Khushi Pandey: ఖుషీతో దిల్‌ ఖుష్‌

9 Nov, 2023 00:44 IST|Sakshi

చిన్నతనంలో తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదని వారికి నొప్పి తెలియకుండా ఎంతో కష్టపడి పెంచుతారు తల్లిదండ్రులు. అయితే లక్నోకు చెందిన ఖుషీ అందుకు భిన్నం. తన తండ్రిలా మరెవరూ కష్టపడకూడదని తానే ఓ సామాజిక కార్యకర్తగా మారి సాటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది ఖుషీ పాండే.

లక్నోకు చెందిన 23 ఏళ్ల ఖుషీ పాండే బాల్యం ఉన్నావ్‌ అనే ఊళ్లో గడిచింది. తన తండ్రి నుంచి చిన్ననాటి విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుంది. ఖుషీ తండ్రికి బాగా చదువుకోవాలని ఉండేది. కానీ పెన్సిల్‌ కొనే స్థోమత కూడా లేదప్పుడు. ఈ విషయం తెలుసుకుని,∙నాన్నలా మరెవరూ చదువుకోసం ఇబ్బంది పడకూడదు అనుకుంది. నిరుపేదలకు సాయం చేయాలని చిన్నప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది.

ఖుషీ పెద్దయ్యేసరికి నాన్న వాళ్ల లక్నోకి మకాం మార్చారు. అక్కడ ఓ షాపులో పనిచేస్తూ తరువాత కాంట్రాక్టర్‌గా మారారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా రావడంతో ఖుషీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీంతో ఖుషీ ‘లా’ పూర్తయ్యాక, సోషల్‌ వర్క్‌లో పీజీ చేసింది. చదువు పూర్తయ్యాక వెంటనే నిరుపేదలకు చదువు చెప్పడం ప్రారంభించింది. మురికివాడల్లోని పిల్లలను ఒక చెట్టుకింద కూర్చోబెట్టి సాయంత్రం రెండుమూడు గంటలు చదువు చెప్పేది. రోజుకి యాభై మంది వరకు ఖుషీ క్లాసులకు హాజరయ్యేవారు. తన దగ్గరకు వచ్చే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతోపాటు, వారి తల్లిదండ్రులకు చదువు ప్రాముఖ్యతను వివరిస్తోంది.

తాతయ్య మరణంతో...
అది 2020 ... ఒకరోజు రాత్రి ఖుషీ వాళ్ల తాతయ్య షాపు నుంచి తిరిగి వస్తున్నారు. చీకట్లో సరిగా కనిపించక ఎదురుగా వచ్చే కారు తాతయ్య సైకిల్‌ని ఢీ కొట్టడంతో ఖుషీ తాతగారు అక్కడికక్కడే చనిపోయారు. తాతయ్యను ఎంతో ఇష్టపడే ఖుషీ ఈ చేదు సంఘటనను తట్టుకోలేకపోయింది. సైకిల్‌కు లైట్‌ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు అనుకుని ప్రతి సైకిల్‌కు లైటు ఉండాలాని భావించింది. రోజూ కూలి పనిచేసుకునేవారు తమ సైకిళ్లకు లైట్లు పెట్టుకోవడానికి తగ్గ స్థోమత ఉండేది కాదు.

దాంతో వాళ్లకు ఒక్కొక్కరికి 350 రూపాయల ఖరీదు చేసే లైట్లను ఉచితంగా పంచింది. ఇలా ఇప్పటిదాకా 1500 మంది వాహనాలకు బ్యాటరీతో నడిచే లైట్లను అమర్చింది. లైట్లు అమర్చడానికి ‘ఇన్‌స్టాల్‌ లైట్స్‌ ఆన్‌ బైస్కిల్‌’ అని రాసిన ఉన్న ప్లకార్డు పట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఎంతోమందికి అవగాహన కల్పించింది. అప్పట్లో ఖుషీ చేసిన ఈ పనిని ఓ ఐఏఎస్‌ అధికారి వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో తెగ వైరల్‌ అయ్యింది. ఈ విషయం తెలిసిన ఎనభైమంది యువకులు ఖుషీతో కలిసి సైకిళ్లు, ట్రక్కులకు, ఇతర వాహనాలకు లైట్లు అమర్చడంలో ఖుషీకి సాయంగా నిలిచారు.

పాఠాలతో పైసలు సంపాదించి...
ఖుషీ చేస్తోన్న సామాజిక కార్యక్రమాలకు నిధులు చాలా కావాలి. ఇందుకు తన తండ్రి, బంధువులు సమకూర్చిన మొత్తం ఏమాత్రం సరిపోలేదు. దాంతో యూట్యూబ్‌లో ‘లా’ తరగతులు చెప్పడంతోపాటు, ఇతర పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ్త నెలకు అరవై నుంచి డెబ్భై వేల వరకు సంపాదించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

మహిళలకు అండగా...
బాలికలకు శానిటరీ ప్యాడ్‌ ల గురించి అవగాహన కల్పించడం, విద్యుత్‌ సదుపాయం లేని వారికి సోలర్‌ ల్యాంప్స్‌ అందించడం, ‘జీవిక సాథీ’ ప్రాజెక్టు పేరుతో దివ్యాంగ మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలకు కుట్టుమిషన్, జ్యూవెలరీ తయారీలో శిక్షణ ఇప్పించి వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేయడం వంటి సేవా కార్యక్రమాలతో  ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.  

మరిన్ని వార్తలు