రేపొక్క రోజే ఏడు రోజులు

20 Jun, 2020 07:52 IST|Sakshi

ఇండిపెండెన్స్‌ డే.. రిపబ్లిక్‌ డే...దేశం ఇంకా ఏదైనా సాధిస్తే ఆ డే..ఇవీ మనకు దినోత్సవాలు.తిథుల్ని బట్టి పండుగలూ ఉంటాయి.‘థీమ్‌’ పాటింపు ‘డే’లు.. కొత్తవి.మంచి ఎక్కడున్నా తీసుకోవలసిందే.రేపొక్క రోజే ఏడు ‘డే’ లున్నాయి.‘డూమ్స్‌డే’ అని కూడా అంటున్నారు.దాన్నొదిలేసిమిగతా ‘డే’లను స్వాగతిద్దాం

యోగా డే (ఒక్క ఆసనమైనా నేర్చుకుందాం)
భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచనపై ఐక్యరాజ్యసమితి జూన్‌ 21ని ‘అంతర్జాతీయ యోగా దినం’గా గుర్తించింది. 2015 నుంచి యోగా డేను జరుపుకుంటున్నాం. ఈ రోజును సూచించినది కూడా మోదీనే. ఏడాది మొత్తం మీద పగటిపూట ఎక్కువగా ఉండే జూన్‌ 20–21–22.. ఈ మూడు రోజుల మధ్య రోజైన 21న యోగా డేకి మోదీ ఎంపిక చేశారు.

మ్యూజిక్‌ డే (ఒక మంచి పాట విందాం)
వరల్డ్‌ మ్యూజిక్‌ డే తొలిసారి పారిస్‌లో 1982 జూన్‌ 21న జరిగింది. ఆ తర్వాతి నుంచి ఇండియా సహా 120 దేశాలు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఔత్సాహిక, ఉద్ధండ సంగీతకారులను సత్కరించుకోవడం ఈ డే ఉద్దేశం. ఫ్రెంచి సాంస్కృతిక శాఖ మంత్రి జాక్‌ లాంగ్, ఫ్రెంచి సంగీతకారుడు ఫ్లు హెమోవిస్‌ కలిసి మ్యూజిక్‌ డే నెలకొల్పారు.

వరల్డ్‌ హ్యూమనిస్డ్‌ డే (సాటి మనిషికి చేయూతనిద్దాం)
హ్యూమనిస్ట్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ‘వరల్డ్‌ హ్యూమనిస్డ్‌ డే’  ప్రారంభించింది. మానవత్వమే జీవిత పరమార్థం అనే తాత్విక భావనను వ్యాప్తి చేయడానికి ప్రపంచ దేశాలలోని అనేక మానవ హక్కుల సంస్థలు చేతులు కలపడంతో హ్యూమనిస్ట్‌ డే ఆవిర్భవించింది. 1980ల నుంచి ఒక పరిణామక్రమంలో ఈ ‘డే’ జరుగుతూ వచ్చిందే కానీ, కచ్చితంగా ఫలానా సంవత్సరం నుంచి ప్రారంభం అయిందని చెప్పడానికి తగిన ఆధారాల్లేవు. అయితే జూన్‌ 21 అందుకు ఫిక్స్‌ అయింది.

హ్యాండ్‌ షేక్‌ డే(విశ్వంతోకరచాలనంచేద్దాం)
ఇది ఈ ఏడాది గానీ, మరికొన్నేళ పాటు గానీ ఈ ‘డే’ జరిగే అవకాశాలు లేవు. కరోనాతో భౌతిక దూరం తప్పని సరైంది కనుక ఈ ‘వరల్డ్‌ హ్యాండ్‌షేక్‌ డే’ కి తాత్కాలికంగా కాలం చెల్లినట్లే. నిజాకిది  చేతులు చేతులు కలిపే హ్యాండ్‌షేక్‌ డే గా మొదలవలేదు. సముద్రపు నీళ్లలో చెయ్యి పెట్టి, చేతిని కదిలిస్తూ ప్రపంచమంతటికీ షేక్‌హ్యాండ్‌ ఇచ్చినట్లుగా అనుభూతి చెందడంతో ప్రారంభం అయింది. ఇవాన్‌ జుపా అనే ఒక అలౌకిక చింతనాపరునికి కలిగిన ఆలోచన నుంచి సముద్రానికి హ్యాండ్‌షేక్‌ ఇవ్వడం అనే ఆధ్యాత్మిక భావన అంకురించిందని అంటారు. ఏటా జూన్‌ 21న ఈ డే ని జరుపుకుంటున్నారు.

ఫాదర్స్‌ డే (నాన్న దీవెనలు కోరుకుందాం)
తేదీ ఏదైనా గానీ మదర్స్‌ డే మే రెండో ఆదివారం వస్తే, ఫాదర్స్‌ డే జూన్‌ మూడో ఆదివారం వస్తుంది. ఈ ఏడాది ఫాదర్స్‌ డే జూన్‌ 21న వచ్చింది. కుటుంబం పాటు పడుతుండే తండ్రిని గౌరవించుకోవడం కోసం ప్రపంచం ఆయనకొక రోజును కేటాయించింది. జూన్‌ మూడో వారమే ఫాదర్స్‌ డే ఎందుకు? ఆ ‘డే’న గుర్తిస్తూ ప్రభుత్వ సంతకాలు అయిన రోజది. మదర్స్‌ డే కూడా అంతే.

హైడ్రోగ్రఫీ డే (నీటికి నమస్కరిద్దాం)
హైడ్రోగ్రఫీ అంటే జల వనరుల భౌతిక స్వరూపాల, కొలమానాల విజ్ఞాన శాస్త్రం. నదులు, సముద్రాలు, మహా సముద్రాలు, సరస్సులు, ఇతర జలాశయాలను అన్ని రంగాల ఆర్థికాభివృద్ధికి హైడ్రోగ్రఫీ తోడ్పడుతుంది. ‘ఇంటర్నేషనల్‌ హైడ్రోగ్రఫిక్‌ ఆర్గనైజేషన్‌’ ఐక్యరాజ్య సమితి గుర్తింపుతో 2005 నుంచి జూన్‌ 21న ‘వరల్డ్‌ హైడ్రాలజీ డే’ ని నిర్వహిస్తోంది.

టీ షర్ట్‌ డే (ట్రెండేమిటో తెలుసుకుందాం)
సాధారణంగా ‘డే’లన్నీ యు.ఎస్‌. నుంచి ప్రపంచానికి విస్తరిస్తాయి. టీ షర్ట్‌ డే మాత్రం జర్మనీలో మొదలైంది. తొలిసారి బెర్లిన్‌లో 2008లో ఇంటర్నేషనల్‌ టీ షర్ట్‌ డే జరిగింది. జర్మనీలోని ఫ్యాషన్‌ దుస్తుల ఉత్పత్తిదారులు వ్యాపారం కోసం టీ షర్ట్‌ డేని ఏర్పరిచారు తప్ప ఇందులో సంఘహితం ఏమీలేదు. అయితే వ్యక్తి సౌలభ్యం ఉంది. ధరించడానికి సులువుగా ఉండటం, ఒక స్టెయిల్‌ స్టేట్‌మెంట్‌ అవడంతో యూత్‌ ఎక్కువగా ఈ ‘డే’ని ఫాలో అవుతుంటారు. ఫాలో అవడమే సెలబ్రేషన్‌. జూన్‌ 21న దీనినొక ఉత్సవంలా కొన్నిదేశాలలో నిర్వహిస్తారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా