాడతారు...

అది నా సమస్య కాదు. ‘మీరిలా మాట్లాడొద్దు’ అని నేనెవరితోనూ అనలేను. అలా చెప్పాలంటే ఎంతమందికి చెప్పాలి? అయినా ఎందుకు చెప్పాలి? మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది కదా. మాట్లాడనివ్వండి. ఆ సంగతి పక్కన పెడితే.. నా గురించి మంచి విషయాలు మాట్లాడేవాళ్లూ ఉన్నారు. ఏదైనా కాంట్రవర్శీ వచ్చినప్పుడు దాన్ని ఫోకస్ చేసిన మీడియా ఆ తర్వాత నా గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడింది. ఇలా మంచి విషయాలు మాట్లాడేవాళ్లూ ఉన్నారు. అది చాలు.

 
మీ మాటల్లో  పరిణతి కనిపిస్తోంది.. ఎదుర్కొన్న చేదు అనుభవాలే దానికి కారణమా?

మీకో విషయం చెబుతా. నా జీవితంలో జరగకూడనిది జరిగినప్పుడు నా కంటి నుంచి ఒక్క చుక్క కూడా రాలేదు. నాకు ఏడవడం అంటే ఇష్టం ఉండదు. న్యాయస్థానం గురించి ఓ విషయం చెబుతాను. ఇండియాలో ఏ కేసుకైనా తీర్పు దొరకాలంటే ఏళ్లు పడుతుంది. కానీ, నిందితురాలిగా ముద్రపడి, నేను న్యాయస్థానం ముందుకొచ్చిన రెండే వారాల్లో నాకు ‘క్లీన్ చిట్’ ఇచ్చారు. కోర్ట్ క్లీన్ చిట్ ఇవ్వగానే.. నాకు మొదట శుభాకాంక్షలు చెప్పింది హైదరాబాద్ పోలీసే. న్యాయస్థానమే తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకా ఆ విషయం గురించి ఏదేదో మాట్లాడుతున్నవాళ్లను ‘ఫూలిష్’ అనడం మినహా నేనేం చేయలేను. అంతా జరిగి రెండేళ్లయింది. ఇంకా ఎందుకు? మళ్లీ మళ్లీ మాట్లాడుకోవడంలో అర్థం లేదు.

 
గడచిన మూడేళ్లల్లో తెలుగులో కనిపించలేదు. ఈ గ్యాప్‌లో ఏం చేశారు?

మా్‌స్ కమ్యూనికేషన్ కోర్స్ చేశా. ఇప్పుడు నేను క్వాలిఫైడ్ జర్నలిస్ట్‌ని (నవ్వుతూ). ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం మీద ‘రూట్స్’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీశా. ‘ఇంటీరియర్ కేఫ్ నైట్’ పేరుతో ఓ షార్ట్ ఫిలిం నిర్మించి, యాక్ట్ చేశాను. నసీరుద్దిన్ షా కూడా నటించారు. ఆల్రెడీ ఆన్‌లైన్‌లో ఈ షార్ట్ ఫిలింకి 1 మిలియన్ హిట్స్ దాటాయి. ధర్మ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ ప్రారంభించిన ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’లో నటిస్తున్నాను. ఈ మూడేళ్లల్లో నేను తెలుగు స్క్రీన్ మీద కనిపించలేదు కానీ బిజీగానే ఉన్నాను. కొంచెం ఫ్రీ అవుతున్న సమయంలో దర్శకుడు సతీష్ కలసి ‘మిక్చర్ పొట్లం’ కథ చెప్పారు. తెలుగుకి మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందని ఒప్పుకున్నాను.

      
కమ్‌బ్యాక్‌కి మంచి మూవీ అవుతుందని అనిపించడానికి కారణం?

ఇందులో నేను ట్రావెల్స్ బిజినెస్ చేస్తాను. ఒక బస్సు ఉంటుంది. షిర్డీ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లే బస్సు. అందులో భిన్న మనస్తత్వాలున్న వ్యక్తులుంటారు. మిక్చర్ అంటేనే చాలా ఐటమ్స్ ఉంటాయని అర్థం. ఈ సినిమాలో అన్ని రకాల ప్రేక్షకులకూ కావల్సినవి ఉన్నాయి. అందుకే కమ్ బ్యాక్‌కి మంచి మూవీ అవుతుందనుకున్నా.

      
షిర్డీ నుంచి మొదలయ్యే బస్సు అన్నారు.. అంతకుముందెప్పుడైనా మీరు షిర్డీ వెళ్లారా.. దైవభక్తి ఉందా?

నేను పుట్టింది బిహార్‌లో అయినా చదువుకున్నదీ, ఉంటున్నదీ ముంబైలోనే. షిర్డీ ఎలానూ దగ్గర కాబట్టి మా అమ్మానాన్నతో కలసి చాలాసార్లు వెళ్లాను. అక్కడికెళ్లగానే ప్రశాంతంగా అనిపిస్తుంది.

 
‘కొత్త బంగారు లోకం’లో బబ్లీగా ఉండేవారు. ఇప్పుడిలా సన్నగా అయిపోయారేంటి?

ఆ సినిమా చేసినప్పుడు నేను టీనేజ్ పాపని (నవ్వుతూ). నా వయసప్పుడు 18. ఇప్పుడు 25. ఏజ్ పెరిగేకొద్దీ బేబీ ఫ్యాట్ పోతుంది. టీనేజ్ ఫ్యాట్ అంతా పోయిన తర్వాత ఫిజిక్ మెయిన్‌టైన్ చేయడానికి ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను. నాకు జిమ్ అంటే ఇష్టం ఉండదు. అందుకే యోగా చేయడం మొదలుపెట్టాను. రోజూ 30 సూర్య నమస్కారాలు చేస్తాను. మజిల్స్ రిలాక్సేషన్ కోసం కొంతమంది మసాజులు చేయించుకుంటారు. ఎవరిష్టం వాళ్లది కాబట్టి, నేనెవర్నీ తప్పుబట్టడంలేదు. కానీ, ఎప్పుడో వారానికో లేక పది రోజులకో చేయించుకునే మసాజులకన్నా డైలీ యోగా చేయడం బెటర్ అని నేనంటాను. యోగాకి కూడా మజిల్స్‌ని రిలాక్స్ చేసే పవర్ ఉంది. ఫిజికల్‌గా, మెంటల్‌గా బాగుంటుంది.

తెలుగులో ఒక సినిమా, హిందీలో ఒకటి చేస్త్తూనే, ‘చంద్ర నందిని’ అనే హిందీ టీవీ సీరియల్ చేస్తున్నారు... కారణం?

అది మంచి హిస్టారికల్ సీరియల్. బాలాజీ టెలీఫిలింస్ ఏక్తా కపూర్ నిర్మాత. ఈ సంస్థకు ఇంతకు ముందు కూడా సీరియల్స్ చేశా. ఇందులో నేను వారియర్ ప్రిన్సెస్‌ని.  చాలెంజింగ్ రోల్. అందుకే ఒప్పుకున్నా. ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధం నేర్చుకున్నాను. ముంబైలో సినిమా, టీవీ, వెబ్ సిరీస్ అనే తేడా ఉండదు. అందరూ అన్నీ చేస్తారు. అది అడ్వాంటేజ్. పైగా ఇది రెగ్యులర్ అత్తా-కోడళ్ల గొడవలతో సాగే సీరియల్ కాదు. తెలుగులో ‘సూపర్ 2’ షో కూడా చేశాను. యాజ్ యాన్ యాక్టర్ మంచి ప్రాజెక్ట్ ఏది వచ్చినా చేస్తాను.  

ఫైనల్లీ.. లవ్‌లో ఉన్నారట.. ఆ లైఫ్ గురించి చెబుతారా?

సారీ అండి.. అది మాత్రం చెప్పలేను.  
 
పెళ్లి?

టూ ఎర్లీ. ఇప్పట్లో ప్లాన్స్ లేవు. ఓన్లీ కెరీర్ మీదే దృష్టి పెట్టాను.

కవితలు రాస్తాను!

నాకు రైటింగ్ అంటే ఇష్టం. సీతాకోక చిలుకను చూసినప్పుడో, పచ్చని చెట్టు కనిపించినప్పుడో, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి తారస పడినప్పుడో కవిత వచ్చేస్తుంది. ఇప్పటివరకూ చాలా రాశా. రాస్తూనే ఉంటా. భవిష్యత్తులో ఆ కవితలతో పుస్తకం వేస్తానేమో.

గ్రేట్‌ఫుల్ టు మై పేరెంట్స్

మంచి అమ్మానాన్నలకు కూతురిని కావడం నా లక్. ‘ఇక్బాల్’ తర్వాత ‘ట్రాఫిక్ సిగ్నల్’, ‘హల్లా భోల్’ ఇలా బోల్డన్ని సినిమాలకు అవకాశం వచ్చింది. డబ్బు కోసం అవన్నీ ఒప్పుకుని ఉండొచ్చు. కానీ, మా అమ్మానాన్న నన్ను డబ్బు సంపాదించే మెషిన్‌లా చూడలేదు. నా చదువు కోసం, నా బాల్యాన్ని నేను సంతోషంగా అనుభవించడం కోసం సినిమాలు వద్దన్నారు. ఐయామ్ గ్రేట్‌ఫుల్ టు మై పేరంట్స్. ‘కొత్త బంగారు లోకం’ కథ విన్నప్పుడు ‘హీరోయిన్‌గా ఇలాంటి సినిమాతోనే పరిచయం కావాలి’ అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలన్నారు. అమ్మానాన్నలు చెప్పినట్లే చేశాను.

 - డి.జి. భవాని

మరిన్ని వార్తలు