పట్టణాలకు పల్లె కళ...

30 Sep, 2014 23:27 IST|Sakshi
పట్టణాలకు పల్లె కళ...

మహిళా స్వావలంబన

‘అక్కా! మేం చేసిన ఈ వస్తువులను పట్టణంలోని వారు వాడతారా?!’ ఓ చెల్లెలి సందేహం.
‘అక్కా, మిగతా వాటిలాగానే వీటినీ కొన్ని రోజులు వాడి, పడేస్తారా?’ ఇంకొకరి అనుమానం...
‘అసలు ఈ వస్తువులు కొంటారంటావా అక్కా!’ మరొకరి సంశయం..


ముప్ఫై ఐదేళ్ల వీణా ప్రకాష్ సింగ్ వారడిగిన ప్రశ్నలన్నింటికీ ఎంతో ఓపికగా సమాధానమిస్తారు. అంతే ఓపికగా వారి చేత పట్టణాలలో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయించి, వారు చేసిన కళాకృతుల విలువను నలుగురికి తెలియజేస్తారు. వారి చేతుల్లో రూపుదిద్దుకుంటున్న కళాకృతులు ఏ నమూనాలో ఉండాలో వివరిస్తారు. వారి కళను పట్టణ ప్రజల ఇళ్లలో పరిమళాలు వెదజల్లేలా చేయడమే కాదు, వారికి ఉపాధి కల్పిస్తూ అండగా నిలుస్తున్నారు వీణా ప్రకాష్ సింగ్.
 
వీణా ప్రకాష్ సింగ్‌కి ప్రయాణాలంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే డిగ్రీ చేసిన ఆమె జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. వీణ పూర్వీకులది పశ్చిమ బెంగాల్ అయినా ఆమె పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! తండ్రి సూర్యప్రకాష్, తల్లి సూర్యకాంతం. ఇద్దరూ స్వచ్ఛంద సంస్థలలో పనిచేస్తూ, పేదలకు సాయపడుతుంటారు. తల్లితండ్రుల నుంచి స్ఫూర్తి పొందిన వీణ తనూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చూపారు. అందులో భాగంగా దేశమంతా తిరిగారు. ముఖ్యంగా తన పూర్వీకుల స్వస్థలమైన పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లోని గ్రామాలన్నీ తిరిగారు. అక్కడి మహిళల అమాయకత్వాన్ని, వారు పడుతున్న ఇబ్బందులనూ దగ్గరగా గమనించారు. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్, రాజస్థాన్‌లోని సిరోహీ గ్రామాల స్త్రీలను కలిసినప్పుడు మాత్రం వారికి ఉన్న కళా నైపుణ్యం పేదరికం మాటున ఎలా మరుగున పడుతోందో గమనించారు.

ఇప్పటికీ అక్కడి ఆడపిల్లలకు బాల్యంలోనే పెళ్లిళ్ళు జరిపించడం, చిన్న వయసులోనే వారు పిల్లలతో కుటుంబం నడపలేక పడుతున్న స్థితిని కళ్లారా చూశారు. అప్పుడే వారికి సహాయ పడాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని సంకల్పించుకున్నారు వీణ. తన ఆలోచనలకు భర్త కార్తీక్ సింగ్ ఊతమిచ్చారు. వి.కె.శరణ్య పేరుతో ఒక సొసైటీని ఏర్పాటు చేసి, పాతికమంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించే దిశగా ముందుకు కదిలారు. ఆ విధంగా మట్టి కళాకృతులు, నారతో చేసిన బొమ్మలు, సంచులు, పేపర్‌తో చేసిన బొమ్మలు.. స్త్రీల చేతుల్లో కొత్తగా ప్రాణం పోసుకోవడం మొదలుపెట్టాయి.
 
ఆలోచనే పెట్టుబడి...
వీణలాగే ఆమె భర్త కార్తీక్ సింగ్ కూడా కళాప్రియుడే! అంతేకాదు నలుగురికీ చేయూతనివ్వాలని తపించే వ్యక్తి. తనకు వచ్చిన చిత్రకళను పేద పిల్లలకు పరిచయం చేయాలని మురికివాడలను సందర్శించి, అక్కడి పిల్లలకు పెయింటింగ్‌లో శిక్షణ ఇస్తుంటారు. ‘ఈ పెయింటింగ్ మోడల్స్‌ని నేను గ్రామీణ మహిళల దగ్గరకు తీసుకెళతాను. రకరకాల చేతివృత్తులలో వాటిని మేళవించేలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఆ విధంగా మహిళల చేతుల్లో తయారయ్యే బొమ్మల్లో వైవిధ్యం కనిపిస్తుంది. అంతే కాదు, వారి ఆత్మ ఆ కళాకృతుల్లో కనిపిస్తుంది. అందుకే ఇవి ఆధునికులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

వీరి కళాకృతులతోనే కలకత్తా, ముంబయ్‌లలో ఎగ్జిబిషన్‌లు నిర్వహించాను.హైదరాబాద్‌లో ‘ఆల్పోనా’ పేరుతో హస్తకళాకృతుల  విక్రయదుకాణాన్ని ఏర్పాటు చేశాను. దీంట్లో వచ్చిన ఆదాయాన్ని కళాకృతుల తయారీ మహిళలకు అందజేస్తున్నాను’ అంటూ రెండున్నరేళ్లుగా తాను చేస్తున్న కృషి గురించి వివరించారు వీణ.

స్వచ్ఛంద సంస్థలతో కలిసి...: ఉపాధి అవకాశాలు పెంచేందుకుగాను క్రాఫ్ట్స్‌తో పాటు హ్యాండ్లూమ్ ప్రింట్స్ కూడా నేర్పిస్తున్నారు వీణ. ఉన్న కళలతో పాటు, కొత్త కళలను నేర్పుతూ అవకాశాలు పెరిగేందుకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి రాజస్థాన్ బాంద్రా మురికివాడల్లో హెల్త్ క్యాంపులు, హైదరాబాద్‌లో స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్, బ్యాగులు, ముంబయ్‌లోని మురికివాడల పిల్లల కోసం రంగస్థల తరగతుల నిర్వహణ, పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో వృద్ధాశ్రమం, హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్‌లో రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవలో పాలు పంచుకుంటున్నారు. గ్రామీణ ప్రజలకు ఆదాయ వనరుల మార్గాలు, పొదుపు పథకాల గురించి వివరిస్తూ సామాజిక బాధ్యతగా తన వంతు కృషి చేస్తున్నారు.
 
గ్రామీణ మహిళకు ఉపాధి...
‘గ్రామీణ కళాకృతులకు పట్టం కట్టాలనేది నా ఉద్దేశ్యం. అందుకే ఇదే తరహా కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాలలోనూ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఇందుకు కొన్ని గ్రామాలను ఇప్పటికే ఎంచుకున్నాను. ఆ గ్రామాలకు వెళ్లి, అక్కడి పరిస్థితులను, చేతివృత్తుల ప్రత్యేకత.. వివరాలు తెలుసుకొని వందలాది మంది నిరుపేద గ్రామీణ స్త్రీలకు ఉపాధి కల్పించాలనుకుంటున్నాను’ అని చెబుతున్న వీణకు గ్రామీణ మహిళలు స్వావలంబన సాధించేలా చేయడమే లక్ష్యం. ఆమె ఆశయం నెరవేరాలని ఆకాంక్షిద్దాం.

- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, ఫొటోలు: శివ మల్లాల

మరిన్ని వార్తలు