క్రాంతిమయ పర్వదినమే సంక్రాంతి

14 Jan, 2018 00:28 IST|Sakshi

తెలుగు సంస్కృతి వివిధ రూపాల్లో ప్రత్యక్షమయ్యే గొప్ప క్రాంతిమయ పర్వదినం సంక్రాంతి. తెలుగువారు ఉత్సాహంగా, ఉల్లాసంగా, సరస విన్యాసాలతో జరుపుకొనే సజీవ చైతన్యమే ఈ సంక్రాంతి. మన కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా పొరపొచ్ఛాలు, భేదాభిప్రాయాలు ఉంటే అవి తొలగిపోయి అందరూ కలిసి మెలిసి జరుపుకునే పర్వదినాలే పండగలు. ‘సంక్రాంతి’ అనడం లో ‘‘సం’’ అంటే మిక్కిలి ‘‘క్రాంతి’’ అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కనుక దీనిని ‘సంక్రాంతి’ గా పెద్దలు వివరణ చెబుతూ ఉంటారు. అన్నదాతలు సంవత్సరమంతా కష్టపడి చేసిన వ్యవసాయ ఫలితం ధాన్యలక్ష్మి రూపంలో ఇళ్ళకు చేరి, తద్వారా ధనలక్ష్మి నట్టింట కొలువుదీరే పండుగ మన సంక్రాంతి పండుగ. ఆనందాన్ని మనసునిండా నింపుకొని, అనురాగ బంధాల మధ్య ఎంతో శ్రద్ధగా ఈ పండుగ జరుపుకొంటారు. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే చేరటం అని అర్ధం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం. మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలం ఉత్తరాయణ ం. మానసికమైన అర్చనకు, ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలం దక్షిణాయణం. పన్నెండు నెలలలో ఆరు నెలల దక్షిణాయణం దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకుని ఉండే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. అందువల్ల ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని  నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. అంతటి మహత్తరమైన పర్వదినం మకర సంక్రాంతి లేక పెద్ద పండుగ. ఈ పండగను భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణాలలోనే కాక, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిషా, పంజాబ్, గుజరాత్‌ మొదలగు రాష్ట్రాలలో కూడా పాటిస్తారు. మనకు వచ్చే పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌర గమనాన్ని అనుసరించి పాటించే పండుగ.

మనం సంక్రాంతి అని పిల్చుకుంటే మహారాï్రÙ్టయులు, గుజరాతీలు మకర సంక్రాంతి అంటారు. తమిళులు పొంగల్‌ అని పిలిస్తే పంజాబీలు లోరీ అంటారు. ఉత్తరాయణంలో సూర్యుని గమనం ఉత్తరముఖంగా మారడంతో పగటికాలం క్రమంగా పెరుగుతూ వస్తుంది. సూర్యరశ్మి క్రిమి సంహారిణి. అది అందరికీ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అయితే సూర్యుని కిరణాలు ఎక్కువగా సోకినా మంచిదికాదు. ఎందుకంటే సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాలు చర్మవ్యాధులను, చర్మ సంబంధ క్యాన్సర్‌ను ఇతర రుగ్మతలను కలిగిస్తాయి. తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు వరుసగా వచ్చే కాలం ఇదే! ముఖ్యంగా మధ్య దినమైన రోజును ‘సంక్రాంతి’ అని పిలుచుకుంటాం. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగ పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహప్రాంగణాలతో, ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. పుష్యం అంటేనే పోషణ శక్తి గలదని అర్థం. స్నానం దానం, పూజ అనే మూడు విధులు ఈ దినాలలో నిర్వర్తించాలి. సూర్యుడు హిందువులకు ప్రత్యక్ష దైవం. కాలచక్రానికి అనుగుణంగా సంచరిస్తూ ఉండే దేవతా స్వరూపం. ఉత్తరాయణంలో సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశి లోకి రావడమే మకర సంక్రమణం. అదే మకర సంక్రాంతి. సూర్యోదయానికి ముందే నువ్వులపిండితో శరీరానికి నలుగు పెట్టి తలంటి స్నానం చేయాలి. జాతకంలో శని వల్లే కష్టాలు కలుగుతాయి. ఆయనను శాంతింప చేయాలంటే నువ్వులు దానమివ్వాలి. వాతావరణ పరంగా చూస్తే మంచు కురిసే హేమంత ఋతువు, శీతకాల బాధలు నివారించుకోవడానికి స్నానజలంలో నువ్వులు కలపడం, నువ్వులు తినడం, తిలలతో దైవ పూజ అనేవి ఆచరించే విధులు. ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు మంచి చేస్తాయి.  సంక్రాంతి రోజున పాలు పొంగించి మిఠాయిలు తయారు చేస్తారు. అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాలతాలుకలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయి న వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదలడం ఆచారం. 

మహిళలు ఎంతో అందంగా రంగవల్లులు తీర్చిదిద్దే రోజు సంక్రాంతి. దానికి ఆరోగ్య రీత్యా, ఖగోళ శాస్త్ర రీత్యా ఎంతో ప్రాముఖ్యం ఉందని పెద్దలు చెప్తారు. రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతంగా భావిస్తే, ఒక పద్దతిలో పెట్టే చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం గా చెప్తారు. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యుని స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితిశక్తికి (స్టాటిక్‌ ఫోర్స్‌) చుక్కలు గతిశక్తి (డైనమిక్‌ ఫోర్స్‌) కు సంకేతాలనీ.. శ్రీచక్ర సమర్పణా ప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు. మన నేటి మహిళ లు కాంక్రీట్‌ జంగిల్స్‌లో నివసిస్తూ రంగవల్లుల సంస్కృతిని మరచిపోకుండా రంగవల్లుల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు.

సంక్రాంతి నాడు దేవతలకూ, పితృ దేవతలకూ ఏయే పదార్థాలను దానం చేస్తామో అవి అత్యధికంగా జన్మజన్మలకి సిద్ధిస్తాయని నమ్మకం. మగపిల్లలు పతంగులు (గాలి పటాలు) ఎగురవేసి ఆనందిస్తారు. ఇంటి ఆచారం ప్రకారం స్త్రీలు సావిత్రీ వ్రతం లాంటి నోములను నోచుకుంటారు. దీనివల్ల కుటుంబసౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, సౌభాగ్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇరుగు పొరుగులను పిలిచి పండు తాంబూలాలను, నువ్వుండలను ఇచ్చి పెద్దల దగ్గర ఆశీర్వాదాలను తీసుకొంటారు. కొందరు సంక్రాంతి నాడు రాముని పూజచేస్తారు. రామునిలాగా ధర్మమార్గంలో నడవడానికి శక్తి కలగాలని రామాయణాన్నీ పఠిస్తారు. 

బలిచక్రవర్తికి ఉన్న త్యాగగుణం అలవడాలన్న కోరికతో వామన పురాణాన్ని కూడా వింటారు. తెలంగాణ అంతా నువ్వుల ఉండలను చేసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇవే కాక ఈరోజున కూష్మాండం, కంబళి, ధాన్యాదులు, లోహాలు, తిలలు, వస్త్రాలు, తైలదీప దానాలు చేస్తే మంచిదని శాస్త్ర వచనం. బూడిద గుమ్మడి కాయను దానంచేసిన వారికి భూదానం చేసిన ఫలం వస్తుంది. పెరుగును దానం చేయడం వల్ల అనారోగ్య బాధలు తీరుతాయి. బుద్ధి వికాసం కలుగుతుంది. సంక్రాంతికి కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువును తీర్చి పేరంటాలూ చేస్తారు. ఇళ్ళలో బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకి భోగి పళ్ళు దిష్టి తీయడం వంటి ఆచారాలు సంబరాన్ని తెస్తాయి. పన్నెండు సంవత్సరాలు బాలునిగా, వీర పద్మాసన భంగిమలో కూర్చుని, కుడిచేతిని చిన్ముద్రగా చేసుకుని ఆ కొండమీద వెలిసిన హరిహర పుత్రుడు స్వామి అయ్యప్పను ఉద్దేశించి దీక్షాధారణ చేసిన అయ్యప్పలందరూ శబరిమలై చేరి మకరవిళక్కును నిర్వర్తించి మకరజ్యోతి దర్శనం చేసుకోవడం సంక్రాంతి పండుగ ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతలకు, ఇంత విశిష్టతకు కారణం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడమే కాబట్టి, ఆయనకు కృతజ్ఞతా సూచకంగా సంక్రాంతినాడు సూర్యభగవానుడిని పూజిస్తారు. శ్రద్ధాభక్తులతో ఆదిత్యహృదయాన్ని పారాయణ చేస్తారు.  

మరిన్ని వార్తలు