Shanya Gill: పన్నెండు సంవత్సరాల వయసులోనే ఫైర్‌–డిటెక్షన్‌ డివైజ్‌ ఆవిష్కరణ

14 Nov, 2023 01:13 IST|Sakshi

శాస్త్రం

సైన్స్‌ పాఠాలను కూడా చందమామ కథల్లా ఆసక్తిగా వింటుంది శణ్య గిల్‌. ఆ ఆసక్తి వృథా పోలేదు. చిన్నవయసులోనే ఆవిష్కర్తను చేసింది. థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ జూనియర్‌ ఇన్వెంటర్స్‌ ఛాలెంజ్‌–2023లో పన్నెండు సంవత్సరాల శణ్య గిల్‌ తయారు చేసిన ఫైర్‌–డిటెక్షన్‌ డివైజ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది...

కాలిఫోర్నియా(యూఎస్‌)లో సిక్త్స్‌–గ్రేడ్‌ చదువుతుంది శణ్య. సైన్స్, సైంటిస్ట్‌లు తనకు బాగా ఇష్టం. సైన్స్‌లో కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవడం అంటే ఆసక్తి. శణ్య గిల్‌ ఇంటికి సమీపంలోని ఒక రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరిగి భారీ నష్టం సంభవించింది. ఇంటా బయటా ఈ ప్రమాదానికి సంబంధించిన రకరకాల మాటలు ఎక్కడో ఒక చోట వినేది శణ్య గిల్‌.
అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఒక పరికరం తయారు చేయాలనుకుంది. రకరకాల ప్రయోగాలు చేసింది.

ఆ ప్రయోగాలు వృథా పోలేదు. కంప్యూటర్‌కు అనుసంధానించిన థర్మల్‌ కెమెరాను ఉపయోగించి సమర్థవంతమైన ఫైర్‌–డిటెక్షన్‌ సిస్టమ్‌ను రూపొందించింది శణ్య. శణ్య తయారు చేసిన ఫైర్‌–డిటెక్షన్‌ డివైజ్‌ సాధారణ సంప్రదాయ స్మోక్‌ డిటెక్టర్‌ కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. నష్టం జరగకుండా అప్రమత్తం చేస్తుంది. ‘రెస్టారెంట్‌ అగ్నిప్రమాదం ప్రభావంతో అమ్మ రకరకాలుగా భయపడేది. కిచెన్‌లోని స్టవ్‌ ఆఫ్‌ అయిందో లేదో అమ్మ ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసేది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది. మరోవైపు ఎక్కడ చూసినా ఆ అగ్నిప్రమాదానికి సంబంధించే మాట్లాడుకునేవారు. ఇదంతా చూసిన తరువాత అగ్నిప్రమాదాలను నివారించే పరికరాన్ని తయారు చేయాలనుకున్నాను. నేను తయారు చేసిన ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌ ద్వారా ఎంతో మందిని అగ్నిప్రమాదాల బారిన పడకుండా కాపాడవచ్చు’ అంటుంది శణ్య గిల్‌. శణ్యకు సైన్స్‌తోపాటు ఆటలు, క్రాఫ్టింగ్, కోడింగ్‌ అంటే ఇష్టం. జూనియర్‌లకు పాఠాలు చెప్పడం అంటే ఇష్టం. బయో మెడికల్‌ ఇంజనీర్‌ కావాలనేది శణ్య గిల్‌ లక్ష్యం.

మరిన్ని వార్తలు