భూ కైలాస్‌

25 Aug, 2017 00:14 IST|Sakshi
భూ కైలాస్‌

నాటి  సినిమా
శివసుతుని దివ్య చమత్కారం.

శివుడు భక్త సులభుడు. రావణుడు భక్త ధురంధరుడు. శివుడికి భక్తుడు కావాలి. రావణుడికి శివుడు కావాలి. ఈ రెండూ విచక్షణ కోల్పోతే మానవులకూ దేవతలకూ ఉపద్రవం వచ్చి పడుతుంది. దానిని నిలువరించే శక్తి కావాలి. ఆ శక్తే విఘ్నేశ్వరుడు. చివరి నిమిషంలో ఆయన చూపిన చమత్కారమే ‘భూ కైలాస్‌’ కథ.

రావణుడు విశిష్ట శివభక్తుడు. రావణుడి తల్లి కైకసి నిత్య హరనామస్మరణలో తరియించే భక్తాగ్రేసరురాలు. ఆమె ప్రతినిత్యం సముద్రపు ఒడ్డున సైకత లింగం ప్రతిష్ఠించి దానికి పూజలు చేసి ఆ ప్రసాదాన్ని తన పుత్రుడు రావణుడికి ఇస్తుంటుంది. ఆ ప్రసాద బలమే రావణుడి మహాబలం. ముల్లోకాలను గడగడలాడించగల ప్రచండబలం. అప్పటికే రావణుడు భూలోకాన్ని జయించాడు. అంతటితో తృప్తి తీరక అమరపురిపై దండెత్త దలిచాడు. అదే గనక జరిగితే దేవేంద్రుని పీఠం కదిలిపోతుంది. నారాయణుని ఉనికికి సవాలు ఎదురవుతుంది. నారదుడు ఇది గ్రహించి దేవేంద్రుణ్ణి రావణుడిపై ఉసిగొలుపుతాడు. కైకసి ఆరాధించే సైకత లింగపూజను భగ్నం చేసి ఆ ప్రసాద బలం రావణుడికి అందకుండా చేయమంటాడు.

దేవేంద్రుడు అలలలో దూరి సైకత లింగాన్ని కబళిస్తాడు. పూజను నీటిపాలు చేస్తాడు. కైకసి దీనిని దుశ్శకునంగా భావిస్తుంది. శివుడికి అపచారం జరిగిందని తల్లడిల్లుతుంది. తల్లి వేదనను గ్రహించిన రావణుడు నిత్యం తయారు చేసుకునే సైకత లింగమేలా... ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని ఏకంగా అతని ఆత్మలింగమే తీసుకొని వస్తానని శపథం చేస్తాడు. ఏదో చేయబోతే ఏదో అయినట్టు అదే గనక జరిగితే భూలోకమే కైలాసం అవుతుంది. దేవగణాలన్నీ ఆత్మలింగం ఉన్న చోటుకే తరలివచ్చి దేవపురి దివాలా తీస్తుంది. అందుకే దేవేంద్రుడు రావణుని ఘోర  తపస్సును భగ్నం చేయబూనుకుంటాడు. త్రాచులను వదులుతాడు. కొండ చిలువలను చుట్టబెడతాడు. అప్పటికీ చలించకపోతే ఆఖరు అస్త్రంగా దేవ వేశ్యలను దించుతాడు. అయినప్పటికీ రావణుడు బెసకడు. లొంగడు. సంకల్పం నుంచి చెదరడు.

ఆ తపస్సుకు మెచ్చి శంకరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు. మరు నిమిషంలో ఆ ఆదిదేవుడు భక్తుని కోరిక మేరకు ఆత్మలింగం సమర్పించేవాడే. కాని అంతలోనే విష్ణువు విష్ణుమాయను చూపుతాడు. రావణుడిలో మాయను ప్రవేశపెట్టి ఆత్మలింగానికి బదులు ఏకంగా పార్వతినే తన పత్నిగా చేయమని అడిగేలా చేస్తాడు.జగన్మాతను ఆశించిన ఆ కోరిక నాశన హేతువు. అయినప్పటికీ వచనబద్ధుడైన శివుడు ఇచ్చిన మాట కాదనలేక పార్వతిని రావణుడికి అప్పజెప్పుతాడు. శివ వియోగంతో తల్లడిల్లిన పార్వతి దీనికంతటికీ కారణం విష్ణుమాయ అని గ్రహించి ‘ఓ నారాయణుడా... నా వియోగబాధ నీకు అర్థమవ్వాలంటే భూలోకాన మానవ జన్మ ఎత్తి సతీ వియోగంతో ఇంతకింత బాధ అనుభవించు’ అని శపిస్తుంది.

అది విని నారదుడు ఆనందబాష్పాలు రాలుస్తాడు.ఎందుకంటే రావణుడి అంతం రాముడి చేతిలో ఉంది. రాముడి జన్మకు ఈ శాపమే కారణమవుతోంది.ఈ శాపం ఇచ్చాక పార్వతి రావణుణ్ణి మాయ చేసి తిరిగి శివుని సన్నిధికి చేరుకుంటుంది. మరోవైపు రావణుడు పాతాళ లోకాధిపతి అయిన మయాసుర కుమార్తె మండోదరిని చూసి ఆమే మాయారూపంలో ఉన్న పార్వతి అనుకుని ఆమెను కాంక్షిస్తాడు. వివాహం చేసుకుని లంకకు తీసుకుని వస్తాడు.సాక్షాత్తూ పార్వతీదేవిని వివాహం చేసుకుని వచ్చిన రావణుణ్ణి చూసి రావణుని తల్లి కైకసి హతాశురావుతుంది. శివద్రోహి, మాతృద్రోహి అంటూ రావణుణ్ణి దూషిస్తుంది. అప్పటికిగాని రావణుడిలోని విష్ణుమాయ వదిలిపోదు. ఆత్మలింగానికి బదులు పార్వతీదేవిని వాంఛించడం, మండోదరిని పార్వతి దేవే అనుకొని వివాహం చేసుకోవడం ఇవన్నీ గుర్తుకు వచ్చిన రావణుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. మండోదరిని భార్యగా స్వీకరించి ఈసారి నిజంగా ఆత్మలింగం సాధించుకొని రావడానికి బయలుదేరుతాడు.

ఘోర తపస్సు జరుగుతుంది. రావణుడు తన తలను ఖండించుకుని శివుడికి అర్పణం చేస్తాడు.శివుడు మరి నిలువలేక ప్రత్యక్షమై వక్షస్థలం నుంచి దివ్య తేజస్సుతో ప్రజ్వరిల్లుతున్న ఆత్మలింగాన్ని పెకలించి రావణుని చేతిలో పెడతాడు. ‘లంకకు చేరుకునే వరకు ఈ లింగాన్ని నేలకు దించకు. ఎక్కడ దించితే అక్కడే అది స్థిరపడిపోతుంది. దానిని కదల్చడం స్వయంగా నా వల్ల కూడా కాదు’ అని చెప్తాడు.
రావణుడు ఆత్మలింగం తీసుకుని బయలుదేరుతాడు.అదే జరిగి ఆత్మలింగం లంకకు చేరితే రావణుడు మరింత శక్తిమంతుడవుతాడు. మరింత పెట్రేగుతాడు. అందుకనే నారదుడు విఘ్నేశ్వరుణ్ణి శరణుజొచ్చుతాడు.‘విఘ్నేశ్వరా. నీకు ప్రథమ పూజ చేయకుండా  అవిఘ్నంగా రావణుడు ఆత్మలింగాన్ని పట్టుకు పోతున్నాడు’ అని నివేదిస్తాడు. విఘ్నేశ్వరునికి కోపం వస్తుంది. ‘రావణుడు అంత పని చేస్తాడా’ అని బ్రాహ్మణ బాలుని రూపంలో రావణుడి దారిలో కాపు కాస్తాడు.

ఇదే అదనుగా విష్ణుమూర్తి తన చక్రాన్ని సూర్యుడికి అడ్డం పెట్టి సంధ్యా సమయాన్ని సృష్టిస్తాడు. అది గమనించిన రావణుడు సంధ్య వార్చడానికి వెళ్లి వస్తానని దారిలో కనిపించిన విఘ్నేశ్వరుని చేతిలో ఆత్మలింగాన్ని పెడతాడు. తాను వచ్చే వరకు దానిని నేలకు దించవద్దని సూచిస్తాడు.కాని మాయా రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు ‘నేను ముమ్మార్లు నిన్ను పేరు పెట్టి పిలుస్తాను. వచ్చావా సరేసరి. లేదంటే లింగాన్ని కింద పెట్టేస్తాను’ అంటాడు. రావణుడు సంధ్య వారుస్తుండగా గబగబా ముమ్మార్లు రావణుని పేరు పిలిచి లింగాన్ని నేలకు దించేస్తాడు. ఇంకేముంది. ఆత్మలింగం తక్షణమే అదే స్థలిలో ప్రతిష్టితమైపోతుంది.

రావణుడు ఎంతో విలపిస్తాడు. విఘ్నేశ్వరుణ్ణి దుర్బాషలాడతాడు. తల మీద మొట్టుతాడు. లింగాన్ని ఊడ పెరకడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. తుదకు ఆత్మలింగాన్ని అక్కడే వదిలిపెట్టి లంకకు పయనమవుతాడు. అలా అసురుని బారిన పడాల్సిన ఆత్మలింగం విఘ్నేశ్వరుని పుణ్యమా అని భూలోకాన ప్రతిష్టితమై మానవుల పూజలను అందుకునే దివ్యలింగంగా నేటికీ అలరారుతోంది.అలా ఆత్మలింగం ప్రతిష్టితమైన పుణ్యక్షేత్రమే కర్నాటకలో ఉన్న గోకర్ణం. అక్కడ పూజలందుకుంటున్న మహాబలేశ్వర లింగమే నాటి ఆత్మలింగం.

‘గోకర్ణం’ క్షేత్ర కథ ఆధారంగా ఏ.వి.ఎం ప్రొడక్షన్స్‌వారు 1958లో తీసిన చిత్రమే ‘భూకైలాస్‌’. ఎన్టీఆర్‌ రావణాసురుడిగా, జమున మండోదరిగా, అక్కినేని నారదుడిగా నటించిన ఈ సినిమా ఆబాలగోపాలాన్ని అలరించి హిట్‌గా నిలిచింది. తమిళనాడులో రావణుడికి ఉన్న ఆదరణ దృష్ట్యా ఇదే సినిమా అక్కడ ‘భక్త రావణ’గా అనువాదమై విడుదలైంది. నిజానికి ఈ సినిమా రావణుని అమాయక, అచంచల భక్తికి ఒక మచ్చుతునక. శివుని మీద అతడికున్న భక్తి, అతడి వీరత్వం, నిజాయితీ దేవతల పథక రచన, పన్నాగం ఈ సినిమాలో కనిపిస్తాయి. అందరూ కలిసి రావణుని దారి మళ్లించి అతడికి  దక్కవలసిన ఆత్మలింగాన్ని దక్కకుండా చేస్తారు.అయినప్పటికీ రావణుడు అఖండ శివభక్తునిగా పురాణాల్లో నమోదయ్యాడు.

అతని వంటి శివభక్తుడు మరొకడు లేదు. ఎన్టీఆర్‌ రావణుని పాత్రను పాలధార వంటి స్వచ్ఛతతో పోషించి ఆకట్టుకుంటే అక్కినేని నారద పాత్రకు ఉండాల్సిన వంచనా శిల్పాన్ని ప్రదర్శించి మెప్పిస్తారు. సముద్రాల మాటలూ పాటలూ అందించిన ఈ సినిమాకు ఆర్‌. సుదర్శనం సంగీతం అందించారు. ‘దేవ దేవ ధవళాచల మందిర’... , ‘నీలకంధరా దేవా’..., ‘రాముని అవతారం రవికుల సోముని అవతారం’... పాటలు రంజింప చేస్తాయి. రావణుని తపస్సును భగ్నం చేయడానికి వచ్చిన దేవ కన్యగా సుప్రసిద్ధ డాన్సింగ్‌ స్టార్‌ హెలన్‌ కనిపించి ‘సుందరాంగ అందుకోరా’ పాటలో అలరిస్తుంది. ఆ పాట కూడా హిట్టే. పురాణాల్లో అసురులే గొప్ప దైవభక్తులు. వారి వరాల్లో దోషం వుండొచ్చుగాని వారి భక్తిలో లేదు. ‘భూకైలాస్‌’ కూడా అటువంటి ఉదంతానికి ఒక ఉదాహరణ.               
               
తొలి పూజ గణపతికే
ఉత్తర కర్నాటక జిల్లాలో అరేబియా సముద్రం ఒడ్డున ‘గోకర్ణం’ క్షేత్రం ఉంది. ఇక్కడే ఆత్మలింగ క్షేత్రంగా చెప్పుకునే మహాబలేశ్వర ఆలయం ఉంది. పూర్తిగా భూమిలోకి ఉన్నట్టుగా ఉండే ఈ లింగం నిత్యం నిజ రూపంలో దర్శనం ఇవ్వకపోయినా పన్నెండేళ్లకొకసారి ఇచ్చే నిజ దర్శనంలో దీని పైకొస చేతులతో లాగినట్టుగా ఉండటం చూడవచ్చు. రావణుడి చేతి గుర్తులు ఈ లింగంపై ఉంటాయంటారు. అలాగే ఈ క్షేత్రంలో మహాగణపతి ఆలయం ఉంది. ఆ మూల విరాట్టు శిరస్సు మీద చిన్న సొట్ట ఉంటుంది. ఇది ఆనాడు రావణుడు చేతితో మొట్టడం వల్ల పడిన సొట్టగా అభివర్ణిస్తారు. ఈ క్షేత్రంలో ఆత్మలింగాన్ని దర్శించుకోవాలంటే ముందుగా మహా గణపతిని పూజించాలి. ఆనాడు తనకు తొలి పూజ జరగకపోవడం వల్ల కోప్పడిన వినాయకుడు అందుకు ప్రతిఫలంగా ఈనాడు ఇక్కడ తొలిపూజలు అందుకుంటున్నాడన్న మాట.
 – కె

మరిన్ని వార్తలు